Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"మహారాజా! ప్రస్తుతము నీవే భరతవంశమునకు ఆధారభూతుడవు. నీవు మంచి భావమున యోచింపుము. మీ వారికి స్నేహము కలిగింపుము. ఆ విధముగా చేసిన నీకు సత్కీర్తి కలుగును. జనులు నిన్ను స్తుతింతురు. భరతవంశమునకు మేలుకలుగును".
"దుర్యోధనాదులగు నీ కొడుకులు ధర్మమును ఎరుగరు. మంచి నడవడిని తలచరు. క్రూరముగా ప్రవర్తింతురు. ఇతరుల మనసుల నొప్పింతురు. దుష్కార్యము చేయుటకు వెనుకాడరు".
"మహారాజా! శాంతిని కోరుము. కౌరవ పాండవులకు సంధి కలిగింపుము;. యుద్దము వలన ఆపద, నష్టము కలుగును. కావున నీ కొడుకులకు బుద్ధి చెప్పుము. వినాశమును ఆపుము. అది నీ చేత ఉన్నది. నీవు చేయగలవు".
"యుద్డమే వచ్చిన భీమార్జునుల వంటివారు మీ పక్షమున ఉన్నారా? భీష్మ ద్రోణులవంటివారు పాండవుల పక్షమున ఉన్నారా? ఆలోచింపుము. యుద్దము జరిగి అందరు కూలుట కంటె అందరును నీ భటులయి ఉండుట మేలుకాదా?".
"ధృతరాష్ట్ర మహారాజా! నీవు సంధి చేసిన జగత్తు నిన్ను కీర్తించును. సకల రాజులు నిన్ను కొలుతురు. సకల భూప్రపంచమును నీవే పాలింతువు. నీ కీర్తి చంద్రికలు దశదిశలకు పాకుము".
"మహారాజా! పాండవులు చిన్నతనమందే తండ్రిని కోల్పోయినారు. అప్పటి నుండి నీవే వారిని పోషించినావు. బిడ్డలయందు తల్లి విరోధము కలిగి ఉండునా? ఈ సమయమున వారిని విడుచుట యుక్తము కాదు. పాండవుల విషయమున కృపగలవాడవగుము. వారిని కాపాడుము".
"రాజాధిరాజా! పాండవులు అయిదుగురు ముక్త కంఠమున నీకు చెప్పమనిన మాటలు వినుము. ధృతరాష్ట్రుడు మాకు తండ్రి. అతడు ఆజ్ఞాపించినాడు. మేము అరణ్యవాస, అజ్ఞాతవాసములు చేసినాము. మాకు తిరిగి అర్ధ రాజ్యమును ఇప్పించవలెనని కోరుచున్నాము. మాకు తండ్రి, బంధువు, ఆప్తుడు, ఆశ్రయము ధృతరాష్ట్రుడే అగును. మా వలన తప్పు జరిగిన సరిదిద్దవలసినవాడు ధృతరాష్ట్రుడే అగును. అతడు దుర్యోధనాదులను మమ్ములను ఒక్కరీతిగా చూడవలెనని ఆ మహారాజును మేము ప్రార్ధించుచున్నాము".
"పమడవులు సభాసదులకు చెప్పమనిన మాటలు వినుడు. ధర్మమును, సత్యమును బలము గలవి. అందువలన అసత్యము, పాపము గెలువలేవు. అసత్యము, పాపములను ఉపేక్షించిన సభాసహులు చెడుదురు. ధర్మసత్యములకు హానిలేదు. దైవము అన్నింటికి, అన్నివేళల సాక్షిగా ఉన్నాడు. దైవము ధర్మ, సత్య స్వరూపుడు. అతడు పాప పుణ్యములకు సాక్షిగా నిలుచును".
"పాండవులు చెప్పమనిన మాటలు చెప్పినాను. నేను ధర్మము చెప్పినాను. సత్యము చెప్పినాను. మీరు క్రోధము అహంకారము విడిచి, సంధి చేయుట ఎల్లరకు మేలు అగును".
"సభాసదులారా! మీరు నీతిమంతులు. ధర్మమును ఎరిగిన వారు. పాండవులకు రాజ్యము పంచి ఇచ్చుటకు మించిన కార్యమేదియో యోచించి చెప్పుడు. ధర్మము చెప్పుడు. సత్యము చెప్పుడు".
శ్రీకృష్ణుని ఉపన్యాసమును సభాసదులు ఆలకించినారు. ఆలోచించసాగినారు.
"మహారాజా!" శ్రీకృష్ణుడు బోధించినాడు. పాండురాజు భాగమును పాండవులకు పంచి ఇమ్ము. నీరాజ్య భాగమును పుత్ర పౌత్ర సహితముగా అనుభవింపుము. ఉభయులు సుఖసంతోషములు అనుభవించవలెను. నీవు ఆ విధముగా చేసిన బంధుజనులు సంతోషింతురు".
"ధర్మరాజు ఉత్తముడు. అతనికి శత్రువులు లేరు. అతడు ఆజాత శత్రువు. మీ వలన పాండవులు బహు కష్టములు అనుభవించినారు. అనేక దుఃఖములు పొందినారు. అయినను ధర్మరాజు మరల మీతో కలిసి జీవించ దలచినాడు. ధర్మరాజు వంటి శాంతవంతుడు మరొకడు లేడు. అతనికి అతడే సాటి. ధర్మరాజునకు ఉన్న శాంతి, వినయ, గౌరవాది గుణములు మరొకరికి లేవు".
"మహారాజా! కౌరవులు, పాండవులు నీకు పుత్రులే అగుదురు. ఉభయుల మేలుకోరి నేను ఇంతదూరము వచ్చినాను. ఇదంతయు చెప్పినాను. నీ పుత్రుడు దుర్యోధనుడు లోభము, దుర్భుద్ధి గలవాడు. అతని దుర్భుద్ధిని మాన్పుము. పాండవులను దగ్గరికి చేర్చుము. పాండవులు శాంత శూరులు. వారు నిన్ను కొలుచుటకు సమ్మతించుచున్నారు. నీవు అందుకు సమ్మతించనిచో, వారు యుద్దమునకు వత్తురు. సంధి, యుద్దము ఈ రెంటిలో నీకు ఇష్టమేదియో నిశ్చయించి చెప్పుము".
సభవారందరు అమృత ప్రాయములయిన శ్రీకృష్ణుని మాటలు విన్నారు. మెచ్చుకున్నారు. "ఎంత చక్కని మాటలు చెప్పినాడు! ఎంత సొగసుగా చెప్పినాడు! ఎవరిని నొప్పించకుండ చెప్పినాడు! యుద్దమును ఆపుటకు, సంధి కుదిరించుటకు తగినమాటలు చెప్పినాడు! శ్రీకృష్ణుని ఎదుట మారుమాటాడ గలవారు ఉన్నారా! అనుకున్నారు. అందరు ఆనందించినారు.
అప్పుడు జమదగ్ని మహాముని మాట్లాడినాడు.
"దుర్యోధనా! పూర్వము దంభోద్భవుడు అను రాజు ఉండెను. అతడు తనను మించిన బలవంతుడు లేడని గర్వించినాడు. గంధమాదన పర్వతమున నరనారాయణులు తపస్సు చేసుకొనుచున్నారు. దంభోద్భవుడు నరనారాయణుల దగ్గరికి వెళ్ళినాడు. వారిని యుద్దము నకు పిలిచినాడు. వారు అతనిని వారించినారు. దంభోద్బవుడు వినలేదు. వారి మీదికి ససైన్యముగా ఎత్తివచ్చినాడు. నరుడు అది చూచినాడు. పిడికిట దర్భలను పట్టినాడు. విడిచినాడు. దర్భలు బాణములయినవి. శరవర్షము కురిసినది. సైన్యము సాంతము నాశనము అయినది. దంభోద్భవుడు పట్టుపడినాడు. నరుడు దయతలచి వానిని విడిచినాడు".





