Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
పరశురాముడు వినలేదు. బంధు మిత్ర సహితముగా భీష్ముని నాశనము చేతునని నిప్పులు కక్కినాడు.
"గురుదేవా! లోక విరుద్ద మార్గమును అనుసరించిన గురువును అయినను దండించవలెనని పెద్దలు చెప్పుదురు. నీవు నాకు నేర్పిన అస్త్ర శస్త్రములే నాకు సైన్యము అగును. ఇదిగో నా గురువునకు నమస్కరించుచున్నాను. యుద్దమునకు సిద్దముగా ఉన్నాను. ఆయుధము అందుకొనుము. శస్త్రము ప్రయోగించుము" అని నిలిచినాడు.
పరుశురామునకు భీష్మునకు భీషణ సంగ్రామము జరిగినది. పగలంతయు యుద్దము సాగినది. భీష్ముడు రాత్రికి హస్తినకు వెళ్ళువాడు. మరల ఉదయము తిరిగి వచ్చువాడు. ఆవిధముగా ఇరువది మూడు రోజులు యుద్దము జరిగినది. ఉభయులు ఘోరమయిన అస్త్రములను ప్రయోగించినారు. ఒకసారి భీష్ముడు , ఒకసారి పరుశురాముడు మూర్చగిల్లినారు. ఇదువురి బలములు సమముగా ఉన్నవి.
ఇరువది మూడవ నాటి రాత్రి భీష్ముడు వ్యాకులుడు అయినాడు. పరశురాముని జయించు బలము ప్రసాదించవలసినదని దేవ బ్రాహ్మణులను ప్రార్ధించినాడు. ఆనాటి తెల్లవారుజామున భీష్మునకు స్వప్నమున ఎనిమిది మంది బ్రాహ్మణులు దర్శనము ఇచ్చినారు. సమ్మోహనాస్త్రమును ప్రసాదించినారు. అదృశ్యులు అయినారు.
ఇరువది నాల్గవ రోజు భీష్ముడు యుద్దమునకు వచ్చినాడు. ఆనాడు పరశురాముడు రుద్రుడు అయినాడు. అనేక అస్త్రములను ప్రయోగించినాడు. భీష్ముడు శస్త్రములను ప్రయోగించినాడు. పరశురాముని మూర్చిల్ల చేసినాడు. మూర్చ నుంచి లేచిన పరశురాముడు దావాగ్ని అయినాడు. బ్రహ్మాస్త్రమును విడిచినాడు. భీష్ముడు సహితము బ్రహ్మస్త్రమును ప్రయోగించినాడు. ఉభయ అస్త్రముల పోరునకు ఆకాశము ప్రజ్వరిల్లినది. సకల భూతములు సంక్షిభించినవి.
భీష్మ్దుడు సమయము చూచినాడు. సమ్మోహనాస్త్రము తీసినాడు. ప్రయోగించబోయినాడు. అప్పుడు 'వలదు వలదు ప్రయోగించవలదు" అని నారదుడు దిగినాడు. భీష్ముని ఆపినాడు. ఎనిమిది మంది బ్రాహ్మణులు దేవతలను దిగివచ్చినారు. "పరశురాముడు నీకు గురువు అతనిని వధించరాదు" అని శాంతింప చేసినాడు.
పరశురాముని తండ్రి జమదగ్ని మున్నగు పితృదేవతలు దిగి వచ్చినారు. "భీష్ముడు అష్టవసు స్వరూపుడు. అతనిని గెలుచుట నీకు శక్యముకాదు" అని పరశురాముని శాంతింప చేసినారు.
భీష్ముడు అస్త్రము విడిచినాడు. పరశురాముని వద్దకు వెళ్ళినాడు. సాష్టాంగ దండ ప్రణామము చేసినాడు.
పరశురాముడు ప్రసన్నుడు అయినాడు. భీష్ముని లేవనేత్తినాడు. కౌగలించుకున్నాడు. "భీష్మా! నీశక్తికి సంతోషించుచున్నాను. నీభక్తికి మెచ్చినాను" అన్నాడు.
అంతటితో సమరము ముగిసినది. భీష్ముడు హస్తినకు వెళ్ళినాడు. నారదాదులు వెళ్లి పోయినారు.
అంబ పరశురాముని ముందు చేతులు జోడించి నిలిచినది. 'అంబా! నీ కొఱకు నేను చేయవలసినది చేసినాను. యుద్దమున భీష్ముడే గెలిచినాడు. ఇక నీ దారి నీవు చూచుకొనుము" అన్నాడు పరశురాముడు.
"మహాత్మా!" అంబ అన్నది "నీకు శ్రమ కలిగించినాను. నీవు నాకొరకు యుద్దము చేసినావు. కృతజ్ఞతలు. నీకు సాధ్యము కానిపని నీవు చేయలేవు. నేను తపస్సు చేసి సాధింతును. ఈ జన్మమున కాకున్న మరుజన్మమున నయిన భీష్ముని సంహరింతును."
పరశురాముడు అంబ ప్రతిన విన్నాడు. పలుకలేదు. ముని గణములతో మహేంద్రగిరికి వెళ్ళిపొయినాడు.
అంబ తన పట్టు వదలలేదు. యమునా తీరమునకు వెళ్ళినది. తపస్సు చేసినది. కాశికశ్రమము, సిద్దాశ్రమాదులకు వెళ్ళినది. కఠిన తపస్సు చేసినది. అప్పుడు ఆమెకు గంగ కనిపించినది.
"అంబా! నీ తపస్సు నిర్మలము కాదు. కుటిలము. కుటిల తపస్సులు ఫలించవు. పగబూని తపము చేయరాదు. భీష్ముడు అజేయుడు. తపము మానుము" అని బోధించినది.
అంబ వినలేదు. "ఈజన్మమున కాకున్న మరు జన్మమున నయిన భీష్ముని సంహరింతును" అని ప్రతిజ్ఞ చేసినది.
'అంబా! నీవు ఈదేహమును విడిచి నదివి అయి ప్రవహితువు గాక" అని శపించినది గంగ. వెళ్ళిపొయినది.
గంగ శాపమునకు అంబ జంకలేదు. ఆమె పట్టు విడువలేదు. మత్స్య దేశమునకు వెళ్ళినది. ఘోర తపస్సు ప్రారంభించినది. ఆ తఫఫలమున అర్ధ భాగము "అంబ" అనునది అయి మత్స్య దేశమున ప్రవహించినది. మిగిలిన అర్ధ భాగపు తపస్సునకు తన దేహము నిలుపుకున్నది.
అంబ గంగ శాపమును కొట్టివేసినది. గంగను గెలిచినది. గంగ కొడుకును గెలుచుటకు పుణ్యాశ్రమములకు వెళ్ళినది. ఒంటరిగా, ఎవరి సాయము లేక అతిఘోరమయిన తపస్సు చేసినది. ఆమె తపస్సునకు మేచ్చినాడు రుద్రుడు. ప్రత్యక్షము అయినాడు. "వరము కోరవలసినది" అన్నాడు.
అంబ చేతులు జోడించినది. రుద్రుని స్తుతించినది. "మహాత్మా! రుద్రదేవా! నేను భీష్ముని చంపవలెను. అట్టి వరమును నాకు ప్రసాదింపుము" అని ప్రార్ధించినది.
"అంబా! నీకోరిక ఫలించును. నీవు ఈ శరీరమును విడిచిన తరువాత ద్రుపద రాజునకు కూతురుగా జన్మింతువు. తరువాత పుత్రరూపము దాల్తువు. అప్పుడు నీవు యుద్దమున భీష్ముని సంహరింతువు" అని చెప్పి రుద్రదేవుడు అంతర్దానుడు అయినాడు.
అంబ సంతోషించినది. ఈ దేహము రాలునంత వరకు ఆమెకు ఓపిక లేకపోయినది. అదే రోజున కట్టెలను పెర్చినది. కట్టెలకు నిప్పు పెట్టినది. నిప్పు అంటుకున్నది. అగ్ని నాల్కలు చాచి మండసాగినది. అంబ అగ్నికి నమస్కరించినది. ప్రదక్షిణములు చేసినది. "భీష్ముని చంపుటకు ఆహుతి అగుచున్నాను" అని అగ్నిలో దూకినది.
అంబ అగ్నికి ఆహుతి అయినది.
అది చూచి, విని మునులందరు ఆశ్చర్యచకితులు అయినారు.
అక్కడ ద్రుపద రాజునకు సంతానము లేదు. అతడు శివుని గురించి తపస్సు చేసినాడు. శివుడు ప్రత్యక్షము అయినాడు. "ద్రుపదా! నీ తపస్సునకు మెచ్చినాను. వరము కోరుము" అన్నాడు.
ద్రుపదుడు శివునకు మ్రొక్కినాడు. కీర్తించినాడు. "శివదేవా! నాకు భీష్ముని సంహరించగల పుత్రుని ప్రసాదింపుము" అని ప్రార్ధించినాడు.
"రాజా! శివుడు వచించినాడు. "నీకు మొదట కూతురు కలుగును. ఆమె పురుషుడు అయి భీష్ముని వధించును."
శివ దేవుడు వరమును ఇచ్చినాడు. అంతర్దానుడు అయినాడు. ద్రుపదుడు తన రాజ్యమునకు చేరినాడు. వరమును గురించి భార్యకు వివరించినాడు. ద్రుపదుని భార్య గర్బమున అంబ యొక్క చైతన్యము ప్రవేశించినది. ఆమె గర్బము దాల్చినది. నెలలు నిండినవి. ఆమె రహస్యముగా ప్రసవించినది. ఆమెకు కూతురు కల్గినది. ద్రుపదరాజ దంపతులు ఆవిషయమును దాచి పెట్టినారు. తమకు పుత్రుడే కలిగినాడని వెల్లడించినారు. పుత్రునకు వలెనె జాతకర్మములు జరిపినారు. "శిఖండి" అని పేరు పెట్టినారు.





