Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
7. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, విదురుడు, సంజయుడు వీరందరు పెద్దలు. అనుభవజ్ఞులు. హితము కోరువారు. హితము చెప్పువారు. వారు న్యాయమును గురించి చెప్పినారు. అంతేకాదు రానున్న ప్రమాదమును గురించి స్పష్టమయిన నిర్దిష్టమయిన హెచ్చరికలు చేసినారు. కొంతవరకు ధృతరాష్ట్రుడు భయపడినాడు.
దుర్యోధనుడు మొండిపట్టు పట్టినాడు.
ఇందరి మాట నెగ్గలేదు. ఒక్కని మాటకు విలువవచ్చినది.
అది తప్పు. పదుగురాడు మాట చెల్లవలె. ఒక్కని నియంతృత్వము ప్రమాదకరము. వినాశకారి. వాలి తార మాట విన్నాడు కాడు. కూలినాడు. రావణుడు విభీషణుని మాట వినలేదు. నాశనము అయినాడు.
8. ధృతరాష్ట్రుడు కొడుకు హితమునే కోరినాడు. సంధి మంచిది అని బోధించినాడు. కొడుకు తండ్రిమాట వినలేదు. వినడు. ఇది చాల వరకు సహజము. అందరి తండ్రుల నిత్య జీవితమున అనుభవము అయి ఉన్నది. కొడుకుది మొండి పట్టు. తండ్రిమాట వినడు. తండ్రి విసిగినాడు. అప్పుడు చేయవలసినది యేమి?
ధృతరాష్ట్రుడు వ్యాసుని రప్పించినాడు. తన స్థితిని గురించి చెప్పినాడు. కర్తవ్యము అడిగినాడు.
వ్యాసుడు శ్రీకృష్ణుని ఆశ్రయించమని బోధించినాడు.
అటువంటి సమయమున భగవంతుని ఆశ్రయించి మనశ్శాంతి పొందుటకన్న గత్యంతరము లేదు అని ఉపదేశించినాడు వ్యాసభగవానుడు.
ఇందును మించిన ఉపాయము ఉన్నదేమో ఆలోచించగలరు.
9. ధర్మరాజు పాండవులకు అన్న, తండ్రి, అన్నియు. అతడు సహితము తన బలహీనతకు తమ్ములను, భార్యను బలిచేసినాడు. అయినను తమ్ములు అతనిమాట జవదాటలేదు. అందుకు కారణములు:-
i) ధర్మరాజు చేసిన ఒకే ఒక తప్పు జూదము ఆడుట. ఓడుట. అది ఒకరిచే మోసగించబడి చేసినాడు. తాను కోరి చేసినదికాదు.
ii) ఒకరిని మోసము చేయుపని చేయలేదు. తాను మోసపోయినాడు.
iii) శక్తిమంతులు, వీరులు, ధీరులు పగవారిని ఓడించగల తమ్ములు అతనికి ఉన్నారు. వారు సలసల కాగిపోవుచున్నారు. అయినను అతని మాటకు కట్టుపడినారు. అడవులకు వెళ్ళినారు.
ధర్మరాజు ధర్మతత్పరత అతని తమ్ములను కట్టివేసినది. అతని మంచితనముచూచి వారు ప్రభావితులు అయినారు. అందులో అంతగా బలవంతము కనిపించదు. అందువలన పాండవులలో ఐక్యత వారికి రక్ష అయినది.
10. ఇచట శ్రీకృష్ణుని ప్రభావము, ప్రాచుర్యము నిండుగా కనిపించుచున్నవి. శ్రీకృష్ణుడు సంధికి సుముఖుడు కాడు. అతడు యుద్దము జరుగవలెననియే కోరినాడు. అపకారము చేసిన వారిని శిక్షించుట అతని మతము. లోకహితము కోరి అతడు అట్లు చేసినాడు.
మెత్తపడిన భీముని, అర్జునుని పురికొల్పినాడు. అప్పుడప్పుడు సంధి జరుగదు అని వెల్లడించినాడు. యుద్దమునకు సన్నద్దులను చేసినాడు.
11. నకుల సహదేవులు చిన్నవారు. అయినణు వారు సకారణముగా నిరూపించినారు. చక్కగా మాట్లాడినారు. సభవారి మెప్పును, జనుల మెప్పును పొందినారు.
12. రక్త సంబంధము వలన పాండవులు సంధి కోరినారు. కౌరవులను హతమార్చదలచలేదు. కాని మిగిలిన వారు యుద్దము వైపునకే మొగ్గుచూపినట్లు కనిపించుచున్నది.
13. అవమానములు పొందినది ద్రౌపది. పాండవుల పరిస్థితిని చూచి కృంగిపోయినది. నిరుత్సాహపడినది. దుఃఖించినది. ఆమెకు భర్తల విషయమున విశ్వాసము తగ్గినది. శ్రీకృష్ణునితో చెప్పుకొని ఏడ్చినది.
ఆపదలలో ఆమెను మునుపు కాపాడినవారు భర్తలుకారు శ్రీకృష్ణుడే. అందువలన ఆమె శ్రీకృష్ణునే ఆశ్రయించినది.
శ్రీకృష్ణుని ప్రభావము ద్రౌపదికి మాత్రమే పూర్తిగా తెలిసినట్లున్నది.
శ్రీకృష్ణుడు హస్తినలో ప్రవేశించినాడు. ఎదురు వచ్చిన భీష్మాదులను ఆదరించినాడు. కృతవర్మ తనవాడు. అందువలన అతని ఎడల స్నేహమును కనబరచినాడు. అతనివెంట నడచినాడు.
హస్తిన శ్రీకృష్ణుని రాకకు పులకించినది. అందముగా అలంకరించబడినది. తోరణములు కట్టినారు. పతాకములు ఎత్తినారు. హస్తిన ప్రజలు శ్రీకృష్ణుని దర్శించుటకు కూడినారు. రథమును చుట్టుముట్టినారు. జనసమ్మర్ధము ఎక్కువ అయినది. బెత్తముల వారు వారిని బెత్తములతో కొట్టినారు. శ్రీకృష్ణుడు బెత్తములువారిని వారించినాడు. అందరికి దర్శనము ఇచ్చినాడు.





