Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"కౌరవులు యుద్దమునకు వచ్చిన పాండవులు యుద్దము చేతురా? వనవాసమునకు పోదురా?"
"నేను ఇట్లంటినని నీ సంధి ప్రయత్నములు మానవద్దు. వారు చెప్పినదే వినుము. సంధి కలిగింపుము".
"అన్నా! వారు నన్ను అనేక అవమానములకు గురిచేసినారు. నాగుండె మండుచున్నది. అయినను వారికి నోటితో మాత్రము కీడు చేయగలను. నా గుండెలో పొగలు సెగలు తేలుచున్నవి. నేను కోపమున ఉన్నాను. పిచ్చిగా వాగుచున్నాను. నీవు వినవలెను".
ద్రౌపది కంఠము గద్గదమయినది. కన్నీరు నిలుచుట లేదు.
"శ్రీకృష్ణా! నా తండ్రి ద్రుపదుడు యజ్ఞము చేయగా నేను పుట్టినాను. భరత వంశమున మెట్టినాను. పాండురాజునకు పెద్దకోడలిని అయినాను. మహా పరాక్రమవంతులు పాండవులకు ధర్మపత్నిని అయినాను. పరాక్రమవంతులగు పుత్రులను కన్నాను. నా అన్నదమ్ములు ధృష్ణద్యుమ్నాదుల ప్రాపు కలిగి ఉన్నాను. నీవు సుభద్రయందు కంటే నాయందు కృప కలవాడవు. ఇన్ని విధముల లోకము నన్ను కీర్తించుచున్నది".
అపభృథ స్నానమున పవిత్రమైన నా సిగనుపట్టి నిండుసభలో, నామగలు అయిదుగురు చూచుచుండగా, దుర్మార్గుడు దుశ్శాసనుడు ఈడ్చినాడు. ఇట్టి విపరీతము ఎందయిన కలదా? కుల స్త్రీలు ఇంతటి దురంతమును ఓర్తురా?".
"నేను రజస్వల అయి ఉన్నాను. ఏక వస్త్రను. అటువంటి నన్ను దుశ్శాసనుడు సభకు ఈడ్చి తెచ్చినాడు. అవమానించినాడు. అప్పుడు నా భర్తలు వీరు అయిదుగురు బొమ్మలవలె మిన్నకున్నారు. పెదవి కదల్చలేదు. అప్పుడు నామనసు నిన్ను తలచినది. నిన్ను శరణువేడినది. అప్పటిమాట తలచుకొనుము".
"ఆనాడు ధృతరాష్ట్రుడు నన్ను కోడలిగా భావించలేదు. ఈనాడు వీరు మరల అతనిని ఆశ్రయింతురట. అక్కడికి నేను కోడలిగా పోవలెనో బానిసగా పోవలెనో నీవే నిశ్చయించుము".
ద్రౌపదికి దుఃఖము ఆగలేదు. కన్నీరు కట్టలు తెంచుకున్నది. ఆమె దిగ్గున లేచినది. సిగముడి విప్పినది. విడిపోయిన వెంట్రుకలను, నల్లనాగువలె, తనచేత పట్టుకొని శ్రీకృష్ణుని ముందునకు ఉరికినది.
"అన్నా! చూడుము నా సిగ. దుశ్శాసనుడు పట్టగా సగము ఊడినది. కౌరవుల పోతూమాటలకు సగము రాలినవి. వానిని నీకు చూపుటకు వచ్చినాను".
"నా సిగ పట్టిన దుశ్శాసనుని యుద్దమందు ముక్కలు ముక్కలుగా నరికినప్పుడే నాదుఃఖము, నాకోపము శాంతించును".
"నాదుఃఖము, కోపము కార్చిచ్చువలె మండుచున్నవి. దుర్యోధనుడు ఇందుపడి కాలి చావవలెను".
"ధర్మరాజు, నేను దుర్యోధనుని పీనుగును కనులార చూడకున్న ఈ భీమార్జునుల పరాక్రమములు కాల్చనా!".
"ఒకడు గద ధరించినాడు. మరొకడు గాండీవము. కౌరవులను కూల్చకున్న ఆయుధములు కాల్చనా!".
"అన్నా! ఒడిలో అగ్నిని కట్టుకున్నట్లు, సహనమున ఇంతకాలము ఈ అగ్గిని ఆగబట్టినాను. ఇక నా కోపము చల్లారదు. ఇది కౌరవులకు చితి అయి మండుచునే ఉండును".
"నీవు దుష్టులను శిక్షించుటకు, శిష్టులను రక్షించుటకు జగములను కాపాడుటకు అవతరించినావు. నీ వంటి అన్న ఉండగా ఈ చెల్లెలు ఏడ్పునకు అంతము లేదా? నాపగతీరదా? దుర్యోధనాదులు చావరా?" అని శ్రీకృష్ణుని మీదపడి వీరపుత్రి, వీరపత్ని, వీరమాత, వీరవనిత భోరుమని ఏడ్చినది.
సభ చెమర్చినది.
శ్రీకృష్ణుడు ద్రౌపదిని ఓదార్చినాడు. ఆమె కన్నీరు తుడిచి జడముడుచుటకు పరిచారికలకు చెప్పినాడు. ద్రౌపదితో అన్నాడు:-
"అమ్మా! ద్రౌపదీ! నేను ఉండగా నీవు దుఃఖించవలసిన పనిలేదు. నాకు భీమార్జునులను సాయముగా పంపిన కౌరవులను మొత్తముగా సంహరింతును. కౌరవులు రాజ్యమును పంచరు. ఈ సంధి కుదరదు. దుర్యోధనాదుల చత్తురు. వారి భార్య పుత్రులు ఏడ్పులు విని నీవు సంతోషించగలవు. కౌరవులు యముని మహిషపు గంటలు విననున్నారు. యుద్దమున నాశనమగునట్లు బ్రహ్మ నియమించినాడు. కౌరవుల వినాశము తప్పదు. నామాట సత్యము. మేరు పర్వతము తలక్రిందులు కావచ్చును. కాని నామాట తప్పదు".
"నీభార్థాలు పాండవుల సకల శత్రువులను సంహరింతురు. పుణ్యమును, కీర్తిని, సామ్రాజ్యమును పొందుదురు. సకల సంపదలు అనుభవింతురు. ఇక ఆలస్యము లేదు. కాలము కలిసి వచ్చినది".
"వాసుదేవా"! అర్జునుడు అన్నాడు. నీవు హస్తినకు వెళ్ళుము. మా అన్న చెప్పినట్లు ధర్మయుక్తములయిన మాటలు కౌరవసభలో చెప్పుము. నీవు మనస్ఫూర్తిగా సంధికి ప్రయత్నింపుము. అది కుదరకున్న దైవమే నీవై ఉన్నాడు".
"మహాత్మా! సంధి కుదిరించుటయే నీ లక్ష్యము కావలెను. దీనిని నీవు మరువవద్దు" ధర్మరాజు అన్నాడు. "తక్కినవి నేను చెప్పవలసిన పనిలేదు. ప్రయాణమునకు రేపటిరోజు బాగున్నది. నీ జన్మ నక్షత్రము రోహిణి. రేపు రేవతి. చంద్ర తారా బలములు బాగున్నవి. రేపు ప్రాతఃకాలము ప్రయనమునకు ముహూర్తము".





