Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    "ధృతరాష్ట్ర, బాహ్లీక, భీష్మ, విదురాదులరా! దుర్యోధనాదులు కుట్ర పన్నుచున్నారు. దుష్కార్యము చేయతలపెట్టినారు. శ్రీకృష్ణుని పట్టుదురట! కట్టుదురట! కొట్టుదురట! విన్నారా! శ్రీకృష్ణుడు భగవంతుడు. అతనిని కట్టుట అగ్గిని బట్టలో కట్టుట వంటిది".
    సాత్యకి మాటలు విన్నాడు విదురుడు. అదిరి పడినాడు. "మహారాజా! నీకొడుకులకు ఆయుష్కాలము దగ్గర పడినట్లున్నది. శ్రీకృష్ణుని తాకినంత మాత్రమున నీకొడుకులు అగ్గిని మింగబోయిన మిడుతలవలె కాలి చత్తురు" అన్నాడు.
    "విదురా! వెంటనే వెళ్ళుము. దుర్యోధనాదులను నావద్దకు తెమ్ము" అన్నాడు ధృతరాష్ట్రుడు. విదురుడు దుర్యోధనుని పిలుచుకొని వచ్చినాడు. అతని వెంట దుశ్శాసన కర్ణాదులు గుంపుగా సభలో ప్రవేశించినారు.
    "దుర్యోధనా!" ధృతరాష్ట్రుడు అన్నాడు ఏమిరా ఈ శ్రీకృష్ణునకు కీడు తలపెట్టగలవా? గాలిని పిడికిట పట్టగలవా? పర్వతమును కదిలించగలవా? అగ్గిని పట్టగలవా? మీరందరు మీ నాశనము కోరి తెచ్చుకొనుచున్నారు. అయ్యో! నేనేమి చేతును" అని వగచినాడు.
    శ్రీకృష్ణుడు దుర్యోధనుని చూచినాడు. వెఱ్ఱివానిని చూచినట్లు నవ్వినాడు. అట్టి వాసుదేవుని ఫాల ప్రదేశంబున బ్రహ్మయు, వక్షంబున విరూపాక్షుండును, వదనంబును వహ్నియు, బార్శ్వంబుల నింద్రయమ వరుణ కుబేరులు నాదిత్య మరుద్విశ్వదేవాశ్వినులును నుద్భవించిరి. హల గాండీవ మండిత బాహులగు బలదేవార్జునులు సవ్య దక్షిణ భుజంబులను నిజాయుధ హస్తులగుయుధిష్ఠిర భీమ నకుల సహదేవులు వీపునను, వివిధ ప్రహరణ ప్రాణులగు యదు, వృష్టి భోజాంధక వీరులూరులను బ్రభవించిరి. జనిత నానాహస్త విన్యస్తంబులయి శంఖ చక్రగదా ఖడ్గశక్తి శార్ఙ్గాది ప్రముఖ నిఖిల సాధనంబులు వెలింగె. నేత్ర శ్రోత్ర నాసా వివరంబుందరుణ కిరణ నిభప్రభలు వెడలెనిట్లు దుర్నిరీక్ష్యం బగునత్తే జోరూపంబు గనుంగొనంగొలదిగాక సకల జనంబులు నయనంబులు మొగిడ్చి యద్భుత భయానక రసంబులు బొత్తిల్లు జిత్తంబుల తోడంగదల కుండిరి.
    భగవంతుడగు శ్రీకృష్ణుడు నారదాదులయందును, భీష్మ, ద్రోణ, విధుర, సంజయులయందును దయగలిగినాడు. వారికి దివ్యదృష్టిని ఇచ్చినాడు. వారు భగవంతుని విశ్వరూపము చూచి చిత్తరువులయినారు.
    ఆకసమున దేవదుందుభులు మ్రోగినవి.
    కల్పవృక్ష పుష్పవృష్టి కురిసినది.
    సిద్ద, సాధ్య విద్యాధరాదులు జయజయధ్వానములు చేసినారు.
    ఇవి అన్నియు విన్నాడు ధృతరాష్ట్రుడు. గ్రహించినాడు. "భగవాన్! శ్రీకృష్ణదేవా! నన్ను అనుగ్రహింపుము. నీరూపమును సేవించు భాగ్యము కలిగింపుము" అని చేతులు మోడ్చి ఆర్తితో ప్రార్ధించినాడు.
    భగవానుడు కరుణించినాడు. దివ్యదృష్టి ప్రసాదించినాడు.
    శ్రీకృష్ణుడు ప్రసాదించిన దివ్యదృష్టివలన ధృతరాష్ట్రుడు పరమేశ్వరుని విశ్వరూపమును దర్శించినాడు. ఆనందమున మునకలు వేసినాడు. అన్నాడు:-
    "పరమాత్మ! శ్రీకృష్ణదేవా! నీకు భక్తిపూర్వకముగ నమస్కరించుచున్నాను. నాకు లేని కన్నులు ఇచ్చినావు. నీరూపమును చూపించినావు. ధన్యుడను అయినాను. ఇక నాకీ చూపువద్దు. నిన్ను చూచిన కన్నులతో ఇతరములు చూడలేను. నా చూపు పోగొట్టుము. పోగొట్టుము".
    ధృతరాష్ట్రుడు కోరినట్లు శ్రీకృష్ణుడు అతనికి ఎప్పటివలె కన్నులు లేకుండ చేసినాడు. నారదాది మహామునులు విశ్వరూపము దర్శించి అంతర్ధానులు అయినారు.
    శ్రీకృష్ణుడు విశ్వరూపమును ఉపసంహరించినాడు. తాను కూర్చున్న పీఠము నుండి లేచినాడు. సాత్యకి కృతవర్మలు రెండు పక్కల నిలిచినారు. వారి చేతులు పట్టుకొని బయటకి సాగినాడు.
    
                                                          ఆలోచనామృతము
    
    1. అటునుంచి ద్రుపదుని పురోహితుడు, ఇటునుండి సంజయుడు అంతకుముందు రాయబారులుగా వెళ్ళినారు. అప్పుడు అంతగా సందడి కనిపించలేదు. శ్రీకృష్ణుని స్థితి, అంతస్తు, అధికారము గొప్పవి. సాధారణముగా రాయబారిగా వెళ్ళవలసినదికాదు. అయినను మహత్కార్యమును సాధించుటకు రాయబారి అయిసాగినాడు.
    2. హస్తినలో జరిగిన ఏర్పాట్లు రాజులకు, రారాజులకు స్వాగతము పలుకునట్లున్నవి. అవి రాయబారికి ఇచ్చుమాత్రపువి కాదు. శ్రీకృష్ణుని మహత్త్వము అంతటిది. అంతగా వెల్లడి అయినది.
    ఈనాటికీ విదేశ పముఖులను ఆహ్వానించుటకు ఇంతటి ఏర్పాట్లు జరుగుచున్నవి.
    3. శ్రీకృష్ణుని మహత్తు తన రాజ్యమందే కాదు సర్వవ్యాప్తమయినది. దుర్యోధనుని రాజ్యము అయిన హస్తినలో ప్రజలు తండోపతండములుగా అతనిని దర్శించుటకు వచ్చినారు. వారిని చెదర గొట్టుటకు బెత్తములు ప్రయోగించవలసి వచ్చినది. ఇది శ్రీకృష్ణుని జనాకర్షణను సూచించును. శ్రీకృష్ణుడు బెత్తములవారిని వారించినాడు. ఎల్లరకు దర్శనము ఇచ్చినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.