Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    దుశ్శాసనుడు శ్రీకృష్ణుని మాటలు విన్నాడు. "అన్నా! దుర్యోధనా! భీష్మ, ద్రోణ, ధృతరాష్ట్రులు నీకు కీడు తలపెట్టనున్నారు. నీవు వారు చెప్పినట్లు సంధిచేయకున్న నిన్ను పట్టి శ్రీకృష్ణునకు అప్పగింతురు. మనము ఈసభలో ఉండుట క్షేమముకాదు" అన్నాడు.
    దుర్యోధనుడు దుశ్శాసనుని మాటలు విన్నాడు.  సభను కలయజూచినాడు. బాహ్లీక, భీష్మ, ద్రోణాది మహామహులు కనిపించినారు. దుర్యోధనుడు వారిని లెక్కచేయలేదు. సభా మర్యాదను పాటించలేదు. దిగ్గున లేచినాడు. సభనుండి బయటికి వెళ్ళిపోయినాడు. అతని వెంట దుశ్శాసనాది సోదరులు, కర్ణుడు, శకుని కొందరు రాజులు సభను విడిచి వెళ్ళిపోయినారు.
    సభవారు దుర్యోధణుని దుశ్చరితమునుచూచి ఆశ్చర్యపోయినారు. చకితులు అయినారు. భీష్ముడు సభను చూచి "సభా సదులారా! దుర్యోధనుడు దురభిమాని. సభను అవమానపరచి వెళ్ళిపోయినాడు. అతని మిత్రులందరు అతనినే అనుసరించినారు. వీరందరు ఏమి చేయదలచినారో అర్ధముకాకున్నది. నేనేమి చేతును? వారందరికి కాలము తీరినట్లు కనిపించుచున్నది" అని వాపోయినాడు.
    "భీష్మాదులారా!" శ్రీకృష్ణుడు ప్రవచించినాడు. "దుర్యోధనుడు కన్నుమిన్నుకానక ఇంతటి మహానుభావులు ఉన్న సభను అవమానపరిచి వెళ్ళిపోయినాడు. దీనికి పరిహారము లేదా! చారిత్రాత్మకము అయిన భరతవంశము ఒక్క దుర్మార్గుని వలన అంతము కావలసినదేనా? దుర్యోధనుని వదిలి భరతవంశమును రక్షింపలేరా? పూర్వము కంసుడు తండ్రి అయిన ఉగ్రసేనుని బాధలపాలు చేసినాడు. వైద్యుడు దుర్మాంసమును ఖండించినట్లు నేను కంసుని వధించినాను. ఆ వంశమును ఉద్ధరించినాను. ఉగ్రసేనునకు సంతోషము కలిగించినాను. కావున ఒక్క దుర్యోధనుని వధించి భరతవంశమును రక్షించుకొనుడు".
    ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని ప్రవచనము విన్నాడు. అదిరిపడినాడు. విదురుని పంపినాడు. గాంధారిని పిలిపించినాడు. "గాంధారీ! చూచితివా నీకొడుకు నిండు సభను అవమానించి నిండుసభ నుంచి లేచిపోయినాడు. నీవైనను వానికి బుద్ధి చెప్పుము" అన్నాడు.
    "ప్రాణనాథా! ఏదియు తెలియనట్లు మాట్లాడు బేలవా? దుర్యోధనుడు దుర్మార్గుడని నీకు తెలియదా? తెలిసియు వానికి కీలుబొమ్మవయి ఆడుచున్నావు. ఎందులకీ ఆట! నీవు పాండవులకు ఏమి ఇవ్వదలచినావో ఇచ్చివేయుము. నిన్ను కాదనువారు ఎవరున్నారు? నిన్ను అడ్డువారు ఎవరున్నారు?" అన్నది గాంధారి.
    విదురుని పంపి దుర్యోధనుని పిలిపించినది. ముఖము జేవురించుకొని దుర్యోధనుడు సభలోనికి వచ్చినాడు. అతనితో బయటికి వెళ్ళినవారు మాత్రము రాలేదు. వారు బయటనే ఉన్నారు.
    గాంధారి దుర్యోధనుని తన దగ్గర కూర్చుండ పెట్టుకున్నది. అతనిని దూషించి చెప్పినది. ధర్మ మార్గము చెప్పినది. నీతి మార్గమును చెప్పినది బంధు హితము చెప్పినది. కుల జనులను గురించి చెప్పినది. బాహ్లీక, భీష్మ, ద్రోణుల చిత్త ప్రవృత్తిని గురించి చెప్పినది. పాండవుల బలపరాక్రమములను గురించి చెప్పినది.
    గాంధారి దుర్యోధనుని కోపించి చెప్పినది. బుజ్జగించి చెప్పినది. ప్రియభాషణముల చెప్పినది. బోధించి చెప్పినది. శాస్త్రములు వివరించి చెప్పినది.
    గాంధారి దుర్యోధనునకు ఎంతో చెప్పినది.
    దుర్యోధనుడు తల్లి మాటలు లెక్క చేయలేదు. చుర చుర చూసినాడు. అహంకారము పెంచుకున్నాడు. మరల సభ నుంచి లేచి వెళ్ళిపోయినాడు.
    దుర్యోధనుని కొఱకు సభ బయట కర్ణాదులు వేచి ఉన్నారు. దుర్యోధనుడు కోపమున వారి దగ్గరికి చేరినాడు. "మిత్రులారా! శ్రీకృష్ణుని మాటల పద్దతి బాగుండలేదు. కంసుని చంపిన కథ చెప్పుచున్నాడు. చూడగా భీష్మ ద్రోణాదులతో కలిసి మనలను పట్టవలెనని చూచుచున్నాడు. అంతకుముందే మనము శ్రీకృష్ణుని పట్టుదము. చెరపెట్టుదము. ఆవిధముగా చేసిన పాండవులు దిగులు పడుదురు. చత్తురు. చావకున్నను కోరలు తీసిన పాములు అగుదురు. మనసు గెలువ జాలరు" అని చెప్పినాడు.
    దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణాదులు, వారి స్నేహితులగు రాజులు పరమాత్ముడయిన శ్రీకృష్ణుని పట్టుటకు కొట్టుటకు ప్రయత్నములు సాగించినారు.
    దుర్యోధనాదుల దురాలోచనమును సాత్యకి గ్రహించినాడు. సైన్య సమేతముగా వాకిట నిలువ వలసినదని కృతవర్మకు చెప్పినాడు. సభలోనికి ఉరికి వచ్చినాడు. శ్రీకృష్ణునకు తెలియపరచినాడు. అన్నగారి అనుమతి పొందినాడు. సభాసదులను హెచ్చరించినాడు:-




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.