Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    "సంధియేలయగు నంచున్ మున్న కైపెక్కినట్టి
    తలంపచ్యుత నీకు గల్గినది గాండీవంబు దివ్యాస్త్ర సంత
    తియుంబెట్టిన యట్లయుండ మము జింతం బాపరాదొ కదే,
    
    నీవు చేయదలచుకున్న పనికి కీడు కలుగదు. కొన్ని పనులు ఫలింపనట్లు తోచును. కాని పురుష ప్రయత్నము వలన ఫలించును. దైవ సహాయము కూడ ఉన్న తప్పక సిద్ధించును. పురుష యత్నము దైవయత్నము రెండును నీకు వినోదములు. కౌరవులు మా చిన్ననాటి నుండి నేటి వరకు మమ్ము పడరాని పాట్లలో పడద్రోసినారు. అందువలన కౌరవుల విషయమున నీవు కోపము వహించి ఉన్నావు. కౌరవులు వివేక శూన్యులు. వారు పెట్టిన కష్టములు మా మనసులందు నిలిచినవి. అవి చవిటి భూమిలో విత్తనములవలె మొలకలు ఎత్తకున్నవి. నీవు కౌరవుల విషయమున కోపము సహించుము. సంధి కలిగించుము. అర్ధ రాజ్యము మాకు ఇప్పించుము".
    "శ్రీకృష్ణా! ఆ విధముగా కాదనిన ఏమి చేయవలెనో ఆజ్ఞాపించుము. మకు ధర్మమును, హితమును బోధించుటకు నిన్ను మించిన వారులేరు. ఆజ్ఞాపించుము. అట్లే ప్రవర్తించెదము" అన్నాడు అర్జునుడు. చేతులు జోడించినాడు.
    శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వినాడు. "అర్జునా! నీవు విరాటుని గోవులను మరలించినావు. ఆనాడే భీష్ముడు సంధిని గురించి ప్రతిపాదించినాడు. పాండవులకు రాజ్య భాగము పంచి ఇవ్వను అని దుర్యోధనుడు చెప్పినాడు. ఆనాడు దుర్యోధనాదులను ఓడించినావు. అయినను వారికి బుద్ధివచ్చినట్లు కనిపించదు".
    "ఎంత నేర్పుగా పైరు నాటినను వర్షము లేక ఫలించదు. నాశక్తి కొలది సంధి కొఱకు యత్నింతును. భగవదేచ్చ ఎట్లున్నదో తెలియదు. అయినను హస్తినకు వెళ్ళివచ్చెదను" అన్నాడు.
    "మహాత్మా! శ్రీకృష్ణా!" నకులుడు పలికినాడు. "మా అన్నలు ముగ్గురు చెప్పిన మాటలు వ్యర్ధములు కావు. మాకు ప్రతీకార బుద్ధి లేకున్నది. మేము దయకలిగి ఉన్నాము. మా అన్న అర్జునుడు విరాటుని గోవులను మరలించినాడు. అప్పటి నుండి కౌరవులు మెత్తపడి ఉందురు. నీ దయవలన మాకు ఏడు అక్షౌహిణుల సైన్యము కూడినది. పాంచాల, యాదవ, పాండ్యకేకయులందరు యుద్దమునకు సన్నద్ధులు అయి ఉన్నారు. ఇవన్నియు తెలిసి వారు మెత్తపడి ఉందురు. భీష్ముడు, ద్రోణ, బాహ్లీక, అశ్వత్ధామ, కృప విదురాదులు వారికి బుద్ధి చెప్పగలరు. నీ మాటలను కొట్టివేయలేరు. దుర్యోధనుడు నిన్ను గౌరవింపకపోడు. నీవు హస్తినకు వెళ్ళిన సంధి కార్యము చక్కపడునని నా అభిప్రాయము".
    అన్న మాటలు విన్నాడు చిన్నవాడు సహదేవుడు. అతడు ఉన్నమాట చెప్పినాడు:-
    "శ్రీకృష్ణా! దుర్యోధన దుశ్శాసనాదులు రాక్షసులు. వారికి నోటి కొవ్వులు ఎక్కువ. దుర్యోధణుని వేడుతకు నీవు వెళ్ళుచున్నావా? నిన్ను ధర్మరాజు పంపుచున్నాడా? ఇందును ఎవరయినా మెత్తురా? బంధువులు దూషించరా?"
    "దుర్యోధనుడెక్కడ? భూమి పంచి ఇచ్చుట ఎక్కడ? ఇది పొసగని మాట. మా అన్నలు కడు జాలిగా మాట్లాడినారు. కడు ధర్మముగా మాట్లాడినారు. దుర్యోధనునితో సంధి కుదరదు. కుదిరినను అది నిలువదు. యుద్దము తథ్యము. కృష్ణా! కౌరవ సభలో నామాటలుగా ఇట్లు చెప్పుము. నాకు వంకర మాటలు రావు".
    "దుర్యోధనా! నీకే ఇట్లు జరిగినదనుకొనుము. నీవే పన్నెండేండ్లు అడవులకు వెళ్ళినావు. అజ్ఞాతవాసము చేసినావు. ఆ కష్టములు అన్నియు ఓర్చి తిరిగి వచ్చినావు. తిరిగి వచ్చి అర్ధరాజ్యము అడిగినావు. అర్ధరాజ్యము ఇవ్వకుండుట ధర్మమగునా? అట్లే ఇప్పుడు పాండవులు అర్ధరాజ్యము అడుగుచున్నారు, అర్ధించుట లేదు. వారి రాజ్యము వారికి ఇచ్చుట ధర్మము అగును. కాకున్న రానున్న మహా సంగ్రామమున నీప్రాణములు తోడబడును. బతికి అర్ధ రాజ్యము ఇత్తునో, చచ్చి పూర్తిరాజ్యము పోగొట్టుకొందువో నిశ్చయించుకొనుము'.
    సహదేవుని పలుకులు, ములుకులవలె తాకినవి. సభ వారు సచేతనులు అయినారు.
    "అన్నా! సహదేవుడు చక్కగా చెప్పినాడు" సాత్యకి అన్నాడు. "దుర్మార్గుడు దుర్యోధనునకు బోధించి ప్రయోజనము లేదు. మన వారందరు యుద్దమందు ఉత్సాహము కలిగి ఉన్నారు. సంధి కాదు యుద్దమే మేలనిపించుచున్నది".
    ద్రౌపది సభలో ఉన్నది. అందరి మాటలు విన్నది. ఆమెలో దుఃఖము, కోపము కలగలుపుగా కలిగినవి. ఆసనము నుండి లేచినది. వాదించినది:-
    "అన్నా! శ్రీకృష్ణా! కౌరవులు నంగనాచులు. పుట్టినది మొదలు కష్టముల పాలు చేసినారు. ఇప్పుడు సంజయుని పంపినారు. దుర్యోధనుడు తమ్ముడు కదా ధర్మరాజునకు! ఈ ధర్మమూర్తి కరిగినాడు. అయిదు ఊళ్ళు ఇచ్చిన చాలును అన్నాడు. ఈ మాటలను జనులు మెత్తురా? పాండవులు బలహీనులు అని నవ్వరా? అయినప్పుడు సంధి వాక్యములు ఎందుకు? కౌరవులకు మేలు చేయుటకా? యుద్దము వచ్చి, కౌరవులు ముందునకు వచ్చినను వీరు వారిని చంపరా? ఇది ఎక్కడి నిర్ణయము? కౌరవులు బాపలా? వారిని క్షమించవలెనా? దుర్యోధనునకు పాండవుల పరాక్రమము అనిన పిసరంత భయము లేకున్నది. అతడు వీరిని లెక్క చేయుట లేదు".




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.