Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

                                                                                        సేనాధిపతులు

    శ్రీకృష్ణుడు హస్తిన నుండి తిరిగి వచ్చినాడు. ఉపప్లావ్యమున పాండవులు అతని రాకకై ఎదిరి చూచుచున్నారు. ధర్మరాజు ఆతురతగా అడిగినాడు. "ఏమైనది?" అని మిగత నలుగురు శ్రీకృష్ణుని ఉత్తరామునకై ఆత్రపడినారు.
    "యుద్దము తప్పదు" శ్రీకృష్ణుడు అన్నాడు. "కౌరవ సభలో నాకు సాధ్యమయినంత చెప్పినాను. భీష్మాదులు చెప్పినారు. నారదాది మహామునులు చెప్పినారు. ధృతరాష్ట్రుడు చెప్పినారు. గాంధారి చెప్పినది. దుర్యోధనుడు వినలేదు. సభ నుంచి వెళ్ళిపొయినాడు. నన్ను కట్టి వేయుటకు చూచినాడు. సంధి విరిగినది. యుద్దము తప్ప గత్యంతరము లేదు. యుద్దము తప్పదు."
    ధర్మరాజు శ్రీకృష్ణుని మాటలు విన్నాడు. మౌనము దాల్చినాడు. తరువాత అన్నాడు "యుద్దము తప్పించుటకు సంధి జరిపించుటకు శ్రీకృష్ణుడు చేసిన ప్రయత్నములు వమ్ము అయినవి. శ్రీకృష్ణుడే యుద్దము చేయవలసినదని సెలవిచ్చినాడు. కావున యుద్దమునకు సిద్దమగుట మన కర్తవ్యము. మనకు ఏడు అక్షౌహిణుల సైన్యము ఉన్నది. వాటిని నడిపించి భీష్ముని ఎదిరించగల సేనాధిపతి కావలసి ఉన్నది. అందుకు సమర్ధుని నిర్ణయించగలరు" అని తమ్ములను కోరినాడు.
    "అన్నా! విరాటుడు మనకు ఆశ్రయము ఇచ్చినాడు. పరాక్రమవంతుడయి ఉన్నాడు. అతనిని నియమించిన బాగుండును' అన్నాడు అందరి కంటే చిన్నవాడు సహదేవుడు.
    'అన్నా! ధర్మరాజా!" అర్జునుడు అన్నాడు. "ధృష్టద్యుమ్నుడు ద్రోణుని చంపుటకే అన్ని కుండము నుండి అవతరించినాడు. రధము, అశ్వములు, ధనుర్భాణములు మున్నగునవి అన్నియు అతని కొఱకే అగ్ని కుండము నుండి పుట్టినవి. ధృష్టద్యుమ్నుడు అగ్నిజ్వాలవంటివాడు. వీరుడు, శూరుడు పరాక్రమవంతుడు. అతనిని నియమించిన బాగుండును.
    శిఖండి భీష్ముని వధించుటకే పుట్టినాడు. అతి బలవంతుడు . ధైర్యవంతుడు. అతనిని అధిపతిని చేయవచ్చును" అని సూచించినాడు అర్జునుడు.
    "భీమాదులారా!' ధర్మరాజు సంబోధించినాడు. "ఈ శ్రీకృష్ణుడు మహాత్ముడు. సకల భూతములను ఎరిగినవాడు. అతని నిర్ణయము మనకు విజయకారణము. కావున శ్రీకృష్ణుడు చెప్పిన వానిని సేనాధిపతిగా నిర్నయింతము" అని శ్రీకృష్ణుని ప్రార్ధించినాడు.
    'ధర్మరాజా!' శ్రీకృష్ణుడు నిర్ణయించినాడు. "ధృష్టద్యుమ్నుడు అన్ని విధముల నీ సేనలన్నింటికీ ఆధిపత్యము వహించుటకు తగినవాడు. నిండు సభలో అతనికి అభిషేకము చేయుము. నీకు ఏడు అక్షౌహిణుల సైన్యము ఉన్నది. ఒక్కొక్క అక్షౌహిణికి ఒక సేనాపతిని నియమింపుము" అన్నాడు.
    "శ్రీకృష్ణదేవా! నీవు చెప్పిన వారిని సేనాపతులను చేతును. ఆ ఏడుమందిని చెప్పుము." అని ధర్మరాజు అడిగినాడు. శ్రీకృష్ణుడు ఏడుగురి పేర్లు చెప్పినాడు. వారు 1. ద్రుపదుడు. 2. విరాటుడు. 3. సాత్యకి. 4. జరాసంధుని పెద్దకొడుకు మాగధసహదేవుడు. 5. చేకితానుడు 6. శిశుపాలుని కుమారుడు ధృష్టకేతుడు 7. శిఖండి.
    "ధర్మరాజా! కౌరవసేన నిస్సారముగా ఉన్నది. నీ సేన ఉత్సాహముగ ఉన్నది. యుద్దము సాగింపుము. జయము నిన్ను వరించుట నిశ్చయము." అన్నాడు శ్రీకృష్ణుడు.
    అప్పటికి రాత్రి అయినది. తెల్లవారి ధర్మరాజు సభ ఏర్పాటు చేసినాడు. సహోదరులు, బంధువులు, రాజులు, సామంతులు, మిత్రులతో సభ నిండిపోయినది. శ్రీకృష్ణుడు సభను అలంకరించినాడు.
    ధర్మరాజు సభాసదులను ఉద్దేశించి ప్రసంగించినాడు. తాను యుద్దము చేయుటకు నిశ్చయించినానని చెప్పినాడు. యుద్ద ప్రయత్నములు జరుపవలసినదని ఆదేశించినాడు. నిండు సభలో ఏడుగురికి సేనాపతిత్వ అభిషేకము చేసినాడు.
    ధృష్టద్యుమ్నునకు సర్వ సేనాదిపత్యమునకు వైభవముగా పట్టము కట్టినాడు.
    ఉపప్లావ్యమున యుద్ద ప్రయాణ ఉత్సాహము వెల్లివిరిసినది. నగరమందు అంతట ప్రయాణ భేరులు మ్రోగినవి. భేరీ భాంకారముల ధ్వనికి దిక్కులు పిక్కటిల్లినవి. సముద్రములు పొంగినవి. కులగిరుల అధిరినవి.
    తెల్లవారినది. పాండవులు, అభిమాన్యాది కుమారులు శ్రీకృష్ణుడు, సాత్యకి మున్నగు వారు పెండ్లికి పోవు వారివలె అలంకరించుకున్నారు. ద్రౌపది వద్దకు వెళ్ళినారు. పుణ్య స్త్రీల అక్షతలు పొందినారు. బ్రాహ్మణుల ఆశీర్వచనములు అందుకున్నారు. భద్రపాటకుల స్తోత్ర పాఠములు వినుచు బయలుదేరినారు.
    మంగళ వాద్యములు మ్రోగినవి. ధర్మరాజు సాగినాడు. తన రధము ఎక్కినాడు. అర్జునుడు తన రధమును అధిరోహించినాడు. నొగల మీద శ్రీకృష్ణుడు తేజరిల్లినాడు. కపిధ్వజము రెపరెపలాడినది. అదే విధముగా భీమ, నకుల, సహదేవులు ఇతరులు రధములు ఎక్కినారు.
    అప్పుడు శ్రీకృష్ణుడు పాంచజన్యము పూరించినాడు. అర్జునుడు దేవదత్తమును పూరించినాడు. మిగిలినవారు తమ శంఖములను ఊదినారు. ఆ ధ్వనికి పాండవ సైన్యమున ఉత్సాహము ఉరకలు వేసినది.
    ధృష్టద్యుమ్నుడు ధర్మరాజు వద్దకు వచ్చినాడు. సాష్టాంగముగా ప్రణమిల్లినాడు. ధర్మరాజు అనుమతి పొందినాడు. పాండవ సైన్యమునకు  ముందుగా సాగినాడు.
    సైన్యము సాంతము సాగినది. సాగరమునకు కదలిక వచ్చినట్లు అనిపించినది. పాండవ సేన కురుక్షేత్రము చేరినది. ధర్మరాజు ఆశ్రమములకు, దేవ బ్రాహ్మణ గృహములకు ఉపద్రవము కలుగకుండునట్లు "హిరణ్వతి" నదీ తీరమున విడిసినాడు. అచట విడిది చేసినట్లు తెలియుటకు శ్రీకృష్ణుని సహితముగా అందరు శంఖములు పూరించినారు.
    ఆ శబ్దము ఆకాశమును అంటి దశదిశల వ్యాపించినది.
    అచ్చట నివాస కుటీరములు, గజశాలలు, అశ్వశాలలు మున్నగునవి అన్నియు ఏర్పడినవి.
    పాండవసేన యుద్దమునకు సిద్దమయినది.
    "హిరణ్వతి వద్ద పాండవ సేనలు విడిసినవి" ఈ వార్త దుర్యోధనునకు అందినది. దుర్యోధనుడు చలించనట్లు కనిపించినాడు. దుశ్శాసన కర్ణ శకునులను పిలిపించినాడు. "యుద్దము నిశ్చయము అని తేలినది. మన పక్షపు రాజులు, సేనలు రేపు కురుక్షేత్రమునకు సాగవలెను. ప్రయాణపు ఏర్పాట్లు చేయుదు" అని ఆదేశించినాడు. వారు ముగ్గురు ఉత్సాహమున సాగినారు. సమరయాత్రను గురించి చాటింపు వేయించినారు.
    హస్తినలో సందడి మొదలయింది. రధ, గజ, తురగ పదాతులు సిద్దము కాసాగినవి. హస్తిన భేరి భాంకారములతో ప్రతిధ్వనించినది.
    దుర్యోధనుడు సేనాపతులను గురించి తన మనసులో నిశ్చయించుకున్నాడు. మరునాడు దుశ్శాసనాదులను పిలిచినాడు. వారితో తన నిర్ణయము చెప్పినాడు. పదకొండు అక్షౌహిణులకు పదకొండు మంది సేనాపతులను నియమించినాడు.
    వారు 1.ద్రోణుడు 2. కర్ణుడు 3. అశ్వత్ధామ 4. బాహ్లీకుడు 5. శల్యుడు 6. కృపాచార్యుడు 7. భూరిశ్రవుడు 8. శకుని 9. కృతవర్మ 10. కాంభోజుడు 11. సైంధవుడు




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.