Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"దుర్యోధనా! ఒక్కసారి ఆలోచించుము. అర్జునుని ఎదిరించి నిలువ గలవాడు నీ పక్షమున ఒక్కడయిన ఉన్నాడా? విరాటుని గోవుల నాటిమాట తలచుకొనుము. పార్ధుడు ఒక్కడే మీకు అందరకు తలవంపులు తెచ్చినాడు. నేడు నేను పార్ధుని వెంట ఉన్నాను. నీవు గెలుచుట అసంభవము. యుద్దము జరిగైనా సుపుత్ర, మిత్రబాంధవముగా నశింతువు".
"దుర్యోధనా! కులనాశకుడవు కాకుము. పాండవులతో సంధి చేసికొనుము. సంధి కలిగినను ధృతరాష్ట్రుడే రాజగును. నీవు యౌవరాజ్య పట్టాభిషక్తుడవు అగుదువు. నీవు, నీబంధు జనులును ధృతరాష్ట్ర మహారాజును సేవించుచుండుటయే సామ్రాజ్యము అగును".
"పాండవులు నీతో కలిసి ఉండవలెనని కోరుచున్నారు. నీవు వలదు అనుచున్నావు. దీనినే 'సిరిరా మోకాలొడ్డుట' అందురు. పాండవులతో సంధిచేసి కొనుట నీకు, నీ కులమునకు క్షేమకరము".
శ్రీకృష్ణుని ఉపదేశమును భీష్మ ద్రోణులు బలపరిచినారు. "శ్రీకృష్ణుడు చెప్పినట్లు చేయుము. నీకు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగును. మా మనసులు చల్లబడును" అన్నారు.
ధృతరాష్ట్రుడు అందరి మాటలు విన్నాడు. "దుర్యోధన కుమారా! నీవు శ్రీకృష్ణుని ఆశ్రయింపుము. ధర్మరాజు నీకు అన్న. అతనికి దగ్గరికి వెళ్ళుము. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారము చేయుము. అందువలన మన కార్యములు అన్నియు సిద్ధించును. శ్రీకృష్ణుని మాట వినకున్న మనకు సకల ఆపదలు కలుగును" అన్నాడు.
ధృతరాష్ట్రుని మాటలు విన్నారు. భీష్మ ద్రోణులలో ఆశ చిగురించినది. తమ మాట మరింత గట్టిగా చెప్పదలచినారు. "దుర్యోధనా! శ్రీకృష్ణుడు సారథిగా, పార్ధుడు గాండీవము ధరించి రణరంగమునకు రాకమునుపే, పాండవులతో సంధి చేసుకొనుము. నీవు ధర్మరాజు వద్దకు వెళ్ళుము. అతనికి పాదాభివందనము చేయుము. అతడు నిన్ను లేవనెత్తును. కౌగిలించుకొనును. భీమార్జున నకుల సహదేవులు నిన్ను కౌగిలించుకొందురు. ప్రేమలో ఆనందము ఉన్నది. ద్వేషమున దుఃఖము ఉన్నది. నీవు వారితో కలిసి ఉన్నచో బంధుమిత్రులు ఆనందింతురు. ఎల్లరికి సుఖము కలుగును. యుద్దము తప్పును. హింస తప్పును. యుద్దమునకు వచ్చిన ఇరు పక్షముల సైన్యములు, రాజన్యులు తమ తమ రాజ్యములకు తిరిగి పోదురు. మీరును, పాండవులును రాజ్యము పంచుకొని సుఖముగా ఉండుడు. అప్పుడు లోకమునకు శాంతి కలుగును. ప్రజలకు శాంతి కలుగును. ప్రకృతికి శాంతి కలుగును" అని హితోపదేశము చేసినారు.
సభ సాంతము శాంతిని గురించి విన్నది. సంతోషించినది. దుర్యోధనుని నిశ్చయము వినుటకు తపించినది.
"శ్రీకృష్ణా!" దుర్యోధనుడు మాట్లాడినాడు. "ఈ భీష్ముడు, ద్రోణుడు, నాతండ్రి ధృతరాష్ట్రుడు నన్ను దూషించుటయే వ్యాపారముగా పెట్టుకున్నారు. నీవు సహితము నన్ను దూషించుచున్నావు. న్యాయము యోచింపకున్నావు. నేను చేసిన అన్యాయమేమి?".
"మేము ద్రౌపదిని అవమానించితిమట! పాండవులను అడవులకు పంపితిమట! అట్లని వారు మా మీద నిష్కారణ ద్వేషము వహించినారు. మమ్ము చంపుటకు పూనియున్నారు".
"ధర్మరాజు జూదరి. శకునితో జూదము ఆడినాడు. రాజ్యమును ఓడినాడు. మరల జూదము ఆడినాడు. ఓడినాడు. వనవాస, అజ్ఞాతవాసములకు పోయినాడు. అందు నేను చేసిన మోసమేమున్నది? ఆ పాండవులే ఇప్పుడు మత్స్య, పాంచాల, పాండ్యాది రాజులను కూర్చుకున్నారు. యుద్దమునకు సిద్దము అయినారు. యుద్దమునకు మేము దిగలేదు కదా!".
"మేము రాజ ధర్మమును అనుసరించుచున్నాము. దేవేంద్రునకయినను మ్రొక్కము. పాండవులు మాకు శత్రువులు. వారికి మ్రొక్కుట అసాధ్యము. అసంభవము".
"శ్రీకృష్ణా! నన్ను చిన్నవాడినిగా చూచి ఇదివరకు పాండవులకు రాజ్యము ఇచ్చినారు. ఇప్పుడు అది జరుగుటకు వీలులేదు. నేను జరుగనివ్వను. భీష్మ, ధృతరాష్ట్రులు భూమిని పంచి ఇత్తుము అన్నను అందుకు నేను అంగీకరించను. పులి రక్తపు రుచి మరిగినట్లు పాండవులు రాజ్యపు రుచి మరిగినారు. మరల రాజ్యము కోరుచున్నారు. రాజ్యము వారికిరాదు".
"పాత పాటలు పనికిరావు. పూర్వపద్దతులను నేను సహించను. పాండవులు రాజ్యము ఏలుట అసంభవము. నేను వారికీ భూమి పంచి ఇవ్వను. సూదిమొన మోపినంత నేల కూడ వారికి చెందదు".
"శ్రీకృష్ణా! ఈ నేలను మేమైన ఏలవలె లేక పాండవులయిన ఏలవలె. యుద్దమునందు ఎవరు గెలుతురో వారే రాజ్యము ఏలుదురు. ఇదే నా నిశ్చయము. దీనికి తిరుగులేదు".
శ్రీకృష్ణుడు దుర్యోధనుని మాటలు విన్నాడు. అతని కనులు ఎర్రబడినవి. "దుర్యోధనా! యుద్దము, యుద్దము అనుచున్నావు. అది రేపే రానున్నది. భీష్మ, ద్రోణాది మహావీరులు అందుకు సిద్దమగుదురుగాక".
"నీవు న్యాయమును గురించి మాట్లాడుచున్నావు. నీవు పుట్టినది మొదలు పాండవులకు కీడు కలిగించుచున్నావు. చిన్నతనమున వారిని పాములతో కరిపించినావు. విషము పెట్టించినావు. పాండవులు దిగ్విజయము చేసినారు. అప్పుడు వారిని లక్క ఇంట పెట్టి కాల్చినావు. పాంచాలి పెళ్ళి తరువాత విధిలేక వారికి రాజ్యము ఇచ్చినావు. వారి వైభవము చూడలేక కపట జూదము ఆడించినావు. మోసము చేసి ఓడించినావు. అన్న భార్యను నిండు సభకు పిలిపించి చీరలు ఒలిపించిన తమ్ముడవు ఈ జగమున నీవు ఒక్కడవే కనిపించుచున్నావు. నీవంటి పాపబుద్ధి కలవాడు మరొకడు కానరాడు. ద్రౌపది మహాగుణవంతురాలు. ఆమెను ఆసభలో నీవు, కర్ణుడు అన్న మాటలు ఇక్కడ చెప్పదగినవికావు. అప్పుడు ఈ సభికులందరు విన్నారు. చూచినారు. ఇప్పుడు వారు వినుచుండగనే నావలన తప్పిదము ఏమాత్రము లేదు అనుచున్నావు. ఈ పద్దతి నీకు మాత్రమే చెల్లును. ఇప్పుడు పాండవులే యుద్దమునకు వచ్చుచున్నారని వారిమీద అపరాధము మోపుచున్నావు. అంతమాత్రమున నీవు బ్రతికి బయటపడజాలవు. భీష్మ, ద్రోణ, ధృతరాష్ట్రులు చెప్పుమాటలు నీచెవికి ఎక్కుటలేదు. ఇప్పటికయినను గ్రహించుము. పాండవులతో సంధి చేసికొనుటవలన నీకు మేలగును".





