Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
గరుడునకు మంచి అనుభవము అయినది. అతడు దేవలోకపు ప్రయాణము మానినాడు. ప్రతిష్ఠానపురమునకు రాజు యయాతి. గరుడుడు గాలవుని యయాతి దగ్గరకు తీసుకొని వెళ్ళినాడు. గాలవుని కథ వినిపించినాడు. సయాము చేయవలసినదని అర్ధించినాడు.
యయాతి గరుడుని అర్ధింపునకు జాలిపడినాడు. "నాకు ఒక కూతురు ఉన్నది. ఆమె మాధవి. ఆమెను మీకు ఇచ్చెదను. ఆమెను ఇచ్చి గుర్రములను సంపాదించవలసినది" అన్నాడు. మాధవిని ఇచ్చినాడు.
గాలవుడు మాధవిని తీసుకున్నాడు. అయోధ్యను పాలించు ఇక్ష్వాకుని దగ్గరకు వెళ్ళినాడు. తన కథ చెప్పినాడు. మాధవిని చూపినాడు. "మాధవిని నాకు సంతానము కలుగువరకు నావద్ద ఉంచుము. నావద్ద రెండువందల గుఱ్ఱములు ఉన్నవి. తీసుకొనిపొమ్ము" అన్నాడు ఇక్ష్వాకుడు.
గాలవుడు రెండువందల గుఱ్ఱములు తీసుకున్నాడు.
ఇక్ష్వాకునకు మాధవి వలన ఒక పుత్రుడు కలిగినాడు అతని పేరు మనస్సు.
గాలవుడు ఇక్ష్వాకుని దగ్గరకు వచ్చినాడు. మాధవిని తీసుకున్నాడు. కాశీరాజయిన దివోదాసుని దగ్గరకు వెళ్ళినాడు. తన కథ చెప్పినాడు. అర్ధించినాడు. దివోదాసు జాలిపడినాడు. "నాకు సంతానము కలుగువరకు మాధవిని నావద్ద ఉంచుము. నావద్ద రెండువందల గుఱ్ఱములు ఉన్నవి. తీసుకొని పొమ్ము" అన్నాడు దివోదాసుడు.
గాలవుడు రెండువందల గుఱ్ఱములు తీసుకున్నాడు.
దివోదాసునకు మాధవి వలన ఒక పుత్రుడు కలిగినాడు. అతని పేరు ప్రవరుడు.
గాలవుడు దివోదాసుని దగ్గరకు వచ్చినాడు. మాధవిని తీసుకున్నాడు. భోజపురపు రాజు ఔశీనరుని దగ్గరకు వెళ్ళినాడు. తన కథ చెప్పినాడు. అర్ధించినాడు. ఔశీనరుడు జాలిపడినాడు. "నాకు సంతానము కలుగువరకు మాధవిని నావద్ద ఉంచుము. నావద్ద రెండువందల గుఱ్ఱములు ఉన్నవి. తీసుకొని పొమ్ము" అన్నాడు ఔశీనరుడు.
గాలవుడు రెండువందల గుర్రములను తీసుకున్నాడు.
ఔశీనరునకు మాధవి వలన ఒక పుత్రుడు కలిగినాడు. అతని పేరు శిబి.
గాలవుడు ఔశీనరుని దగ్గరకు వచ్చినాడు. మాధవిని తీసుకున్నాడు. ఆరువందల గుఱ్ఱములు దొరికినవి. మరి రెండువందల గుఱ్ఱముల కొఱకు వెదుక సాగినాడు. వెదికి వెదికి వేసారినాడు. గుఱ్ఱములు లభించలేదు.
గరుత్మంతుడు గాలవుని దగ్గరకు వచ్చినాడు. జరిగినది అంతయు విన్నాడు. గాలవుని మాధవిని వెంట పెట్టుకున్నాడు. విశ్వామిత్రుని దగ్గరకు వెళ్ళినాడు. "మహాత్మా! విశ్వామిత్రా! ఈ గాలవుడు బాలుడు. నీవు కృపాసముద్రుడవు. గాలవుడు తెచ్చిన ఆరువందల గుర్రములను, మాధవిని గ్రహింపుము. మాధవి వలన సంతానము పొందుము. అప్పుడు నీకు ఎనిమిది వందల గుఱ్ఱములు అందినట్లగును. అనుగ్రహింపుము" అని ప్రార్ధించినాడు. విశ్వామిత్రుడు అందుకు అంగీకరించినాడు.
విశ్వామిత్రునకు మాధవి వలన ఒక పుత్రుడు కలిగినాడు. అతని పేరు అష్టకుడు.
తదుపరి విశ్వామిత్రుడు గాలవునకు మాధవిని అప్పగించినాడు. మాధవి తదనంతరము తపస్సు చేసినది.
"ఇది గాలవుని కథ. దుర్యోధనా! మొండి పట్టుదల, దురభిమానము వలన గాలవుడు పడరాని పాట్లు పడినాడు. తుదకు విశ్వామిత్రునే ఆశ్రయించినాడు. కావున నీవు పట్టుదల పట్టరాదు. పాండవులతో సంధి చేసుకొనుము. అందువలన నీకు శుభము కలుగును. శ్రీకృష్ణుడు చెప్పినమాట వినుము. కౌరవ వంశమును రక్షించుకొనుము".
సభసాంతము మహర్షులు చెప్పిన కథలు విన్నది. ఆసక్తి కనబరచినది. దుర్యోధనుడు ఏమి చెప్పునో అని ఎదిరి చూచినది. ధృతరాష్ట్రుడు ఎదిరి చూచినాడు. భీష్ముడు ఎదిరి చూచినాడు. ద్రోణుడు ఎదిరి చూచినాడు.
సభ సాంతము మౌనము దాల్చి, నిలిచినది.
"మునులారా!" దుర్యోధనుడు పలికినాడు. "మీరు ఇందుకోసమే ఇక్కడికి వచ్చినారా! మీమాటలు నాకు నచ్చవు. నేను వినను. మీరు మరింత మాట్లాడకుండుట మంచిది".
దుర్యోధనుని మాటలు విన్న సభ సాంతము కలవరపడినది. ధృతరాష్ట్రుడు తల్లడిల్లినాడు. "నారదాది మునులారా! మీకు వందనములు. మీరు చెప్పినట్లు చేయుటకు తగిన పుణ్యము నేను చేయలేదు. నేను అశక్తుడను. నా పెత్తనము చెల్లదు. నేనేమి చేతును?" అని "మహాత్మా! శ్రీకృష్ణా! నీవు ఇహపరములకు తగినట్లు చెప్పినావు. నా కొడుకులను సమ్మతింప చేయుశక్తి నావద్దలేదు. నీవు మహానుభావుడవు. కృపాసముద్రుడవు. నాకొడుకు దుర్యోధనునకు బుద్ధి చెప్పుము. నీవుచెప్పినట్లు చేయించుము" అని ప్రార్ధించినాడు.
సభవారు ధృతరాష్ట్రుడు ఇంతబేలయా! అనుకున్నారు. శ్రీకృష్ణుడు చెప్పినది వినుటకు ఆసక్తులు అయినారు.
శ్రీకృష్ణుడు బోధించినాడు:-
"దుర్యోధనా! పెద్దలు చెప్పినది వినుము. అసత్యము లోభము వలన రాజ్యలక్ష్మి దక్కదు. పాండవులు నీకు సోదరులు. ధనుర్విద్యా పారంగతులు, పరాక్రమవంతులు, సత్యసంధులు. నీవు అట్టివారిని దూరము చేసుకున్నావు. బయటివారిని దుర్భుద్ధులను చేరదీసినావు. వారి మాటలు వినుచున్నావు. యుద్దమునకు కాలు దువ్వుచున్నావు.





