Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"శ్రీకృష్ణా! ధర్మరాజు యుద్దమును యజ్ఞమును చెయవలెను. భీమాదులు ఋత్విజులుగా ఉండవలెను. నీవు వారితో పని చేయించు ఉపాద్యాయుడవు కావలయును. దుర్యోధనాదులు యజ్ఞపశువులు అగుదురు. కురుక్షేత్రమందు జరుగనున్న మహాసంగ్రామమున మావంటి వారు అందరికి పుణ్య గతులు కలుగును. కలుగవలసి ఉన్నది."
"శ్రీకృష్ణా! నీవు నాకు హితము వంటిది చెప్పినావు. అది నా మనసునకు నచ్చుటలేదు. నేను నీవు చెప్పినట్లు చేయలేను. మన్నించవలెను."
శ్రీకృష్ణుడు కర్ణుని మాటలు విన్నాడు. "కర్ణా! నామాట వినను అన్నావు. అర్జునుని పరాక్రమము ముందు నీవు నిలువలేవు. పైగా నేను అతనికి సారధ్యము వహించుచున్నాను. యుద్దమున నీకు చావు తప్పదు. అది అట్లుండనిమ్ము. ఈ మాసము సౌమ్యము అయినది. సమశీతోష్టము కలిగి ఉన్నది. యవలు, సైంధవలవణము సమృద్ధముగా ఉన్నవి. ఎనిమిది రోజులకు అమావాస్య వచ్చును. అది పుణ్యదినము. ఆదినమున యుద్దము ప్రారంభము అగుట మంచిది. ఈ విషయము దుర్యోధనునకు, భీష్మ, ద్రోణులకు తెలియపరచుము" అన్నాడు.
"శ్రీకృష్ణా! నీవు చెప్పమన్నది చెప్పెదను. నిమిత్తముల వలన యుద్దము అనివార్యము అని తెలియుచున్నది. యుద్దమున ధర్మరాజునకు విజయము తధ్యము. అందువలననే నేను పాండవులతో చేరను అన్నాను. సంధి కలిగిన పాండవులలోనికి వచ్చి ఉందును. భారత మహాయుద్దమున మిగిసిన తరువాత నిన్ను చూతును. అట్లుకాకున్న పరలోకమందు కలుసుకొందును." అని కర్ణుడు శ్రీకృష్ణుని కౌగలించుకున్నాడు. రధము దిగినాడు. తన రధము ఎక్కినాడు. హస్తినకు మరలినాడు.
హస్తినలో కుంతి శ్రీకృష్ణుని సాగనంపినది. కాని ఆమె మనసున కలవరము తీరలేదు. విదురుడు కుంతి వద్దకు వచ్చినాడు. సభా విశేషములు చెప్పినాడు. యుద్దము అనివార్యము అని వివరించినాడు. కౌరవ వంశము అంతరించుచున్నట్లున్నది. పాండవులు ఎంతో శ్రమించవలసి ఉన్నది అని చెప్పినాడు వెళ్ళిపొయినాడు.
ఆరాత్రి కుంతికి కునుకురాలేదు. ఆమె మనసున ఆనేక ఆలోచనలు మురిసినవి. యుద్దము జరుగును. ఘోరముగా జరుగును. తన పుత్రులు బంధుమిత్రులను వధింతురా! భీష్మ, ద్రోణ, కృప , అశ్వత్ధామలను గెలువగలరా? గెలుచుట సాధ్యమా? గెలిచినా గెలువవచ్చును! గెలువకున్న!
కుంతీ ఆ ఊహను సహించలేకపోయినది. ఆలోచించింది. దుర్యోధనుని పక్షమున భీష్మ ద్రోణాదులు యుద్దమునకు సమ్మతించుట లేదు. సమ్మతించినవాడు కర్ణుడు. కర్ణుడే వీరుడు. అర్జునుని ఎదురించగలడు. కర్ణుడు రంగము నుండి తోలగవలెను.
"కర్ణుడు రంగమునుండి తొలగుటనెట్లు? ఎట్లు? ఎట్లు? ఆలోచన వచ్చినది. నిశ్చయించినది. నేను కర్ణుని వద్దకు వెళ్ళుదును. కర్ణుడు నా పుత్రుడు అని తెలియపరుతును. ధర్మరాజునకు అన్న అని చెప్పుదును. అతనికి తమ్ములందు ప్రేమ కలిగింతును. ఆవిధముగా చేసిన కర్ణునకు ఉత్సాహము తగ్గును. నా కొడుకులకు విజయము కలుగును" కుంతి కర్ణుని వద్దకు వెళ్ళుటకు నిశ్చయించినది. అయినను నిడురరాలేదు. తెల్లవారుట కొఱకు వేచి ఉన్నది.
తెల్లవారినది. కుంతి బయలుదేరినది. గంగానది ఒడ్డునకు చేరినది. కర్ణుడు అక్కడనే ఉన్నాడు. సూర్యుని ఉపాసించుచున్నాడు. ధ్యానమున ఉన్నాడు. కుంతి కర్ణుని వెనుక కూర్చున్నది. కర్ణుడు ఉపాసన ముగించినాడు. వెనుకకు చూచినాడు. కుంతి కనిపించినది. ఆశ్చర్యపడినాడు. అన్నాడు:-
"సూత పుత్రుడు, శూద్రుడు, రాధాపుత్రుడు రాధేయుడు కర్ణుడు కుంతీదేవికి నమస్కరించుచున్నాడు. ఏమి కోరి ఇచటికి వచ్చినావు? ఏమి కావలసి ఉన్నది అనతిమ్ము" అని చేతులు జోడించి అర్ధించినాడు.
"కుమారా! కర్ణా! కుంతి గొంతు అర్ధ్రము అయినది. మాటలు తడితడిగా ఉన్నవి. కర్ణుని చేతులు పట్టుకున్నది. "నీవు సూత పుత్రుడవు కావు. నా కొడుకువు. నా గర్బవాసమున వరమున పుట్టినావు. నేను కన్యగా ఉన్నపుడు కలిగినావు. సూర్యుని వరమున కలిగినావు. నీకు రాధ కొడుకు అను చిన్నతనము అక్కరలేదు. నీవు పాండవులకు అయిదుగురకు అన్నవు. నాకు పెద్ద కొడుకువు. రమ్ము. నీవు నీతమ్ములతో కలిసిపోమ్ము. సకల సామ్రాజ్యమును పాలించుము. కౌరవలకు, పాండవులకు ప్రభుడవుకమ్ము. నాకొడుకు చక్రవర్తి అయినాడు, సమ్రాట్టు అయినాడు అని నన్ను అనందించనిమ్ము. రమ్ము. నీ తమ్ములతో కలియుము. నాయనా! రా! కుమారా! రా! కర్ణా! రా!"
కుంతి ముగించినది. కర్ణుని చేతులు వదలినది. కర్ణుని ముఖము చూడసాగినది. కర్ణుడు గంభీరముగా ఉన్నాడు. గుండె చెదిరినట్లున్నాడు. కనులు చెమ్మగిల్లినట్లున్నాడు కర్ణుడు. మౌనముగా ఉన్నాడు. కుంతి అతని మాటకు ఎదిరి చూడ సాగినది.
అప్పుడు ఆకసము నుండి ధ్వని వచ్చినది. అది సూర్యబింబము నుండి వచ్చినట్లున్నది. "కర్ణా! కుంతి చెప్పినది నిజము. ఆమె చెప్పినట్లు చేయుము. నీకు మేలు కలుగును."
"అమ్మా! కుంతీదేవి!" కర్ణుని మాటలు గుండె పెకిలి వచ్చినవి. అవి తడితడిగా ఉన్నవి. కుంతికి పన్నీటి జల్లు అయినది. ఆమె గుండె పులకించినది. కన్నులు నిండినవి. ఆశగా కొడుకును చూచినది.
"తల్లీ! నీవు నాకు తల్లివి కావచ్చును. నేను సూర్యుని వరమున కలిగి ఉండవచ్చును. నీవు నాకు చన్నిచ్చినావా? నా మూత్రపురీషములు ఓర్చినావా? పెంచినావా? పెద్ద చేసినావా? కన్నావు. అపవాదభీతికి గంగలో వదలినావు."
"నాయనా! కర్ణా! అనకు అట్లనకు. నాకొడకా! కర్ణా!" కుంతి కన్నీరు జలజలరాల్చినది.
"అమ్మా!' కర్ణుడు తల్లి కన్నీరు తుడిచినాడు. "అమ్మా! ధైర్యము వహింపుము. ఇంత జరిగినది. నన్ను పెంచిన వారున్నారు. నాకు ఆశ్రయము ఇచ్చిన దుర్యోధనుడు ఉన్నాడు. ఇప్పుడు నీ కొడుకును అని చెప్పుకున్న లోకము నవ్వదా! నన్ను పిరికివాడనదా? పాండవ సైన్యమును గెలుతునని దుర్యోధనుడు నన్ను నమ్మి ఉన్నాడు. ఇప్పుడే అతనికి నాతొ పని. అతనిని విడిచి రావచ్చునా? ద్రోహము చేయవచ్చునా?"
"నాయనా! కర్ణా! అనకు. అట్లనకు. నా కొడుకా! కర్ణా!' కుంతి కన్నీరు రాల్చలేదు. ఆమె కనులలో ప్రార్ధన వ్యక్తము అయినది.
"అమ్మా! నేను దుర్యోధనుని పక్షమున యుద్దము చేయుట నిశ్చయము. నీవు కార్యార్ధివై వచ్చినావు. రిత్తగా వెళ్ళరాదు. నీ కొడుకులలో అర్జునుడు తప్ప మిగిలిన వారు ఎదురయినను వారిని వధించను. వదిలివేతును. అర్జునుడు ఎదురయిన వానిని క్రూరముగా చంపుదును."
'అమ్మా! నీకు అయిదుగురే కొడుకులు అనుకొనుము. అర్జునుడు నాచేత చచ్చినను, నేను అర్జునుని చేత చచ్చినను నీకు అయిదుగురు కొడుకులు మిగులుదురు. ఇంతకన్న నేను చేయలేను. నేను కౌరవ పక్షమున పొరాట నిశ్చయము."
కర్ణుడు మాటలు మిగించినాడు. కుంతిని చూచినాడు. కుంతిలో ఆరాటము కనిపించలేదు. ఆమె కనులలో కొంత తృప్తి కనిపించినది.





