Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    స్త్రీలు మేడలపై నుండి శ్రీకృష్ణుని దర్శించినారు. అక్షతలు చల్లినారు. పూలు కురిపించినారు. తమలో తాము ఇట్లనుకున్నారు.
    "ఇతడేనమ్మా పసితనమున పూతన ప్రాణములు తీసినాడు. చానూరముష్టికులను చంపినాడు. కంసుని హతమార్చినాడు. ఉగ్రసేనునకు పట్టము కట్టినాడు. సత్యభామకు పారిజాతమును తెచ్చి ఇచ్చినాడు. ఇతడేనమ్మా! వెన్నముద్దలను, గోపికల హృదయములను దొంగిలించినవాడు. రసికుడు. వేదాంతములయందు పాదకమలానందమును కూర్చినవాడు ఈ కృష్ణుడే! ఈ కృష్ణుడే ఇప్పుడు హస్తినకు వచ్చినాడు".
    శ్రీకృష్ణుని రథము ధృతరాష్ట్రుని భవనమునకు సాగినది. ఏనుగు మొగసాల వద్ద రథము నిలిచినది. వాసుదేవుడు రథము దిగినాడు. పాదచారి అయిసాగినాడు. ధృతరాష్ట్రుడు విదురుని, సంజయుని వెంట పెట్టుకున్నాడు. శ్రీకృష్ణునకు ఎదురు వచ్చినాడు. స్వాగతము చెప్పినాడు. తోడుకొని వెళ్ళినాడు. శ్రీకృష్ణనకు ఎదురు వచ్చినాడు. స్వాగతము చెప్పినాడు. తోడుకొని వెళ్ళినాడు. శ్రీకృష్ణ సాత్యకులను బంగారు ఆసనముల మీద కూర్చుండపెట్టినాడు. పురోహితులు వచ్చినారు. అర్ఘ్యపాద్యములు ఇచ్చినారు. మధుపర్కాదులు సమర్పించినారు. భీష్మాదులు ఉచిత ఆసనముల మీద ఆసీనులు అయినారు. అప్పుడు ఆ సభ సూర్యోదయమున తామరకొలమ వలె ప్రకాశించినది.
    శ్రీకృష్ణుడు, ధర్మరాజు చెప్పినట్లుగా భీష్మాదుల కుశలములు అడిగినాడు. శ్రీకృష్ణుడు మధురముగా మాట్లాడినాడు. చతురముగా మాట్లాడినాడు. హాస్యముగా మాట్లాడినాడు. సభను రంజింప చేసినాడు. విదురుని ఇంటికి, ఇతర స్థలములకు వెళ్ళివత్తునని శ్రీకృష్ణుడు లేచినాడు. సభ సాంతము లేచినది. శ్రీకృష్ణుడు సాగినాడు. సభ సాంతము నిలిచినది.
    శ్రీకృష్ణుడు విదురుని ఇంటికి సాగినాడు. విదురుడు ముందే తన ఇంటికి చేరినాడు. శ్రీకృష్ణునకు ఎదురు వచ్చినాడు. స్వాగతము పలికినాడు. తన ఇంటికి తీసుకొని వెళ్ళినాడు. తాను ధన్యుడను అనుకున్నాడు. ఆనందాతిరేక చిత్తమున వాసుదేవుని పూజించినాడు.
    "వాసుదేవా! నీ భోజనము ఈ దీనుని ఇంట ఏర్పాటు చేతును" అని చేతులు జోడించి అడిగినాడు.
    వాసుదేవుడు ప్రసన్నుడు అయినాడు, "అట్లే కానిమ్ము" అన్నాడు.
    విదురుడు ఏర్పాట్లలో నిమగ్నుడు అయినాడు.
    శ్రీకృష్ణుడు కుంతీదేవి వద్దకు వెళ్ళినాడు.
    కుంతీదేవి శ్రీకృష్ణుని చూచినది. ఆమె ఎండిన గుండెలో చినుకులు పడినట్లయినది. ఆమెలో దుఃఖము పొంగినది. పొరలినది. ఉప్పెన వచ్చినది. ఉరికి వచ్చినది. శ్రీకృష్ణుని పట్టుకున్నది వలవల ఏడ్చినది.
    శ్రీకృష్ణుడు ఆమె తల నిమిరినాడు. కన్నీరు తుడిచినాడు. ఓదార్చినాడు. తాను కూర్చున్నాడు. ఆమెను కూర్చుండ బెట్టినాడు.
    కుంతీదేవి దుఃఖమును దిగమింగినది. అన్నది:-
    "శ్రీకృష్ణా! పాండవులకు నేను తల్లిని. వారికి ఇంత వండి పెట్టుకొను అదృష్టము లేదు. వారు అడవులపాలు అయినారు. కాయగసరులు తిన్నారు. అడవి జంతువుల అరుపులలో జీవించినారు. బహు కష్టముగా అజ్ఞాతవాసము గడిపినారు".
    "శ్రీకృష్ణా! నా బిడ్డలందరు క్షేమమే కదా! అందరినిమించి నాకోడలు ద్రౌపది అనిన నాకెంతో ప్రీతి. ఆమె పవిత్రురాలు. ఆమె పడినన్ని పాట్లు ఇతరులు పడలేదు. ఆనాడు కౌరవ సభలో ఆమెను అవమానించినారు. అంతటి దారుణమును చూచినాను. ఒర్చినాను. జీవించినాను. ఇక దేనినైనను సహించగలను. ఆతల్లి ద్రౌపది నాకోడలు పాండవపత్ని నిండు కౌరవసభలో స్త్రీజాతి మున్ను ఎన్నడు కనీవినీ ఎరుగని అవమానము పొందినది. అప్పుడు అంత సభలో ఒక్కడు నోరెత్తలేదు. విదురుడు ఒక్కడు ఒక్కడు మాత్రము "ఇది అధర్మము" అని చెప్పినాడు. ఆ విదురుని మంచి స్వభావమే ఈలోకమును రక్షించుచున్నది".




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.