Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
విదురుడు చెప్పిన మాటలను శ్రీకృష్ణుడు సాలోచనముగా విన్నాడు. "మహాత్మా! విదురా! నీవు స్నేహమును చూపినావు. వివేకము కనబరచినావు. తల్లిదండ్రులవలె హితము చెప్పినావు. సంతోషము, నేను వచ్చిన విధము చెప్పెదను. వినుము".
"దుర్యోధనాదులు దుష్టులు. పాండవులకు విరోధులు. వారు నా మాట వినరు. అది నాకు తెలియును. కౌరవ పాండవులకు యుద్దము జరిగిన భూమండలమున మృత్యువు తాండవిన్చును. సర్వనాశనమగును. దానిని నిలుపుటకు ప్రయత్నించ వచ్చినాను. ప్రయత్నించుట మంచిదిగదా!".
"కౌరవులు, పాండవులు అన్న్ధదమ్ములు. ఉభయ పక్షముల వారు నాకు బంధువులు. అన్నదమ్ముల మధ్య భీషణ సంగ్రామము జరుగనున్నది. బంధువయిన శ్రీకృష్ణుడు వారింప వచ్చునుకదా అని సామాన్యులు అనుకొందురు. అందుకొఱకు నా ఈ ప్రయత్నము".
"దుర్యోధనుడు బంధువులు, మంత్రులు పెద్దలతో కూడిన సభ కూర్చును. ఆ సభయందు నేను శాంతి సందేశము వినిపింతును. దుర్యోధనాదులకు ఆయువు ఉన్న యెడల నామాట విందురు. అట్లుకాకున్న నిండు సభలో నాతో కలహింతురు".
"విదురా! దుర్యోధనాదులు నాముందు నిలువజాలుదురా? నాకు హాని కలిగించు శక్తి కలిగి ఉందురా? నీవు నిశ్చింతగా వెళ్ళుము. నిద్రింపుము" అని శ్రీకృష్ణుడు విదురుని పంపినాడు. తాను విశ్రమించినాడు. సుఖముగా నిద్రించినాడు.
తెల్లవారినది. వంది మాగధులు మంగళ గానములు చేసినారు. శ్రీకృష్ణునకు సుప్రభాతము పలికినారు. శ్రీకృష్ణుడు మేల్కొన్నాడు. నిత్యకృత్యములు నిర్వర్తించినాడు. సాత్యకి, కృతవర్మలు వచ్చినారు. మరికొందరు ఇష్టజనులు వచ్చినారు. శ్రీకృష్ణుడు వారితో సంభాషించుచున్నాడు. ఆ సమయమున దుర్యోధనుడు వచ్చినాడు. అతని వెంట కర్ణ, శకుని, దుశ్శాసనులు ఉన్నారు. "ధృతరాష్ట్రుడు సభతీరి ఉన్నాడు. నీవు రావలసినది" అని దుర్యోధనుడు శ్రీకృష్ణుని కోరినాడు.
శ్రీకృష్ణుడు సిద్దముగా ఉన్నాడు. బయలుదేరినాడు. రథమును ఎక్కినాడు. భేరీ, శంఖ, చామర, ఛత్రము మున్నగు శుభ చిహ్నములతో సాగినాడు. గరుడ ధ్వజము దేదీప్యమానముగా ప్రకాశించినది. కృతవర్మ, సాత్యకి మరొక రథమున కూర్చున్నారు. శ్రీకృష్ణుని రథమునకు ఒక పక్కన వారి రథము సాగినది. దుర్యోధనాదుల రథము మరొక పక్కన సాగినది. శ్రీకృష్ణుని రథము మీద చూచి పురజనులు పొంగిపోయినారు.
శ్రీకృష్ణుని రథము సభా భవనమును సమీపించినది. శ్రీకృష్ణుడు రథము దిగినాడు. విదురుడు ఎదురుగావచ్చి స్వాగతము చెప్పినాడు. శ్రీకృష్ణుడు ఒకచేత విదురుని, మరొకచేత సాత్యకిని పట్టుకున్నాడు. నడచినాడు. కృతవర్మమున్నగు యాదవ వీరులు శ్రీకృష్ణుని చుట్టుకున్నారు. వెంటనడచినారు. దుర్యోధనాదులు ముందు నడిచినారు. గుంపులను తొలగదోసినారు. శ్రీకృష్ణునకు దారి చేయుచు సాగినారు.
శ్రీకృష్ణుడు ప్రకాశించు సూర్యునివలె సభాగృహమున ప్రవేశించినాడు. బాహ్లీక, భీష్మ ద్రోణాదులు ఎదురుగా వచ్చినారు. శ్రీకృష్ణుని తోడ్కొని వెళ్ళినారు. మణిమయము అయిన బంగారు పీఠమున కూర్చుండబెట్టినారు. అప్పటికి నారద, జమదగ్ని, కణ్వాది మహర్షులు ఆకాశమున కనిపించినారు. వారి తేజస్సు వెలుగులు చిమ్మినది. శ్రీకృష్ణుడు అది చూచినాడు. ఆ మహర్షులకు ఆసనములు ఏర్పరచి, ఆదరించవలసినదని భీష్ముని కోరినాడు.
నారదాదులు సభలో ప్రవేశించినారు. సభవారందరు ఆశ్చర్యచ్కితులు అయినారు. రెప్పవాల్చక వారిని చూచినారు. భీష్ముడు ఆసనములు ఏర్పరచినాడు. మహర్షులు ఆసీనులు అయినారు. వాసుదేవుడు లేచినాడు. వారికి నమస్కరించినాడు. అర్ఘ్య పాద్యములచేత వారిని పూజింప చేసినాడు. తదుపరి వాసుదేవుడు కూర్చున్నాడు. ధృతరాష్ట్రుడు మున్నగువారు మహామునులకు నమస్కరించినారు. కూర్చున్నారు.
దుశ్శాసన, వివింశతులు రెండు పీఠములను శ్రీకృష్ణునకు రెండు పక్కల వేసినారు. వాటిమీద సాత్యకి, కృతవర్మలు ఆశీనులు అయినారు. కర్ణ, దుర్యోధనులు ఇద్దరు ఒకే పీఠమున కూర్చున్నారు. శ్రీకృష్ణుని దగ్గరగా కూర్చున్నారు. విదురుడు శ్రీకృష్ణుని వెనుకవైపు కూర్చున్నాడు. గాంధార రాజు తన పుత్రులతో మరొకచోట కూర్చున్నాడు.
శ్రీకృష్ణుడు నీల మేఘ శ్యాముడు. పీతాంబరధారి. పద్మపత్ర నేత్రుడు. సభ సాంతము వాసుదేవుని అందమును చూడసాగినది. కనులతో అమృతము తాగసాగినది.
సభ కదలక ఉన్నది. నోరు మెదపక ఉన్నది. నిశ్చలముగా ఉనంది. బొమ్మగీసినట్లున్నది.
సభ సాంతము శ్రీకృష్ణునే చూచుచున్నది. ఆనందమున తేలియాడుచున్నది. నిశ్శబ్దముగా ఉన్నది. చీమ చిటుక్కుమన వినవచ్చునట్లున్నది.
"ధృతరాష్ట్ర మహారాజా!" శ్రీకృష్ణుడు పలికినాడు. ఉరుమువంటి శ్రీకృష్ణుని కంఠధ్వని సభలో ప్రతి ధ్వనించినది. సభ సాంతము సచేతనమయినది. ప్రాణములు వీనులలో చేరినవి. "నీకు అన్ని కార్యములు తెలియును. అయినను బంధువులకు పరమహితము చెప్పుటకు నీవద్దకు వచ్చినాను. పాండవులు, కౌరవులు పాలునీళ్ళవలె కలిసి ఉండునట్టి కార్యమును నీవు చేయవలసి ఉన్నది".
"మీది భరతవంశము. అది ధర్మ, సత్య, స్నేహములకు పేరుగాంచినది. పాండురాజు, నీవు ఆ వంశమున జన్మించినారు. నీ కొడుకులు శక్తిమంతులు. అటువంటివారు సదాచారమును తప్పరాదు".





