Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"దుర్యోధనా! నాటి నరనారాయణులే ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడుగా జన్మించినారు. వారిని ఎదిరించుట దుర్లభము. నాటి దంభోద్భవునివలె నీవు గర్వించకుము. ఎదుటివారి బలము తెలియక ఉరుకుట మంచిదికాదు. కావున పాండవులతో కలిసి ఉన్న నీకు మేలు అగును. నీవు అట్లు చేయకున్నా వినాశము తప్పదు" అని జమదగ్ని బోధించినాడు.
అంతట కణ్వమహర్షి దుర్యోధనునితో అన్నాడు:-
"దుర్యోధనా! జమదగ్ని చెప్పినది మంచి మార్గము. తన బలమున గర్వించి, ఇతరుల బలమును తెలుసుకొనక పొంగి, కుంగిన గరుత్మంతుని కథ చెప్పెదను. వినుము".
"ఇంద్రుని సారథి మాతల్లి. అతని కూతురు గుణకేశి. ఆమె సుముఖుడు అను నాగ కుమారుని ప్రేమించినది. వరించినది. మాతల్లి పెండ్లికి అంగీకరించినాడు.
సుముఖుని తాత ఆర్యకుడు. అతనికి పెండ్లి విషయము తెలిసినది. మాతల్లి వద్దకు వెళ్ళినాడు. "మాతల్లీ! ఈ సుముఖుని తండ్రి నాకుమారుడు జిరకుని గరుత్మంతుడు చంపినాడు. సుముఖుని నెలలోపల చంపెదనని ప్రతిజ్ఞ చేసినాడు. కావున ఈ పెండ్లి మానుము" అన్నాడు.
మాతల్లి ఆర్యకుని మాటలు విన్నాడు. అతనిని వెంటపెట్టుకొని ఇంద్రుని వద్దకు వెళ్ళినాడు. విష్ణుదేవుడు కూడ అచ్చటనే ఉన్నాడు.
మాతల్లి ఇంద్రునకు కథ సాంతము చెప్పినాడు. సుముఖునకు ఆయుష్యము ప్రసాదించవలసినదని కోరినాడు. విష్ణుదేవుడు కథసాంతము విన్నాడు. "దేవేంద్రా! నీవు సుముఖునకు ఆయుష్యము ప్రసాదించుము. గరుడుని సంగతి నేను చూచుకొందును" అన్నాడు.
ఇంద్రుడు సుముఖునకు ఆయువు ప్రసాదించినాడు.
గుణకేశి సుముఖుల వివాహము జరిగినది.
గరుడునాకు ఆవిషయము తెలిసినది. అతడు అగ్గిబుగ్గి అయినాడు. ఇంద్రునిముందు వాలినాడు. అక్కడ విష్ణుదేవుడు కూడ ఉన్నాడు. గరుడుడు కన్ను, మిన్ను కానక నానా దుర్భాషలాడినాడు. "నా ఒక్క సన్నని ఈకచేత సకల దేవతలను మోయుటకు సమర్దుడను. నా బలము తెలియక నన్ను అవమానించినావు" అని అగ్గి కురిపించినాడు.
విష్ణుదేవుడు గరుడుని ప్రలాపములు విన్నాడు. "గరుడా! గర్వించి ఉన్నావు. నాదయవలన నీవు బలము కలిగి ఉన్నావు. ఇప్పుడు నీవేబలవంతుడనని. గర్వించుచున్నావు. ఎంతటి వానికయినను గర్వము కూడదు. బలవంతుడు అనుచున్నావు. నాముంజేతిని వహింపుము" అని తన ముంజేతిని గరుడని మీద పెట్టినాడు.
విష్ణుదేవుని ముంజేతి బరువునాకు గరుడుడు కృంగిపోయినాడు. పెద్దపెద్ద నిశ్వాసములు విడిచినాడు. రెక్కలు కొట్టుకున్నాడు. ముక్కు తెరిచినాడు. ప్రాణములు ఎగిరిపోవుచున్నట్లు పెద్దగా అరచినాడు.
విష్ణుదేవుడు దయతలచినాడు. ముంజేతిని తీసినాడు. లేవనెత్తినాడు. కాపాడినాడు. "గరుడా! కోపించకు. గర్వించకు. మంచి కార్యములకు అడ్డుతగలకు" అని చెప్పి విడిచినాడు.
"దుర్యోధనా! గరుడుని కథ విన్నావు. గర్వము మానుము. విష్ణుదేవుడే శ్రీకృష్ణుడుగా అవతరించినాడు. పాండవులకు శ్రీకృష్ణుని సాయము ఉన్నది. కావున జమదగ్ని చెప్పినట్లు పాండవులతో స్నేహము కలిగి జీవింపుము".
"దుర్యోధనా!" నారదుడు అన్నాడు. "బలవంతులు అయిన వారిని గొప్ప బలముతో ఎదిరించినను చేటు కలుగును. నీతి, వినయము, సత్స్వభావము నిలిచి ఉండును. గర్వము నిలిచి ఉండదు. గర్వము, అహంకారము పతనమునకు కారణములు అగును. మొండితనము, కారణము ఎరుగని పట్టుదల మూర్ఖుల లక్షణము. అట్టివారికి విజయము కలుగదు. అవమానములు కలుగును. ఇందు విషయమున గాలవుని వృత్తాంతము చెప్పెదను. వినుము".
గాలవుడు ముని కుమారుడు. అతడు విశ్వామిత్రునివద్ద విద్యాభ్యాసము చేసినాడు. అతని విద్యాభ్యాసము ముగిసినది. విశ్వామిత్రునకు గురుదక్షిణ ఇచ్చెదను అన్నాడు. విశ్వామిత్రుడు అక్కరలేదన్నాడు. గాలవుడు ఇచ్చెదనన్నాడు. విశ్వామిత్రుడు వద్దన్నాడు. విశ్వామిత్రుడు ఎన్నిసార్లు వారించినను గాలవుడు వినలేదు. మొండిపట్టు పట్టినాడు. విశ్వామిత్రుడు కోపించినాడు. "గాలవా! నాకు ఎనిమిదివందల తెల్లని గుఱ్ఱములను, ఒక చెవి నల్లగా ఉండువానిని, తెచ్చి గురుదక్షిణగా ఇమ్ము" అన్నాడు.
గాలవుడు గుఱ్ఱములకని బయలుదేరినాడు. లోకమంతయు తిరిగినాడు. నిద్రాహారములు మానినాడు. అలసినాడు. విసిగినాడు. ఏడ్చినాడు.
గరుత్మంతుడు గాలవునకు చిన్ననాటి స్నేహితుడు కనిపించినాడు. గాలవుడు తన కథ సాంతము చెప్పుకున్నాడు. ఏడ్చినాడు. గరుడుడు "అటువంటి గుర్రములు భూలోకమున ఉండవు. వాటిని దేవతలు నిర్మింతురు. ఇంద్రునిధి తూర్పుదిక్కు అటు వెళ్ళుదము రమ్ము" అన్నాడు. గాలవుని పొదిగిట పట్టుకున్నాడు గరుడుడు. ఆకసమునకు ఎగిరినాడు. తూర్పుదిక్కునకు సాగినాడు. గాలవుడు నిలువలేక పోయినాడు. గిలగిలలాడినాడు. గరుడుడు గాలవుని ఒక పర్వతము మీద దించినాడు. అక్కడ శాండిల్య ముని తపస్సు చేయుచున్నాడు. అతని శాపము వలన గరుడుని రెక్కలు రాలిపోయినవి. తిరిగి ఆ ముని అనుగ్రహము సంపాదించి గరుడుడు రెక్కలు తెచ్చుకున్నాడు.





