Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    శ్రీకృష్ణుడు సాగినాడు. ధృతరాష్ట్రాదులు అతని వెనుక వచ్చినారు. అతడు అందరిని చూచినాడు. నిలిచిపొండి అన్నట్లు చూచినాడు. కర్ణుని చూచినాడు. "కర్ణా! నావెంటరమ్ము. సాగనంపి వత్తువు" అని కర్ణుని చేయిపట్టుకున్నాడు. రథమువైపు సాగినాడు. రథము ఎక్కినాడు. కర్ణుని ఎక్కించినాడు. రథము సాగినది. సాత్యకి మరొక రథమున శ్రీకృష్ణుని ప్రక్కగా సాగినాడు.
    శ్రీకృష్ణుని రథము సాగుచున్నది.
    శ్రీకృష్ణుని రథమున కర్ణుడు ఉన్నాడు.
    "కర్ణా!" శ్రీకృష్ణుడు ఉపదేశించినాడు. "నీవు పెద్దలను సేవించినావు. ధర్మమును ఎరిగినావు. కీర్తిని ఆర్జించినావు. నీకు ఒక రహస్యము చెప్పెదను వినుము".
    "నీవుకుంతికి సూర్యుని వరము వలన కలిగినవాడవు. పాండవులకు అగ్రజుడవు. ఈవిషయము పాండవులకు చెప్పెదను. పాండవులు సకల బంధు, మిత్ర, పుత్ర సహితముగా నిన్ను సేవింతురు. నీకు సకల రాజ్యమును పట్టము కట్టుదురు. ధర్మరాజు నీరథము మీద నిలిచి చామరము వీచును. భీముడు తెల్లని ఛత్రము పట్టును. అర్జునుడు సారథ్యము చేయును. నకుల సహదేవులు, అభిమన్యులు మొదలగు రాజకుమారులు నిన్ను సేవింతురు. మేమందరము నీవెంత నడుతుము. నీవు ఇంద్రునివలె సకల ప్రపంచమును పాలింపుము. నీవు నీతమ్ములతో కలిసి ఉన్న ద్రౌపది నిన్ను ఆరవ భర్తగా పొందగలదు. ఆలోచింపకుము. ఆలస్యము చేయకుము. పాండవులవద్దకు రమ్ము. నీతల్లి కుంతీదేవియు, సకల బంధుజనులును సంతోషింతురు".
    కర్ణుడు శ్రీకృష్ణుని మాటలు విన్నాడు.
    రథము సాగుచున్నది.
    కర్ణుడు మౌనము దాల్చినాడు. ఏవో అనుభూతులతో మునిగిపోయినాడు. అనుభూతుల నుండి బయటపడినాడు. అన్నాడు:-
    శ్రీకృష్ణా! నీవు ఉచితముగా మాట్లాడినావు కావు. నీవు రహస్యము అని చెప్పినది రేఖా మాత్రముగా నాకు తెలిసినది. కుంతి నన్ను కన్నది నిజము కావచ్చును. ఆమె నిర్ధయురాలయినది. నన్ను పెట్టెలో పెట్టినది. నదిలో విడిచినది. సూతుడు పెట్టెలో నన్ను చూచినాడు. తన భార్యకు నన్ను ఇచ్చినాడు. ఆమె నన్ను ఎత్తుకున్నది. ఆమెలో మాతృత్వము పొంగినది. పొరలినది. ఆమె పాలిండ్లు చేపినవి. ఆమె నాకు పాలిచ్చినది. సూతుడు, రాధ నాకు తల్లిదండ్రులు అయినారు. వారు నామీద పుత్రవాత్సల్యము పెంచుకున్నారు. వారి బిడ్డలు నాకు సహోదరులు అయినారు. సూతుడు, రాధ నన్ను ఇంతవాడిని చేసినారు. ఇప్పుడు నన్ను వారిని విడిచి రమ్మందువా? నేను వారి కొడుకును కానని చెప్పమందువా? వారి గుండెలు బ్రద్దలు చేయమందువా? నేను రాధ పుత్రుడను. రాధేయుడనుగానే ఉండనిమ్ము.
    "దుర్యోధనునకు నేను సూతపుత్రుడను అని తెలియును. అయినను నాయందు సోదరులందువలె ప్రీతి కలిగి ఉన్నాడు. నాకు తేజో గౌరవములను కలిగించినాడు. తనంతవానిగా చూచినాడు. అర్జునుని ఎదిరించు మొనగానిగా నన్ను నమ్మి ఉన్నాడు. ఇప్పుడు యుద్దము వచ్చినది. నాతో పని పడినది. ఇప్పుడు దుర్యోధనుని విడిచి వచ్చుట ధర్మమగునా? రాజ్యపు ఆశతో పాండవులలో చేరుట న్యాయమగునా? శాస్త్రములు మెచ్చునా? లోకము మెచ్చునా?"
    "శ్రీకృష్ణా! నా జన్మ రహస్యము ధర్మరాజునకు, ఇప్పటికి తెలియకున్న, తెలియపరచకుము. ఏలనందువేమో నేను అన్నను అని తెలిసిన అతడు సామ్రాజ్యముణు అనుభవింపడు. అతడు సకల సామ్రాజ్యమును పాలించవలసి ఉన్నదిగదా!"




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.