Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    "శ్రీకృష్ణా! ఇంత దుఃఖము కడుపునా పెట్టుకొని పదమూడేండ్లు దుర్యోధనుని కూడు తిని జీవించుచున్నాను. అది మరింత దుఃఖమై ఉన్నది".
    "నేను కౌరవులను, నా కొడుకులను సమానముగా చూచినాను. అందుకు దైవమే సాక్షి. నా మాటలు నిజములు అయిన నీవును, నా కొడుకులును సుఖములను పొందవలసి ఉన్నది. నా నిరంతర దుఃఖమునకు అది మాత్రమే ఉపశమనమగును".
    "శ్రీకృష్ణా! ధృతరాష్ట్రుని, దుర్యోధనుని, భీష్మాదులను నిందించి ప్రయోజనము లేదు. ఇటువంటి దుష్టులు గల ఇంటికి నన్ను ఇచ్చిన నాపుట్టింటి వారిని, యాదవులను నిందించవలసి ఉన్నది. అర్జునుడు పుట్టినపుడు "ఇతడు యుద్దమున కౌరవులను జయించును. సోదరులతో సకల రాజ్యము అనుభవించును" అని ఆకాశవాణి పలికినది. అశరీరవాణి వాక్కులు అసత్యములని నిందించవలెను.
    "వాసుదేవా! పాండవులను, ధర్మమును రక్షించుటకు నీవు ఉన్నావు. సత్యమునకు, ధర్మమునకు, నీకు జయము కలిగితీరును. పాండవులకు నేను చెప్పమనిన ఈమాటలు చెప్పుము".
    "క్షత్రియులు దీనులు కారాదు. యాచించి జీవించరాదు. ప్రతాపమును ప్రకటించుట, ప్రతాపమున సాధించుట క్షత్రియ ధర్మము అగును. ప్రతాపము విడిచిన రాజు వేడిని కోల్పోయిన నిప్పువంటివాడు. ప్రతాపము విడిచిన వానిని ప్రజలు గౌరవించరు. లక్ష్యము చేయరు. వీరమాత బిడ్డలను కన్నది యుద్దమున జయించుటకే. సమయము వచ్చినది. మీరు మీతల్లిని సంతోష పెట్టవలసి ఉన్నది. ఆలస్యము మంచిదికాదు. మీరు చేయవలసిన పని చేసిన జనులు మిమ్ము మగవారందురు. ద్రౌపది సాధ్వి. మీరు చేయు పనులను ఆమెకు చెప్పవలెను. ఆమె చెప్పిన ప్రకారము చేయవలెను".
    "శ్రీకృష్ణా! నీవు నాకు మేనల్లుడవు. పాండవులకు రక్షకుడవు. నీవు నా దుఃఖమును పోగొట్టవలెను. నన్ను కృతార్ధురాలిని చేయవలెను".
    "అత్తా! కుంతీదేవి!" శ్రీకృష్ణుడు ఆమెను ఓదార్చినాడు. అనునయించినాడు "నీవు ఉత్తమురాలవు. పుట్టినింటికి మెట్టినింటికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చినదానవు. మహాధైర్యవంతురాలవు. నీవు ధైర్యము విడువరాదు. నీపుత్రులు సదా, సర్వదా నిన్ను గురించియే ఆలోచించుచున్నారు. వారు వీరులు. సమరోత్సాహమున ఉన్నారు. యుద్దమున గెలుతురు. నీకు ఆనందము కలిగింతురు".
    "శ్రీకృష్ణా! నీవు కనిపించినావు. నన్ను ఓదార్చినావు. నాకు కొండంత ధైర్యము కలిగినది. నాకొడుకులకు నీవే గురుడవు. తండ్రివి. దైవమువు. నీవు సర్వలోక రక్షకుడవు. పాండవులు నిన్ను ఆశ్రయించినారు. నిన్ను ఆశ్రయించిన వారికి కొరతలు ఉండవు". అని కుంతీదేవి శ్రీకృష్ణుని సాగనంపినది.
    శ్రీకృష్ణుడు దుర్యోధనుని ప్రాసాదమునకు బయలుదేరినాడు. ప్రాసాదము అలంకరించబడినది. శ్రీకృష్ణుని రాకను దుర్యోధనుడు తెలుసుకున్నాడు. ద్వారపాలకులను శ్రీకృష్ణుని తోడ్కొని వచ్చుటకు నియమించినాడు. వారు శ్రీకృష్ణునకు స్వాగతము పలికినారు. కైలాస పర్వతము వంటి మేడమీద ఉన్న దుర్యోధణుని వద్దకు తీసుకొని వెళ్ళినారు.
    దుర్యోధనుడు సభతీర్చి ఉన్నాడు. బాహ్లీక, భీష్మ, ద్రోణాదులు, కర్ణశకుని సైంధవాదులు, దుశ్శాసన, వికర్ణ దుర్ముఖాదులు సభలో ఉన్నారు. దుర్యోధనుడు పరిజన సహితముగా శ్రీకృష్ణునకు ఎదురేగినాడు. వెంట తెచ్చినాడు. బంగారు సింహాసనమున ఆసీనుని చేసినాడు.
    శ్రీకృష్ణుని వెంట సాత్యకి, కృతవర్మలు వచ్చినారు. దుర్యోధనుడు వారిని తగురీతి గౌరవించినాడు. ఆసీనులను చేసినాడు. శ్రీకృష్ణుడు అక్కడివారి కుశలములు అడిగినాడు. మధురముగా మాట్లాడినాడు.
    దుర్యోధనుడు శ్రీకృష్ణుని తన ఇంట భోజనము చేయవలసినది అన్నాడు. శ్రీకృష్ణుడు దుర్యోధనుని భోజనము నిరాకరించినాడు.
    "కర్ణా! చూచితివా! ఇతడు ఇచ్చట భోజనము చేయడట. తెలిసిపోయినదికదా! శ్రీకృష్ణుని స్వభావము" అన్నాడు.
    శ్రీకృష్ణుడు దుర్యోధనుని వెఱ్ఱిమాటలు విన్నాడు. చిరునవ్వు నవ్వినాడు. మదపుటేనుగు చిగురుటాకును పట్టినట్లు దుర్యోధనుని అరచేతిని పట్టుకున్నాడు. సభాసదులు వినుచుండగా అన్నాడు:-
    "దుర్యోధనా! దూతలు ముందు అన్నవస్త్రాదుల గ్రహింపరు. కార్యము ముగిసిన పిమ్మట గ్రహింతురు. అంతేకాక ప్రీతి పూర్వకముగా పెట్టిన అన్నము మంచిది. ప్రీతిలేని అన్నము వలన మేలుకలుగదు. నీవు మాయందు ప్రియుడవు కావు. అందువలన నీ ఇంట అన్నము తినరాదు. శత్రువుల ఇంట భుజించిన అనుమానము కలుగును. ఏ వ్యాధి కలిగినను ఆ అనుమానమే బాధించును. నేను శత్రుడనా? అని నీవు అడుగుదువు. చెప్పెదను వినుము".
    "నీకు పాండవులు శత్రువులు. వారు నాకు ప్రాణములు. నీవు నాప్రాణములకు శత్రువువు. అట్లయిన నాకు శత్రువువే కదా! అందువలన నీ అన్నము మృష్టాన్నముకాదు. దుష్టాన్నము అగును. అందువలన నీఇంట భుజింపను. విదురుని ఇంట భుజింతును".
    శ్రీకృష్ణుడు దుర్యోధనుని అనుమతి పొందినాడు. విదురుని ఇంటికి బయలుదేరినాడు. భీష్మ, బాహ్లీక, ద్రోణాదులు తమ ఇండ్లకు విచ్చేయవలసినదని శ్రీకృష్ణుని ప్రార్ధించినారు. "నేను మీ అందరికి ఇండ్లకు వచ్చినట్లుగనే భావించవలసినది" అని వారిని వీడ్కొన్నాడు. విదురుని ఇంటికి చేరినాడు.
    విదురుడు శ్రీకృష్ణ సాత్యకులకు భక్తియుక్తముగా భోజనము పెట్టినాడు. భోజనము తరువాత సంగీతము, విద్వజ్జన గోష్టి ఏర్పాటు చేసినాడు. శ్రీకృష్ణుని దర్శించుటకు చాలామంది వచ్చినారు. సాయంకాలము అయినది. వచ్చినవారందరు వెళ్ళినారు. రాత్రి అయినది. శ్రీకృష్ణుడు శయనించినాడు. విదురుడు పక్కన కూర్చున్నాడు. చెప్పినాడు:-
    "మహాత్మా! దుర్యోధనుడు దుష్టుడు. దురభిమాని. అతడు నీ మాట వినడు. నీవు అతనికి చెప్పవచ్చినావు. రాకుండ వలసినది".
    "దుర్యోధనునకు పదకొండు అక్షౌహిణుల బలముమీద, భీష్మ ద్రోణుల బలముమీద, కర్ణుని పరాక్రమము మీద నమ్మకము ఉన్నది. గర్వాంధుడు అయి ఉన్నాడు. అతడు పాండవులకు కొంచెమయినను భూమి ఇవ్వడు".
    "పూర్వము పాండవులు దిగ్విజయము చేసినారు. అప్పుడు అనేకమంది రాజులు వారిచేత ఓడినారు. వారందరు ఇప్పుడు కౌరవుల పక్షము చేరినారు. వారందరు తెగించి ఉన్నారు. అర్జునుని చేత చచ్చుటకో, అర్జునుని చంపుటకో నిశ్చయించి ఉన్నారు.
    పాండవుల విషయమున నాకు స్నేహము ఉన్నది. నీ మీద భక్తి ఉన్నది. అందువలన చెప్పుచున్నాను. కౌరవులు దుర్మార్గులు దురాత్ములు. నీవు వారి మధ్యకు వెళ్ళరాదు. నీవు కౌరవ సభకు వెళ్ళుట మంచిది కాదు".




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.