Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"శ్రీకృష్ణునకు కౌరవులు, పాండవులు సమానులు. అట్లుకాగా అతడు పాండవ పక్షపాతి అయినాడు. శ్రీకృష్ణుడు ఉన్న పక్షమునకు విజయము తధ్యము. పాండవులకు గెలుపు, కౌరవులకు చావు నిశ్చయము. భీమ- దుర్యోధనులను యుద్ద సమర్ధులుగా నేనే చేసినాను. వారు ఒకరిని ఒకరు చంపుకొనుచుండగా నేను చూడలేను. ఈ యుద్దమును, రక్తపాతమును సహించలేను."
"శ్రీకృష్ణుడు ఎరుగని ధర్మము, న్యాయము, పురుషార్ధము నేను ఎరుగను. ఈ అనంత హింసను నేను వినలేను. చూడలేను. యుద్దమునకు దూరముగా సరస్వతీ నదీ తీరమునకు వెళ్ళవలెనని నిశ్చయించుకున్నాను. మీతో చెప్పిపోదామని వచ్చినాను."
సభాసదులు బలరాముని ఉపన్యాసమును విన్నారు. మాట్లాడలేదు. సభ మౌనము దాల్చినది. శ్రీకృష్ణుడు, ధర్మరాజు పరస్పరము మాట్లాడుకున్నారు. బలరాముని యాత్రకు సమ్మతించినారు. సభవారు సాగనంపినారు.
బలరాముడు యాత్రకు వెళ్ళినాడు.
రుక్మీ
విదర్బరాజు భీష్మకుడు. అతని కూతురు రుక్మిణి. ఆమె చిన్ననాటి నుండి శ్రీకృష్ణుని అరాధించినది. అతనిని పెండ్లాడదలచినది. భీష్మకుని పెద్ద కొడుకు రుక్మి . అతనికి రుక్మిణిని శ్రీకృష్ణునకు ఇచ్చి వివాహాము చేయుట ఇష్టము లేదు. శిశుపాలునకు ఇవ్వదలచినాడు. వివాహపు ఏర్పాట్లు సాగించినాడు.
రుక్మిణికి శిశుపాలుడు ఇష్టము లేదు. ఆమె శ్రీక్రుష్ణునే మనసార ప్రేమించినది. అన్న కుదిర్చిన పెండ్లి తప్పుటకు శ్రీకృష్ణుని చేరుటకు ఆమె ఒక ఉపాయము అలోచించినది. తన మనసును తెలుపు ఉత్తరము వ్రాసినది. ఒక బ్రాహ్మణుని చేత ద్వారకకు పంపినది.
బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్ళినాడు. ఉత్తరము శ్రీకృష్ణునకు ఇచ్చినాడు. శ్రీకృష్ణుడు రుక్మిణి మనసు గ్రహించినాడు. ఆమెను పరిగ్రహించదలచినాడు. రధము మీద కుండినపురమునకు బయలుదేరినాడు.
బలరామునకు ఈ విషయము తెలిసినది. అతడు సైన్యముగా కుండినపురమునకు సాగినాడు.
కుండినపురమున పెండ్లి ఏర్పాట్లు వైభవముగా జరిగినది. శిశుపాలుడు వచ్చి ఉన్నాడు. రుక్మిణి పెండ్లి కూతురు అయినది. చెలికత్తెలతో దేవాలయమునకు వెళ్ళినది. అప్పటికి శ్రీకృష్ణుడు వచ్చినాడు. రధము మీద కనిపించినాడు. రుక్మిణి ఎగిరిగంతు వేసినది. శ్రీకృష్ణుని రధమున వాలినది.
శ్రీకృష్ణుడు రధమును ద్వారకకు సాగించినాడు.
ఈ విషయము రుక్మికి తెలిసినది. అతడు సైన్యమును తీసుకున్నాడు. శ్రీకృష్ణుని వెంబడించినాడు. మార్గమధ్యమున బలరాముని సేనలు కలిసినవి. రుక్మికి, బలరామకృష్ణులకు యుద్దము జరిగినది. యుద్దమున రుక్మీ ఓడినాడు. అవమానముల పాలయినాడు. అతడు తిరిగి కుండినకు వెళ్ళలేదు. అదే స్థలమున "భోజకటకము" అను నగరము నిర్మించినాడు. అచటనే ఉండిపొయినాడు.
ద్వారకలో రుక్మీణీ శ్రీకృష్ణుల వివాహము వైభవముగా జరిగినది.
ఇది ఆనాటి మాట. కధ.
ఇప్పుడు రుక్మీ సైన్యముగా కురుక్షేత్రమునకు వచ్చినాడు. ధర్మరాజు సభకు చేరినాడు. అన్నాడు:-
"అర్జునా! నేను వీరుడను. వీరాధివీరుడను. ఎంతటి సైన్యమునైనను ఏ పక్షము నుండి అయినను దునుమాడ గలను. మీకు సాయము చేయుటకు వచ్చినాను. మీరు భయపడనక్కర లేదు. శత్రు సైన్యమును చిత్తూ చేతును. మీకు విజయు కలిగింతును."
రుక్మీ మాటలు విన్నారు. సభవారు నివ్వెరపోయినారు.
"రుక్మీ!" అర్జునుడు అన్నాడు. "మాకు వాసుదేవుడు ఉన్నాడు. నా భుజ పరాక్రమము ఉన్నది. మాసేనలున్నవి. మాకు సాయము వచ్చిన వీరులున్నారు. మాకు భయము లేదు. నీవు తీర్చవలసిన పని లేదు. నీసాయము మాకు అక్కరలేదు."
రుక్మీ అర్జునుని మాటలు విన్నాడు. అతనికి కోపము వచ్చినది. నిప్పులు కక్కినాడు. సభ నుంచి వెళ్ళిపొయినాడు.
సభ నుంచి వెళ్ళిన రుక్మీ దుర్యోధనుని వద్దకు వెళ్ళినాడు. "నేను వీరుడను. వీరాధివీరుడను. ఎంతటి సైన్యమునైనను , ఏ పక్షమునుండి అయినను దునుమాదగలను. సాయము చేతునని పాండవుల వద్దకు వెళ్ళినాను. వారు నిరాకరించినారు. నేను, నా సైన్యము నీ అధీనమున ఉందుము. కాదనకుము" అన్నాడు.
"మహారాజా! రుక్మీ! నీవు ముందు పాండవుల వద్దకు వెళ్ళినావు. వారు నిరాకరించినారు. అప్పుడు నావద్దకు వచ్చినావు. వారు నిరాకరించిన సాయము నాకు సహితము అక్కరలేదు. నేను ఉన్నాను. నా బలములు ఉన్నవి. నీసాయము నాకు అక్కరలేదు" నాకు అంతటి అవసరము సహితము లేదు. అని దుర్యోధనుడు నిరాకరించినాడు.
రుక్మీకి అవమానము మిగిలినది. అది మూట కట్టుకొని సైన్యమును వెంట పెట్టుకొని రుక్మీ "భోజకటము' చేరినాడు.
బలరాముడు , రుక్మీ యుద్దమున పాల్గొనలేదు.
అర్ధరధుడు
మరుసటి రోజు యుద్దము.
దుర్యోధనుడు తన శిభిరమున సభ తీర్చినాడు. "భీష్మ పితామహ! మన పక్షమందు ఉండువారి బలదర్పములను వివరింపుము తెలుసుకుందును" అని ప్రార్ధించినాడు.
"దుర్యోధనా! నీవు అడిగినావు. ఉభయ పక్షముల వీరుల బలములను తెలియపరతుము. వినుము. మన పక్షపు వారియందు ద్రోణాచార్యుడు అతిరధ శ్రేష్ణుడు అగును. నీవు , క్రుతవర్మ, శల్యుడు, నలుడు, కృపా చార్యుడు , సోమదత్తుడు అతిరధులు అగుదురు."
"నీ సోదరులు తొంబది తొమ్మిది మంది, కాంభోజ రాజు సుదక్షిణుడు, లక్ష్మణ కుమారుడు, బృహద్వలుడు , శకుని , హలాయుధుడు, భగదత్తుడు సమరధులు."
"సైంధవుడు, త్రిగర్త రాజులు సుశర్మ మున్నగు వారు అయిదుగురు మహారధులు."
"విందానువిందులు, దండధారుడు , కర్ణుడు అర్ధరధులు."
"కర్ణుడు అర్ధ రధుడు అగుటకు కారణము చెప్పెదను. వినుము. కర్ణుని సహజ కవచకుండలములను దేవేంద్రుడు తీసుకొనిపోయినాడు. పరశురాముని శాపము వలన కర్ణుని అస్త్రశక్తి చెడిపోయినది. ఆ కారణమున కర్ణుడు అర్జునుని ఎదిరించజాలడు. అందువలన కర్ణుడు అర్ధరధుడు అయినాడు."





