Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
యుద్దము నివారించుటకు ఇంతకన్న గొప్ప ప్రతిపాదన ఉండదు.
యుద్దపు కండూతి కలవానికి ఏ ప్రతిపాదనయు రుచించదు.
9. ధృతరాష్ట్రుడు రాజు కాని బలహీనుడు. తన కొడుకును ఒప్పించలేక పోయినాడు. ఒప్పించమని శ్రీకృష్ణుని ప్రార్ధించినాడు. శ్రీకృష్ణుడు, మహర్షులు చెప్పినారు. దుర్యోధనుడు వినడు. తాను చేసినది, చేయుచున్నది, చేయనున్నది మాత్రమే న్యాయము అన్నాడు.
తనకు తోచినది న్యాయముకాదు.
సంఘము మెచ్చినది న్యాయము.
నలుగురికి మేలుచేయునది న్యాయము. కీడు చేయునది న్యాయము కాదు.
10. మానవునకు తనలోనే అనేకమంది శత్రువులు ఉన్నారు. వారిని గెలుచుట అటుంచి వారి ఉనికిని తెలుసుకొనుటకే జీవితము చాలదు. కొందఱు మహాత్ములు మాత్రము గెలువగలరు.
అహంకారము మనిషిలోని శత్రువులలో ఒకటి, ప్రధానమయినది. దుర్యోధనుడు అహంకారి. అహంకారము తన శత్రువు అని గ్రహించలేదు సరిగదా, మిత్రము అని భ్రమపడినాడు. సభ నుండి నిర్గమించినాడు. అగ్గిని మూటకట్ట దలచినాడు. శ్రీకృష్ణుని బంధించదలచినాడు.
శ్రీకృష్ణుడు విశ్వరూపమును ప్రదర్శించినాడు. శ్రీకృష్ణుడు తన "స్వరూపము"ణు ప్రదర్శించినది ఇది రెండవసారి. శిశుపాలవధ సమయమున తొలిసారి.
దుర్యోధనుని సహితముగా అందరు సభలోనే ఉన్నారు. విశ్వరూప దర్శనమున ధన్యులు అయినవారు కొందఱు మాత్రమే.
11. భారతము కురువంశపు కథ మాత్రము కాదు. అందు అనేక కాలములకు చెందిన అనేక కథలు ఉన్నవి. అవి మానవ చరిత్రను వెలికి తీయుచున్నవి. భారత కథ కాలనిర్ణయమును గురించి ప్రయత్నములు జరుగుచున్నవి. ప్రతి కథయొక్క కాలనిర్ణయము జరుగవలసి ఉన్నది.
గుణకేశి-సుముఖులది ప్రేమ-కథ. నేటి ప్రేమ కథలవలె వారి తల్లిదండ్రుల నుండి అభ్యంతరములు అడ్డంకులు వచ్చినట్లు కనిపించదు. తల్లిదంద్రులే వారి పెండ్లి చేసినారు. కులములు, ఆస్తులు, అంతస్తులు అడ్డురాలేదు.
12. గాలవుని కథ ఒక ముఖ్య చారిత్రక అంశమును వెల్లడి చేయుచున్నది.
నేడు స్త్రీ స్వాతంత్ర్యము కొఱకు ప్రపంచ వ్యాప్తముగ ఉద్యమములు జరుగుచున్నవి.
గాలవుని నాడు స్త్రీ స్వైరిణి అయినట్లు కనిపించుచున్నది. పురుషునకు స్త్రీ భార్యగా లభించుట దుర్లభము అయినట్లున్నది. పురుషుని వద్ద ఉన్నను పిల్లలను కనుటకు నిరాకరించినట్లున్నది.
ఇక్ష్వాకుడు, దివోదాసు, ఔశీనరుడు మాధవిని రెండురెండు వందల గుఱ్ఱములను ఇచ్చికొన్నారు. సంతానము బడయునంతవరకు మాత్రమే.
పిల్లలు కనెడి స్త్రీలు దొరుకుత అంత కఠినముగా ఉండిన కాలము ఒకటి ఉండెను.
.....
శ్రీకృష్ణుడు సభ నుండి బయటికి వచ్చినాడు. అతని ముఖము జేవురించినది. కనులు ఎర్రవారినవి. అతని వెనుకనే కౌరవులందరు వచ్చినారు. రథము సిద్దముగా ఉన్నది. శ్రీకృష్ణుడు ఆసీనుడు కానున్నాడు. ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చినాడు. "మహాత్మా! శ్రీకృష్ణా! పాండవ కౌరవులు కలిసి ఉండవలెనని నేను నాకొడుకునకు చెప్పినాను. ప్రయత్నించినాను. నీకు నేను నిర్దోషుడను అని తోచిన చాలును. లోకము సమతము నన్ను నిర్దోషిగా భావించును" అన్నాడు.
శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని మాటలు విన్నాడు. క్షణము మౌనము దాల్చినాడు. అచట కూడిన వారిని చూచినాడు. "భీష్మ, ద్రోణ, బాహ్లీకాదులారా! వింటిరా రారాజు మాటలు! తనయందు ఎట్టిదోషము లేదని పలుకుచున్నాడు. ఇప్పుడు ఇది చర్చకాదు. నేను వెళ్ళవలసి ఉన్నది. మీరు నిలువుడు" అని రథము ఎక్కినాడు. ధృతరాష్ట్రాదులు అతనిని అనుసరించినారు.
శ్రీకృష్ణుని రథము కుంతీదేవి ఇంటిముందు నిలిచినది. శ్రీకృష్ణుడు రథము దిగినాడు. కుంతివద్దకు వెళ్ళినాడు. ఆమెకు పాదాభివందనము చేసినాడు. సభలో జరిగిన వృత్తాంతము వివరించినాడు. ధర్మరాజునకు చెప్పవలసినది ఆనతిమ్మని కోరినాడు.
ధృతరాష్ట్రుడు మున్నగు వారు వినుచుండగా కుంతి చెప్పినది.
"అల్లుడా! శ్రీకృష్ణా! శక్తిమంతులయ్యు పాండవులు శాంతి కోరినారు. నీ అంతటివాడవు సంధికోరి రాయబారిగా వచ్చినావు. వినాశము దగ్గరపడిన వారికీ మిత్రవాక్యము చెవికెక్కదు. మంచిదే అయినను సంధి కుదరలేదు. నా కొడుకుల ప్రతాపము ప్రపంచమునకు వెల్లడికానున్నది. శ్రీకృష్ణా! ధర్మరాజునకు చెప్పుము. నీతల్లి సుఖముగా జీవించి ఉన్నదని చెప్పుము. రాజ్యము రణరంగమున గెలుచుట క్షత్రియ ధర్మమని చెప్పుము. ఆయుధ బలమున రాజ్యమును ఆర్జించమని చెప్పుము" అని శ్రీకృష్ణుని కౌగిలించుకున్నది. తల ముద్దాడినది. సాగనంపినది.





