Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
దుర్యోధనుడు పదకొండు మందిని రప్పించినాడు. సభలో మహావైభవముగా వారికి అభిషేకము చేసినాడు. పదకొండు మంది సేనాపతులను వెంట పెట్టుకున్నాడు. భీష్మ పితామహుని వద్దకు వెళ్ళినాడు. నమస్కరించినాడు.
"పితామహ! భీష్మా! మన పదకొండు అక్షౌహిణుల సేనకు పదకొండు మంది సేనాపతులను నియమించినాను. నక్షత్రములకు చంద్రుని వలె కౌరవుల వంశమునకు నీవే దిక్కు. నిన్ను మించిన వారు లేరు. నీవు సర్వ సైన్యాదిపత్యము వహించవలెనని నా ప్రార్ధన. నీవు ఆధిపత్యమున వహించి శత్రువులను దునుమాడుము. మాకు విజయము చేకూర్చుము. ఈ మహాత్కర్యమునకు నీవు తప్పు అన్యులు అర్హులు కారు. అట్టి అర్హుడు ఉన్నచో నీవే మాకు తెలియపరచుము" అని దుర్యోధనుడు భీష్ముని ప్రార్ధించినాడు.
భీష్మ పితామహుడు దుర్యోధనుని ప్రార్ధన ఆలకించినాడు. "దుర్యోధనా! నాకు మీరును, పాండవులు సమానులు. నేను మీ వద్ద ఉన్నాను. మీ వైపున చేరి యుద్దము చేయుదును. నన్ను ఎదిరించ గల వీరులు భూలోకమున లేరు. ఒక్క అర్జునుని మాత్రము నేను గెలువజాలను. అతని వద్ద నాకున్న మిక్కిలి దివ్యాస్త్రములు ఉన్నవి. పాండవులను అయిదుగురిని చంపుటకు నాకు చేతులు రావు. వారు కూడ నా మీదికి రాజాలరు."
"దుర్యోధనా! మరొక మాట చెప్పవలసి ఉన్నది. మొదట కర్ణుని గాని నన్ను గాని యుద్దమునకు పంపుము. ఆవిధముగా చేయకున్నా నేను సర్వసైనాది పత్యమును అంగీకరించను" అని చెప్పినాడు భీష్ముడు.
కర్ణుడు అచటనే ఉన్నాడు. అది విన్నాడు. "దుర్యోధన మహారాజా! నేను ఇదివరకే సభలో చెప్పి ఉన్నాను. భీష్ముడు యుద్దమున పడిపోయిన తరువాతనే నేను యుద్దము చేతును. అంతవరకు యుద్దము చేయను" అన్నాడు.
భీష్ముడు కర్ణుని మాటలు విన్నాడు. సర్వసేనాదిపత్య భారము వహించుటకు సమ్మతించినాడు. దుర్యోధనుడు సంతోషించినాడు. భీష్ముని కొనియాడినాడు. సర్వసేనాది పత్య అభిషేకమునకు ఏర్పాట్లు చేసినాడు.
హస్తినలో భేరీ, మృదంగ శంఖాది వాద్యములు మ్రోగినవి. నగరము అలంకరింపబడినది. పతాక ఉత్సవము జరిగినది. బంగారు, వెండి, కలశములలో తీర్ధము వచ్చింది. సభ జరిగినది. ఆ సభలో బాహ్లీక, ద్రోణ, కృపులందరి సమక్షమున దుర్యోధనుడు, భీష్మ పితామహునకు సర్వ సేనాధిపత్య పట్టము కట్టినాడు. అభిషేకము చేసినాడు.
అప్పుడు ఆకాశము ఏర్రవారినది. రాళ్ళ వర్షము కురిసినది. నెత్తుటి వాన పడినది. ఆకసము నుండి ఎముకలు కుప్పలు తెప్పలుగా పడినవి. హస్తినలో భీతవహాము వ్యాపించినది. జనులు ఏడ్చినారు. ఉత్సాహము కనిపించలేదు.
అట్లయినను దుర్యోధనుడు యుద్దయాత్ర సాగించదలచినాడు. శాంతులు చేసినాడు. దానములు చేసినాడు . ధృతరాష్ట్ర గాంధారుల వద్దకు వెళ్ళినాడు, నమస్కరించినాడు. "నాకు విజయము కలుగునట్లుగా ఆశీర్వదించవలసినది" అని గంధారిని, తల్లిని వేడుకున్నాడు.
"ధర్మము ఏ పక్షమున ఉన్న ఆ పక్షము వారికీ విజయము కలుగును" అని ఆశీర్వదించినది గాంధారి.
దుర్యోధనుడు తల్లి వద్ద నుంచి బయలుదేరినాడు. తమ్ములను సేనలను తీసుకొని భీష్ముని దగ్గరకు వెళ్ళినాడు. భీష్ముని ముందు ఉంచుకొని సైన్యమును నడిపించినాడు. యుద్ద యాత్ర సాగించినాడు. ఆసైన్యపు కదలికకు దిక్కులు వడకినవి.
దుర్యోధనుని సేనావాహిని కురుక్షేత్రము దాటి ఒక మనోహర ప్రదేశమున విడిచినది. దుర్యోధనుడు కర్ణుని సాయముతో శిబిరములను ఏర్పాట్లు చేసినాడు. గజ, తురగ, పదాతులకు సౌకర్యములు కలిగించినాడు.
ఉభయసేనలు కురుక్షేత్రమున యుద్దమునకు సంనద్దములు అయి ఉన్నవి.
ఆలోచనామృతము
1. అక్షౌహిణి అనగా 21,870 రధములు, 21,870 గజములు, 65,410 గుఱ్ఱములు, 1,09,350 మంది సైనికులు గల దళము. ఇటువంటివి భారత యుద్దమున 18 దళములు పాల్గొన్నవి.
2. నాయకుని ఎన్నుకోనుటకు ధర్మరాజు తమ్ముల అభిప్రాయములు అడిగినాడు. అభిప్రాయము వెలిబుచ్చుట అందరికన్న చిన్నవాడు సహదేవునితో ప్రారంభము అయినది. ఇది మంచి పద్దతి. ముందే పెద్దవానిని అడిగిన చిన్నవాడు చెప్పలేకపోవును. దేనికయినను చిన్నావారి నుంచి ప్రారంభించుట మంచిది. వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అగును. వారికి ఆత్మ విశ్వాసము ఏర్పరచుటకు ఇది ఒక్క చక్కని మార్గము.
దుర్యోధనుడు, సేనాపతుల, సర్వసేనాధిపతి నియామక విషయమున ఎవరి అభిప్రాయము తీసుకొనలేదు . స్వతంత్రముగ వ్యవరించినాడు.
3. పాండవసేనకు ధృష్టద్యుమ్నుని సర్వసేనాధిపతిని చేసినాడు. వయసున అతని కన్న పెద్దలు ఉన్నారు. అయినను యువకునకు సేనాధిపత్యము ఇచ్చినారు. అతని పట్టుదలను, పరాక్రమమును చూచినారు కాని వయసును కాదు.
ఇది యువతకు ఇచ్చిన ప్రోత్సాహము
4. దుర్యోధనుడు వయోవృద్దుడు, పితామహుడు అయిన భీష్ముని సేనాధిపతిని చేసినాడు. అతనికి యుద్దము నందు ఆసక్తి లేదు. పాండవుల ఎడ పగలేదు.
5. కుంతి పాండవులకు తల్లి. ఆమె తన కొడుకుల గెలుపు కొఱకు కర్ణుని వద్దకు వెళ్ళినది. వరము అడిగినది. సాధించినది. అది పాండవులు కోరినది కాదు. కుంతి మాతృధర్మము నిర్వర్తించినది.
6. దుర్యోధనుడు తల్లి గాంధారి దగ్గరకు వెళ్ళినాడు. తనకు విజయము కలుగునట్లు దీవించమని ప్రార్ధించినాడు. తల్లి మనసు ఒప్పలేదు. ఆమె ధర్మమునకే జయము అని దీవించినది.
దుర్యోధనుడు తల్లి మనసును సహితము అంతగా నొప్పించినాడు!
బలరాముని విముఖత
ఉభయసేనలు యుద్దమునకు సన్నద్దము అయి ఉన్నవి. ధర్మరాజు సభ తీర్చి ఉన్నాడు. విరాట, ద్రుపదాదులు సభలో ఉన్నారు. అప్పుడు బలరాముడు వచ్చినాడు. ధర్మరాజు ఎదురేగినాడు. తోడి తెచ్చినాడు. అసీనుని చేసినాడు. శ్రీకృష్ణ భీమార్జున నకుల సహదేవులు బలరాముని సత్కరించినారు.
"రాజులారా! సభాసదులారా!" బలరాముడు ఉపన్యసించినాడు. "పాండవులు, కౌరవులు, సకల బంధుజనులకు కీడు కలుగునట్లు, యుద్దమునకు వచ్చినారు. యుద్దము జరుగనివ్వరాదు. సంధి కలిగింపుము. అని శ్రీకృష్ణుని కోరినాను. శ్రీకృష్ణుడు సంధి కలిగించ వెళ్ళినాడు. కోపగించినాడు. తిరిగి వచ్చినాడు. యుద్దము వచ్చినది."





