Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

    గర్వము నిండిన వానికి అవమానమే మిగులును.
3. కర్ణుడు విశ్వాసపాత్రుడు. కృతజ్ఞుడు. ఇందుకు అనేక నిదర్శనములు ఉన్నవి. కాని అతడు పరాక్రమము కనపరచిన సంఘటనలు కనిపించవు. అర్జునునితో తలపడవలసి వచ్చినపుడు అతడు ఎన్నడు గెలువలేదు. రెచ్చగోట్టుట దుర్బాషలాడుట, అతని నైజములు. కర్ణుడు అర్జునుని ఓడించగలడని దుర్యోధనుడు మాత్రము నమ్మినాడు. అదియు అతని మాటలకు చూచి చేతలను చూచికాదు.
    బలము తెలియక నమ్ముకున్నవాని నమ్మకము వమ్ము కాక తప్పదు.
4. పాండవులు గెలుతురు అనుటకు భీష్ముడు కారణములు చూసినాడు. "పాండవులు గుండె నుండి ఉన్నారు తెగించి పోరాడుదురు" అని. ఇది నిజము పాండవులు రాజ్యమును పోగొట్టుకున్నారు. దానిని సాధించవలెననని పట్టుదల వారికి ఉన్నది. అందువలన వారి గెలుపు నిశ్చయము.
    వియాత్నాం చాల చిన్న దేశము. అమెరికా వంటి బలవత్తును దేశము దెండెత్తినది. తమ దేశమును రక్షించుకొని వలెనను దీక్షతో వియాత్నాం ప్రజలు పోరాడినారు. ప్రజాబలము ముందు అమెరికా తలవంచక తప్పలేదు.
    దీక్ష గలవాడు గెలుచుట నిశ్చయము.
    ధన బలము, ఆయుధ బలము ఓడుట తధ్యము.
    
                                                      శిఖండి కధ
    
    ఇందుకు సంబంధించిన పూర్వకద అది పర్వము నందు ఉన్నది.
    శంతనుడు గంగ వలన భీష్ముని కన్నాడు. శంతనుడు సత్యవతిని వివాహమాడినాడు. ఆమెకు చిత్రంగదుడు, విచిత్ర వీర్యుడు  అను పుత్రులు కలిగినారు. శంతనుడు స్వర్గస్థుడు అయినాడు. చిత్రాంగదుడు స్వల్పకాలములోనే మరణించినాడు. మిగిలిన వాడు విచిత్రవీర్యుడు. అతడు చిన్నవాడు. అయినను అతనికే పట్టము కట్టినాడు. భీష్ముడు. రాజ్యపాలనము చేసినాడు.
    విచిత్రవీర్యునకు వివాహపు వయసు వచ్చినది. కాశీరాజు తన కన్యలకు స్వయంవరము ప్రకటించినాడు. భీష్ముడు అది తెలుసుకున్నాడు. కాశీ రాజ్యమునకు వెళ్ళినాడు. అక్కడికి అనేకమంది రాజులు వచ్చినారు. వారందరు చూచుచండగా కాశీరాజు పుత్రికలు అయిన అంబ, అంబిక, అంబాలికలను, పట్టుకొని రధమునందు ఎక్కించుకున్నాడు. రాజులందరు భీష్ముని ఎదిరించినారు. భీష్ముడు వారిని అందరిని ఓడించినాడు. కన్యలను తీసుకొని హస్తినకు బయలుదేరినాడు. మార్గమున సాల్యుడు అడ్డుకున్నాడు. అతనిని ఓడించి కన్యలను హస్తినకు చేర్చినారు.
    తెచ్చినవారు ముగ్గురు కన్యలు అంబ. అంబిక. అంబాలిక. వారిలో అంబ తాను సాల్వుని ప్రేమించినానని అన్నది. సాల్వుడు సహితము తనను ప్రేమించినాడు. అందువలన తాను విచిత్రవీర్యుని వివాహము ఆడను అని భీష్మునితో చెప్పినది. భీష్ముడు అంబ మాట మన్నించినాడు. ఆమెను విడిచి పుచ్చినాడు.
    అంబ హస్తిన నుండి బయలుదేరినది. ఆమె సుబలదేశము చేరినది. సాల్యుని చూచినది. తనను పెళ్ళాడమని కోరినది.
    "అంబా! భీష్ముడు నన్ను ఓడించినాడు. నిన్ను తీసుకొని పోయినాడు. ఇప్పుడు నిన్ను నేను భార్యగా గ్రహించలేను. నీవు మరొకరి దానపు అయినావు" అన్నాడు.
    అంబ మనసు చితికినది. ఆమె అనేక విధముల సాల్వుని ప్రార్ధించినది. సాల్వుడు వినలేదు. ఆమెను వెళ్ళగొట్టినాడు.
    అంబ మనసున అవమాన జ్వాల రగిలినది. ఆమె సాల్వుని తప్పు పట్టలేదు. భీష్ముడే ఇందుకు కారణము అని నిర్ణయించినది. భీష్ముని మీద నిప్పులు చెరిగినది. భీష్ముని సాధించవలెనని ప్రతిన పూనినది. ప్రతిజ్ఞ చేసినది.
    భీష్ముడు మహావీరుడు. అతనిని ఏరాజులు గెలువలేరు. ఈ విషయమును అంబ గ్రహించినది. తపస్సు చేసి సాధించవలెనని నిర్ణయించినది. భీష్ముని మీద మునులు నివసించు పుణ్య భూమికి వెళ్ళినది. తన గోడు వెళ్లిపోసుకున్నది. తాను తపస్సు చేతునని తపోమహిమతో భీష్ముని సాధింతునని విన్నవించినది. మునులు ఆమె విన్నపమును అంగీకరించలేదు.
    అప్పుడు అక్కడికి "హోత్రవాహనుడు' అను రాజర్షి వచ్చినాడు. అతడు అక్కడ అంబను చూచినాడు. ఆమె కధ విన్నాడు. ఆమె తనకు దౌహిత్రి అని తెలుసుకున్నాడు. 'అంబా! నీవు పరశురాముని  ఆశ్రయింపుము. అతడు నిన్ను రక్షింపును. ఆపదల నుండి కాపాడును." అన్నాడు. అంబ పరశురాముడు ఉండు మహేంద్ర పర్వతమునకు వెళ్ళుటకు నిశ్చయించినది.
    ఆరోజు ఆకృత ప్రవణుడు అక్కడికి వచ్చినాడు. పరశురాముడు తన శిష్యులతో రేపు ఇక్కడికి వచ్చునని చెప్పినాడు.
    అంబ రేపటి కొఱకు ఎదిరిచూచినది. ఆరాత్రి ఆమెకు నిదురలేదు. ఎదిరిచూచిన రేపు వచ్చినది. పరశురాముడు విచ్చేసినాడు. హోత్రవాహనుడు అంబను పరశురామునకు చూపినాడు. ఆమె వృత్తాంతమును తెలియబరచినాడు. సాయము చేయావలసినది అని అభ్యర్ధించినాడు.
    "మహాత్మా! పరుశురామదేవా! నీవు కృపాసముద్రడవు. నిన్ను ఆశ్రయించిన వారి దుఃఖములు పోగొట్టేదవు. రక్షింతువు. నాకు కలిగిన అవమానము పోగొట్టుము. నన్ను రక్షింపుము" అని ప్రార్ధించినది అంబ.
    పరశురాముడు ప్రసన్నుడు అయినాడు. అన్నాడు:-
    "అంబా! నీకు కలిగిన అవమానము రెండు విధములుగా తోచుచున్నది. సాల్వునకు బుద్ది చెప్పి అనుకూలింప చేయవలెనా? భీష్మునకు బుద్ది చెప్పి సమ్మతింప చేయవలెనా? ఏది చేయవలెనో చెప్పుము" అని పరశురాముడు అడిగినాడు.
    "దేవా! సాల్వునితో నాకు పని లేదు. భీష్ముని విషయముననే కోపము కలిగి ఉన్నాను. భీష్ముని సమ్మతింప చేసిన చాలును" అని అంబ ప్రార్థించినది.
    'అంబా! భీష్ముడు నాకు శిష్యుడు. నామాట వినకపోడు. వినకున్న నా బానములతో భీష్ముని పడగొట్టేదను" అన్నాడు పరశురాముడు. కురుక్షేత్రమునందలి సరస్వతీ తీరమునకు చేరినాడు. భీష్ముని పిలిపించినాడు. భీష్ముడు వచ్చినాడు.
    "భీష్మా!' పరశురాముడు కోపమున అన్నాడు. "నీవు అంబను అవమానించినావు. ఈమెను నీతమ్మునకు ఇచ్చి పెళ్ళి చేయుము. లేదా నాతొ యుద్దమునకు సిద్దము ఆగుము"
    భీష్ముడు పరశురాముని మాటలకు ఉలికి పడినాడు. సవినయముగా వివరించినాడు. అంబ స్వయముగా సాల్వుని వద్దకు వెళ్ళినది. అని వివరించినాడు. సాల్వుని కామించిన అంబను విచిత్రవీర్యునకు ఇచ్చుట ధర్మమూ కాదు అన్నాడు. ఇంకను అనేక విధముల వివరించినాడు. తనను మన్నించమని కోరినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.