Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
సభ ముగిసినది.
అందఱు తమ తమ నివాసములకు వెళ్ళినారు.
తెల్లవారినది.
శ్రీకృష్ణుడు స్నానాదులు ముగించుకున్నాడు. బ్రాహ్మణులను పూజించినాడు. ఆశీస్సులు అందుకున్నాడు. దారుకుడు రథము సిద్దము చేసినాడు. శైబ్య, సుగ్రీవ, మేఘ, పుష్పవలాహకములను గుర్రములను పూన్చినాడు. శ్రీకృష్ణుడు సాత్యకిని తనవెంట రమ్మన్నాడు. కౌరవులు దుర్మార్గులు. అందువలన తన చక్ర గదాద్యాయుధములను రథమునందు పెట్టించినాడు.
రథము వచ్చి నిలిచినది.
మంగళవాద్యములు మ్రోగినవి.
పూలజల్లులు రాలినవి.
శ్రీకృష్ణుడు రథము ఎక్కినాడు. సాత్యకి శ్రీకృష్ణుని అనుసరించినాడు.
పూర్ణకుంభము, వృషభము ఎదురుగా వచ్చినవి.
పుణ్య స్త్రీలు రథము మీద అక్షతలు చల్లినారు.
శ్రీకృష్ణుని సాగనంపుటకు పాండవ, యాదవ, పాంచాల, కేకయ, పాండ్య, మత్స్య సైన్యములు వచ్చినవి. శ్రీకృష్ణుడు వారిని అందరిని ఆధార పూర్వకముగా చూచినాడు.
అప్పుడు శుభ శకునములు కనిపించినవి.
శ్రీకృష్ణుని రథము ఉపప్లావ్యము దాటుచున్నది. అప్పుడు ధర్మరాజు తన రథమును శ్రీకృష్ణుని రథము దగ్గరకు తెచ్చినాడు. అన్నాడు:-
"మహాత్మా! వాసుదేవా! మాతల్లి కుంతీదేవి విదురుని ఇంట ఉన్నది. నీరాక తెలిసి ఆమె పొంగిపోవును. నీవు విదురుని ఇంటికి వెళ్ళుము. ఆమె పరితాపము పోగొట్టుము. మేము అడవులకు వెళ్ళునపుడు ఆమె కన్నీరు మున్నీరుగా ఏడ్చినది. ఆమెను విడిచిపోవలసి వచ్చినది. ఆమె దుఃఖమున కుందుచున్నది. పాలలో పడిన బల్లివలె ఉన్నది. లక్క ఇంటి నాటినుంచి బహు దుఃఖములు అనుభవించినది. నీ దుఃఖములు తీరి దుఃఖము నశించు కాలము వచ్చినదని నేను చెప్పినట్లు చెప్పుము. నీవు తనకు కార్యానుకూలుడవు అయి ఉందువని మా అమ్మ ఎల్లప్పుడు చెప్పుచుండుము. నీ మేనత్త, మా అమ్మ కుంతీదేవిని ఓదార్పుము".
శ్రీకృష్ణుని రథము నిలిచినది. ధర్మరాజాదులు, మిగిలిన రాజులు శ్రీకృష్ణుని కౌగిలించుకున్నారు. తగురీతిగా మాట్లాడినారు. సైన్యసమేతులయి వెనుకకు మరలినారు.
హస్తినాపుర రాజ్య మార్గమున శ్రీకృష్ణుని రథము సాగినది. మార్గమధ్యమున నారద, జమదగ్ని, కణ్వాది మహా మునులు కనిపించినారు. శ్రీకృష్ణుడు వారిని చూచినాడు. రథము దిగినాడు. నమస్కరించినాడు. కుశలము అడిగినాడు. వారి రాకకు గల కారణము అడిగినాడు.
"వాసుదేవా!" నారదుడు అన్నాడు. "కౌరవ సభలో నిన్ను చూచుటకు నీమాటలు వినుటకు ఉత్సుకులయి ఉన్నారు. వారు సభకు రాదలచినారు".
శ్రీకృష్ణుడు నారదుని మాటలు విన్నాడు. మునులందరను హస్తినాపురమునకు రావలసినదని చెప్పినాడు. నారదాది మహామునులందరు శ్రీకృష్ణుని ఆశీర్వదించినారు. "నీవు హస్తినకు వెళ్ళుము. మేము అక్కడికి వత్తుము" అని శ్రీకృష్ణుని పంపించినారు.
మధ్యాహ్నము అయినది. శ్రీకృష్ణుడు ఒక పుణ్యాశ్రమమున నిలిచినాడు. మాధ్యాహ్నిక క్రతువులను నిర్వర్తించినాడు. బయలుదేరినాడు.
సాయంకాలమునకు కుశ స్థలము చేరినాడు శ్రీకృష్ణుడు. అతనిరాక తెలుసుకున్నారు అక్కడి బ్రాహ్మణులు. శ్రీకృష్ణునకు ఎదురేగినారు. స్వాగతము పలికినారు. తమ ఇండ్లకు వచ్చి ఆతిథ్యము స్వీకరించవలసినదని వేడినారు. శ్రీకృష్ణుడు వారి ఇండ్లకు వెళ్ళలేదు. విడి ప్రదేశమున ఒక గృహము నిర్మింప చేసినాడు. అచటనే విడిసినాడు. కుశస్థల బ్రాహ్మణులను తగురీతి సత్కరించినాడు.
తెల్లవారినది.
శ్రీకృష్ణుడు ప్రాతఃకాలవిధులు నిర్వర్తించినాడు. కుశస్థలి నుంచి బయలుదేరినాడు. బ్రాహ్మణులందరు శ్రీకృష్ణుని వెంటసాగినారు. సాగనంపినారు. కుశస్థలి నుంచి హస్తినాపుర మార్గమున జనులు అనేకులు శ్రీకృష్ణుని దర్శించినారు. ఫల పుష్పాదులు సమర్పించినారు. దుర్యోధనాదులు జనులను పంపినారు. మార్గమధ్యమున అనేక బహుమతులు అందజేసినారు. కృష్ణుడు ప్రీతి పూర్వకముగా వాటిని స్వీకరించినాడు. అనుభవించినట్లు నటించినాడు. కాని ఉపయోగించలేదు.
శ్రీకృష్ణుని రథము హస్తినాపుర పరిసరములకు చేరినది. బాహ్లీక, భీష్మ, ద్రోణాది బంధుమిత్రులను, దుశ్శాసనాది కుమారులను ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణునకు ఎదురుగా పంపినాడు. ఒక్క దుర్యోధనుడు తప్ప, ధృతరాష్ట్రుని కొడుకులందరు, వాద్యములతో శ్రీకృష్ణునికి స్వాగతము చెప్పినారు.
శ్రీకృష్ణుని హస్తినలో ప్రవేశింప చేసినారు.
ఆలోచనామృతము
1. ఇది సంప్రదింపుల అధ్యాయము. ఇందు వ్యక్తుల మనస్తత్వము, వారి భావములు స్పష్టముగా చిత్రీకరించబడినవి.





