Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"దుర్యోధన మహారాజా! కర్ణునకు ఆలోచన లేదు. తొందరపాటు ఎక్కువ. వెనుక ముందు చూడడు. కయ్యమునకు దిగును. యుద్దమునందు ఎదుటివాని బలమును గ్రహించలేడు. కావున భీష్ముడు చెప్పినది సమంజసము. కర్ణుడు అర్ధరధుడు అగును" అని భీష్ముని మాటను ద్రోణాచార్యుడు ధృవపరచినాడు.
భీష్ముడు, ద్రోణుడు చెప్పిన మాటలను కర్ణుడు విన్నాడు. తోక తొక్కిన త్రాచువలె కస్సుమని లేచినాడు. అన్నాడు :-
భీష్మా! పగవానివలె ప్రవర్తించుచున్నావు. అసలు నీకు ఉన్న బలమెంత! నీవే అర్ధరధుడవు. నేను కాదు. నీవు ఎల్లప్పుడు నన్ను కించపరుతువు. నిన్ను చూచికాదు. దుర్యోధన మహారాజును చూచి సహించుచున్నాను.
"మహారాజా! భీష్ముడు మనకు హితుడు కాడు. ఇతడు పాండవ పక్షపాతి. ఇతడు మనకు భేదభావము కలిగించ దలచినాడు. ఇతడు నామనసును నొప్పించినాడు. ఇతని మాటలకు సకల రాజన్యులు బాధపడుచున్నారు. ఈ భీష్ముని ఒక్కని విడుచుట వలన మనకు వచ్చిన లోపము లేదు. ఇతడు మనలను వంచించుట. ఇది నిజము. భీష్ముడు ఉండగా యుద్దమున నేను ఆయుధము పట్టను. నేనైన ఉండవలె భీష్ముడయిన ఉండవలె."
కర్ణా! నేను ఎంతటివాడనో , నాబల పరాక్రమములు ఎంతటివో నీ గురువు అయిన పరశురాముని అడుగుము. నాచేత ఓడిన రాజులను అడుగుము. నీవలననే కౌరవ వంశమునకు నాశనము ప్రాప్తించినది.
నీవు మంచి బంటువు. కాని మంచి వీరుడవుకావు.
"కర్ణా! నా మీద కోపించి యుద్దము నుంచి తొలగినావు. నీ స్వభావమును వ్యక్తపరచినావు. అయినను నీవు అర్జునుని ఎదుర్కొనక తప్పదు. అతనిచేత నీకు చావు తప్పదు. అర్జునుడు క్రమముగా కౌరవ సేనలను హతమర్చును. మిగిలిన సేనల కూడి నీవు ఎట్లు యుద్దము చేతువో చావగా మిగిలిన దుర్యోధనాదులు చూతురు."
"కర్ణా! ఈ దుర్యోధనుడు నామీద సర్వసేనాదిపత్య భారమును మోపినాడు. అందువలన బ్రతికి బయటపడినావు" అని దుమధుమలాడినాడు భీష్ముడు.
దుర్యోధనుడు భీష్మ, కర్ణుల మాటలు విన్నాడు. ఇరుకున పడినాడు. భీష్ముని ఒదార్చినాడు. బ్రతిమిలాడినాడు ప్రార్ధించినాడు. భీష్ముడు కోపమును మింగినాడు.
దుర్యోధనుడు కర్ణుని ఒదార్చినాడు. "ఇది భేదముల సమయము కాదన్నాడు. కర్ణుడు తనపట్టు విడువలేదు. భీష్ముడు ఉండగా ఆయుధము పట్టనన్నాడు. భీష్మించినాడు.
భీష్ముడు శాంతించినాడు. "పితామహ! పాండవ పక్షపు వీరుల బలములు తెలియపరతునంటివి. తెలియ పరచగలవు" అని ప్రార్ధించినాడు.
"మహారాజా! ఎదుటి వారి బలములను నేను వాస్తవముగా చెప్పుదును. వాస్తవము విను ఉదారత నీకు లేదు. కర్ణునకు లేదు. అందువలన చెప్పకుండుట మంచిది" అని మిన్నకున్నాడు భీష్ముడు.
భీష్ముడు మిన్నకున్నాడు . కాని దుర్యోధనుడు విడువలేదు. పదేపదే ప్రార్ధించినాడు. అప్పుడు భీష్ముడు చెప్పినాడు:-
"ధర్మరాజు అతిరధుడు. భీముడు అతిరధ శ్రేష్ఠుడు. అతడు మహాబలవంతుడు. అతనిని ఎదిరించువారు లేరు. అర్జునుడు ఎంతటి రాధికుడో చెప్పరాదు. అతనికి సరివచ్చువారు ముల్లోకములందు లేరు. అతనికి శ్రీకృష్ణ భగవానుడు తోడు అయినాడు. నీ సైన్యములన్నింటిని సంహరించుటకు అతడు ఒక్కడు చాలును. నకుల సహదేవులు సమరధులు. వారు భయము ఎరుగని వారు. మహాబలవంతులు."
"పాండవులు అయిదుగురు అతి సమర్ధులు. ఒక్కొక్కరు అనేక రాజులను అనేక పర్యాయములు ఓడించినారు. వారు ఒక్కరు ఎత్తి వచ్చినను మన సైన్యము భయపడక మానదు. అదికాక పాండవులు నీ వలన అనేక పర్యాయములు అవమానములు పొందినారు. కావున వారి మనసులు సలసల కాగుచున్నవి. వారు ప్రాణములను లెక్కచేయక పోరుదురు. వారి పరాక్రమము ముందు మన సైన్యము నిలుచుట కష్టము."
"వారి పక్షమందు ధృష్టద్యుమ్నుడు, పాండ్యరాజు, భోజుడు అతిరధులు అగుదురు."
"ద్రౌపది పుత్రులు అయిదుగురు, ఉత్తరుడు, ద్రుపదుడు, విరాటుడు, శిఖండి, ధృష్టకేతుడు, భోజుని తమ్ములు , కేకయరాజులు అయిదుగురు , చిత్రాయుధుడు, చేకితానుడు, చంద్రదత్తుడు, వ్యాఘ్రదత్తుడు, రోచమానుడు మహారధులు అగుదురు."
కంశ్యుడు సమరధుడు.
ధృతవర్మ అర్ధరధుడు.
సాత్యకి, సేనాబంధుడు, ఘటోత్కచుడు, భీమునితో సమానులు అతిరధ శ్రేష్ఠులు అగుదురు.
"దుర్యోధనా! పాండవ రధికులు అఖండ బలపరాక్రమవంతులు అయినను నాఎదుట పడి నిలువలేదు. నేనే శిఖండిని తప్ప తక్కినవారిని చీల్చి చెండాడెదురు" అని ధైర్యము చెప్పినాడు భీష్ముడు.
"తాతా! భీష్మా!" దుర్యోధనుడు అడిగినాడు. "శిఖండిని మాత్రము చంపనన్నావు. అందుకు గల కారణము రహస్యము కాకున్నచో మాకు వినిపించరాదా!"
భీష్ముడు శిఖండి కధ చెప్పినాడు.
ఆలోచనామృతము
1. బలరాముడు సహజముగా కౌరవ పక్షపాతి. దుర్యోధనుడనిన అభిమానము. శ్రీకృష్ణుడు బలరాముని అభిమానము తగ్గించయత్నించినాడు. సుభద్రను అర్జునునకు ఇచ్చి వివాహము చేసినాడు. అయినను బలరాముని అభిమానము అంతగా తగ్గలేదు. శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి అగుట బలరామునకు ఇష్టము లేదు. కౌరవ పాండవులకు యుద్దము కలుగుట బలరామునకు ఇష్టము లేదు. యుద్దమే వచ్చిన పాండవులు గెలుతురని అతడు ఎరుగను.
బలరాముని ప్రసన్నుని చేయుటకు శ్రీకృష్ణుడు ఆయుధము పట్టను అన్నాడు. బలరాముడు సహితము అస్త్ర సన్యాసము చేసినాడు.
బలరాముడు కౌరవ పక్షము వహించలేడు. కురుక్షేత్రమున ఉండి రక్తపాతము చూడలేదు. శాంతిని కాంక్షించినాడు కుదరలేదు. విరక్తుడు అయినాడు. యాత్రలకు వెళ్ళినాడు.
ఈ శతాబ్దమున రెండు ప్రపంచ యుద్దములు జరిగినవి. సుమారు అప్పటి రాజ్యములు అన్నియు యుద్దమున పాల్గొన్నవి. శాంతిని కాంక్షించిన "స్విట్జర్లాండ్" దేశము మాత్రము యుద్దమున పాల్గొనలేదు. "స్విట్జర్లాండ్" బలరామునివంటి శాంతికాముక దేశము.
2. రుక్మీ బలదర్పములు కలవాడు. యుద్ద సన్నాహములందు అతడు ఎవరి పక్షము వహించలేదు. తీరా యుద్ద భూమికి వచ్చి సాయము చేతునన్నాడు. అట్టి వానిని నమ్ముట కష్టము. అందువలన ఉభయులు నిరాకరించినారు.





