Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"కొడకా! కర్ణా!' అని కుంతి కర్ణుని కౌగలించుకున్నది. తల ముద్దాడినది. "నాయనా! దైవ నిర్ణయమును తప్పించలేము. నీవు నాకు వరము ఇచ్చినావు.నీ తమ్ములను నలుగురిని చంపరాదు. అర్జునుని విషయమున నీవు చెప్పిన దానికి సమ్మతించినాను" అన్నది. కర్ణుని విడిచి నిలిచినది.
"అమ్మా! నేను అన్నమాట తప్పను. ధర్మరాజు, భీమ, నకుల, సహదేవులను చంపను. నామాట నమ్ముము. వెళ్ళుము" అని కర్ణుడు చేతులు జోడించి నమస్కరించినాడు.
కుంతి మరలినది. సాగిపోయినది.
గంగ ఒడ్డున నిలిచి కర్ణుడు ఆమెను కనిపించనంత సేపు చూచినాడు.
ఏమీ ఎరగనట్లు గంగ ప్రవహించుచున్నది.
ఆలోచనామృతము
ఇచ్చట శ్రీకృష్ణుడు చాల ఎత్తుకు ఎదిగినాడు. మహోన్నతుడు అయినాడు.
త్యాగము మానవుని లోని దైవ లక్షణములలో ముఖ్యమైనది. త్యాగధనులే మహాత్ములు అయినారు.
త్యాగము అనగా వదులుకొనుట. దేనిని వదులుకున్నవాడు. సత్పుర్షుడు. మహానుభావుడు. త్యాగధనుడు అగుచున్నాడు?
మానవుని ఐహిక జీవనమునకు ధర్మము , అర్ధము, కామము కావలసి ఉన్నవి. అర్ధకామములు లేనిది మనిషి జీవించలేడు.
అర్ధము అనగా డబ్బు మాత్రమే కాదు. అవసరము అయిన పదార్దములు. వాటిని పొందుటకు డబ్బు కావలెను. కామము అనగా కోరికలు, కోరికలు తీరుటకు డబ్బు ఒక సాధనము. అర్ధమునకు అతీతమయిన కోరికలు కూడ ఉండును.
ధర్మము అనగా ఆయా కాలములందు అమలులో ఉన్న రాజకీయ శాసనములు. సాంఘిక నియమములు.
ధర్మమును అనుసరించి ఆర్జించిన విత్తము దోషము కాదు. దానిని ధర్మమును అనుసరించియే వెచ్చించవలెను.
ధర్మమును విడిచి ఆర్జించిన విత్తము దూశితము అగును. దానినే ఇప్పుడు "బ్లాక్ మనీ - నల్లధనము ' అనుచున్నారు.
అర్ధము కొఱకు ధర్మమును విడుచుట త్యాగము కాదు దుర్మార్గము అగును.
కోర్కెలు మానవునకు సహజములు. కాని వానిని ధర్మమును అనుసరించి అనుభవించవలెను. భార్యనే కామించవలెను. సోదరిని కాదు. ఇది ధర్మము. ఇంత భూమి మాత్రమే ఉండవలెను. ఇంతకూ మించి ఉండరాదు. ఇది శాసనము వీటిని అనుసరించి అనుభవించినదే కామము.
కామము కొఱకు ధర్మమును విడుచుట త్యాగము కాదు దుర్మార్గము.
ధర్మమును వీడినపుడు అర్ధ కామములు దూషితములు అగును.
ధర్మము కొఱకు అర్ధ కామములను విడుచుట త్యాగమగును. ఇది దైవ లక్షణము. ఇట్టి త్యాగము చేసినవారు చరితార్ధులు, మహాత్ములు, మహా పురుషులు.
ధర్మము కొఱకు గౌతమ బుద్దుడు రాజ్యమును భార్యను పుత్రుని వీడినాడు.
"నా హ మర్ధపరోదేవీ" అన్న రామచంద్రమూర్తి రాజ్యమును వదలినాడు. పురుషోత్తముడు అయినాడు.
తన తండ్రి కొఱకు భీష్ముడు రాజ్యమును, తన సాంసారిక జీవితమును వదులుకున్నాడు. మహా త్యాగధనుడు. అయినాడు. భీష్మ పితామహుడు అయినాడు.
కర్ణుడు చేతికి రానున్న అఖండ సామ్రాజ్యమును వదులుకున్నాడు. యుద్దమున పాండవులకు విజయము లభించనున్నదని కర్ణునకు తెలియును. పాండవులతో కలిసిన సామ్రాట్టు కావచ్చునని శ్రీకృష్ణుడు, కుంతి అతనికి ఆశ చూపించినారు.
కర్ణుడు అర్దాశకు లొంగలేదు.
ధర్మమును ఆశ్రయించినాడు.
అతని వాదనలో మానవతా బలమున్నది. ప్రేమ ఉన్నది. ఆత్మీయతా ఉన్నది. ఆరాధన ఉన్నది.
కన్నతల్లి కుంతి అని తెలిసినది. స్వీకరించుటకు ఆమె సిద్దపడినది. కన్నతల్లి కోరికలో స్వార్ధమున్నది. కర్ణుడు తిరస్కరించినాడు. తనను పెంచిన రాధను, సూతని నిరాశపరచదలచలేదు. కృతజ్ఞతకు కట్టుబడినాడు. ఆత్మీయతకు అకింతము అయినాడు.
శ్రీకృష్ణుడు చెప్పినాడు. రాజ్యము ఇత్తును అన్నాడు. దుర్యోధనుని విడువమన్నాడు. దుర్యోధనుడు తనకు ఒక స్థానము కల్పించినాడు. సమానముగా చూచినాడు. స్నేహము కనబరచినాడు. తనను నమ్ముకున్నాడు. రానున్న రాజ్యము కొఱకు దుర్యోధనుని వదలలేనన్నాడు. కృతజ్ఞత కనబరచినాడు. కృతఘ్నునికి నిష్కృతి లేదు అంటాడు వాల్మీకి.
కర్ణుడు స్నేహ ధర్మమును పాటించినాడు. ఇందు ఇసుమంత స్వార్ధము లేదు. సంపూర్ణము అయిన త్యాగము ఉన్నది.
శ్రీరాముడు సుగ్రీవుడు స్నేహము చేసినారు. వారి స్నేహమునకు స్వార్ధమున్నది.
త్యాగమున బలి చక్రవర్తి అంత ఎత్తుకు ఎదిగినాడు కర్ణుడు.
కమలనాభు నెరిగి కాలంబు దేశంబు
నెరిగి శుక్రుమాట లెరిగి నాశ
మెరిగి పాత్రమనుచు నిచ్చె దానము బలి
మహి పదాన్యుదొరుడు మరియు గలడె!
అన్నీ తెలిసి బలిదానము చేసినాడు. అన్నీ తెలిసి కర్ణుడు త్యాగము చేసినాడు.
అంతేకాదు అర్జునుని తప్ప మిగిలిన్ నలుగురు పాండవులు చేతికి చిక్కినను చంపనని కుంతికి మాట ఇచ్చినాడు. కన్నందుకు కుంతి ఋణము తీర్చుకున్నాడు.





