Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    ఇది ఇప్పటికి జరుగుచున్నది. బెత్తముల ప్రయోగము "లాఠీ చార్జీ" వంటిది.
    హస్తినలో స్త్రీలకు సహితము శ్రీకృష్ణుని కథలు తెలిసినవి. వారు సహితము శ్రీకృష్ణుని స్తుతించినారు.
    4. హస్తినకు చేరగనే లాంఛనముగా ధృతరాష్ట్రుని చూచినాడు శ్రీకృష్ణుడు. కాని వాస్తవముగా అతడు చేరదలచినది విదురుని గృహము. విదురుడు పాండవుల మనిషి. లక్క ఇంటి ఉదంతమున పాండవులకు రహస్యములు చెప్పి రక్షించినవాడు విదురుడు. పాండవులు అడవులకు వెళ్ళినపుడు కుంతిని విదురుని వద్ద ఉంచినాడు. అంతటి నమ్మకస్తుడు అతడు. అందువలన శ్రీకృష్ణుడు విదురుని ఇంటికి వెళ్ళినాడు.
    శత్రువు ఇంట భోజనము చేయరాదు అన్నాడు శ్రీకృష్ణుడు దుర్యోధనునితో. భీష్మాదులు భోజనమునకు పిలిచినారు. అయినను వెళ్ళలేదు. విదురుని ఇంటనే భుజించినాడు. అంతటి నమ్మకస్తుడు విదురుడు.
    విదురుడు ఒక విషయము వివరించినాడు. ఇప్పుడు దుర్యోధనునితో చేరిన రాజులందరు పూర్వము పాండవులతో ఓడినవారని. శత్రువునకు శత్రువు తనకు మిత్రుడగును. ఇచట రెండు విషయములు స్పష్టములు.
    i ఇదివరకు పాండవులకు ఓడినవారు కావున బలహీనులు. వారిని ఓడించుట సులభము.
    ii బలహీనులు అయినను అందరు కలసివచ్చినారు. కావున జాగ్రత్త అవసరము.
    5. శాంతి ప్రయత్నమునకు శ్రీకృష్ణుడు హస్తినకు వచ్చినాడు. అట్లని అతడే విదురునకు చెప్పినాడు. యుద్దమున రాజులు మాత్రమే కాదు. ప్రజలు చత్తురు. ప్రజాక్షయము జరుగును. దానిని నివారించవలెనని మంచి ఆలోచనగల వారందరు ప్రయత్నింతురు.
    దుర్యోధణుని దుష్టత్వము శ్రీకృష్ణునకు తెలియనిది కాదు. అయినను ప్రయత్నించుట పురుష లక్షణము. "యత్నేకృతేయది నసిద్ద్యతి కో త్రద్రోషః?"
    మానవ జాతి ఈనాడు సరిగా ఆనాటి పరిస్థితినే ఎదుర్కొనుచున్నది. ఈ శతాబ్దమున రెండు ప్రపంచ యుద్దములు జరిగినవి. యుద్దము ఎంతటి వినాశకారియో మానవుడు గుర్తించినాడు. అయినను మారణాయుధములు తయారగుచున్నవి. ఆకాశ యుద్దమునకు ఏర్పాట్లు జరుగుచున్నవి.
    శాంతి స్థాపనకు ప్రజలు, మేధావులు, శాంతికాముకములు అయిన దేశములు ప్రయత్నించుచున్నవి.
    సాధారణ మానవుడు సర్వదా శాంతి కోరినాడు. కోరుచున్నాడు. కోరగలడు.
    శాంతి రాజకీయ రాక్షసుల పిడికిట ఉన్నది.
    6. శ్రీకృష్ణుడు కుంతి దగ్గరికి వెళ్ళినాడు. ఆమె మూర్తీభవించిన మాతృమూర్తిగా దర్శనము ఇచ్చినది. జగదేకవీరులు అయిదుగురు ఆమె కొడుకులు. అయినను దుష్టుడు దుర్యోధనుని కూడు తినవలసి వచ్చినందుకు ఆ తల్లి మనసు కుతకుత ఉడికినది. ద్రౌపది పడిన బాధలు చూచి వలవల ఏడ్చినది. ఎన్నాళ్ళు తనకీ చెరలు? విముక్తి ఉన్నదా? అని వాపోయినది. వీరవనితగా సందేశమంపినది. యుద్దమున రాజ్యము గెలువమన్నది. బిచ్చము అడుగరాదన్నది.
    ఇది కుంతి బాధ మాత్రము కాదు. లోకమందున్న తల్లులందరి వ్యధ బాధ.
    శ్రీరాముడు ఆదర్శ పురుషుడు. అతణ్ణికన్నతల్లి కౌసల్య ఏమి సుఖపడినది? కొడుకునకు దూరమయి ఆమె సైతము ఏడ్చినది. విలవిలలాడినది.
    గాంధారి నూరుగురిని కన్నతల్లి. ఆమె మాట ఎవరువిన్నారు? పుత్ర శోకమున కృంగి, కృశించి నశించినది.
    పరశురాముడు తండ్రిమాట విన్నాడు. తల్లి తల నరికినాడు.
    ద్రౌపది అయిదుగురిని కన్నది. అందరిని పోగొట్టుకున్నది.
    కుంతి బాధ తల్లుల బాధ!
    7. సభలో కూర్చుండు స్థలముల ఏర్పాటు ఒక నిర్ణీత పద్దతిలో ఒక పద్దతి ప్రకారము జరిగినది.
    8. శ్రీకృష్ణుడు తొలుత దుర్యోధనుని లెక్కలోనికి తీసుకొనలేదు. అతడు ధృతరాష్ట్రుని మాత్రమే సంబోధించినాడు. చెప్పినవి అన్నియు ధృతరాష్ట్రునకే చెప్పినాడు. వాస్తవముగా రాజు ధృతరాష్ట్రుడు. దుర్యోధనునకు రాజకీయ అధికారము గాని పదవిగాని లేవు.
    పదవిలేనివాని అధికారము వలన జరుగు ప్రమాదమును దుర్యోధనుని పాత్ర హెచ్చరించుచున్నది.
    శాంతి స్థాపనకు శ్రీకృష్ణుడు చాల దూరము పోయినాడు. అతడు పాండవులకు అర్ధ రాజ్యము సహితము అక్కరలేదను వరకు వచ్చినాడు. ధృతరాష్ట్రుడు రాజుగా ఉండును. దుర్యోధనుడే యువరాజగును. కౌరవులు పాండవులు కలిసి ఉండిన చాలును అన్నాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.