Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"ధర్మజా! అయినను పోయివచ్చెదను హస్తినకు. అక్కడ భీష్మాదులకు, సకల రాజన్యులకు నీపుణ్య చరిత్రము వివరింతును. నీవు చెప్పినవి అన్నియు చెప్పెదను. శాంతి సాధించుటకు, సంధి చేయుటకు ప్రయత్నింతును. కాని దుర్యోధన, ధృతరాష్ట్రులు మంచి మాటలు వినరు. మీ విధానమును, మీరు ముందుపడిన బాధలను తలచుకొని అక్కడి వారందరు కౌరవులను నిందింతురు. నేను వెళ్ళుట వలన ఇంతకుమించిప్రయోజనము ఉండును అని నేను అనుకొనుట లేదు".
"అయినను నాశక్తి కొలది సంధికి యత్నింతును. సంధి కుదిరెనా మేలగును. కాకున్న కౌరవుల బలాబలములను తెలిసికొందును. కౌరవ రథికుల పద్ధతిని తెలుసుకొని వచ్చెదను. ఎటులయినను హస్తిన వెళ్ళవలసియే యున్నది. నీకు విజయము చేకూర్చు పద్దతిలో తిరిగివత్తును".
శ్రీకృష్ణుని ఉపన్యాసము విన్నారు. శ్రీకృష్ణుడు యుద్దము అని వార్యము అనుచున్నాడు. ధర్మరాజు సంధి - శాంతిలోనే మనసు ఉంచినాడు.
"బావా! శ్రీకృష్ణా" భీముడు పలికినాడు. "యుద్దము వచ్చునని మమ్ము బెదిరించుచున్నావా? దుష్టుడు, దురాత్ముడు, దుర్మార్గుడు దుర్యోధనుడు శాంతి మార్గము అవలంబించు పద్దతిని నీవు చేయవలసి ఉన్నది. యుద్దమున మమ్ము బెదిరించవద్దు. దుర్యోధనుడు దురభిమాని. కోపిష్టి. అతడు చెప్పినట్లే అందరు విందురు. నీమాట అతడు లక్ష్యపెట్టునను నమ్మకము నాకులేదు. వాడు మదాంధుడు. గర్వి. వాడు నా భుజబలమును మెచ్చడు. తానే మొనగాడు అనుకొనును. వానితో కలిసి మనము ఉండలేము. అయినను అర్జునుడు, రాచవారు కురువంశము మీద దయతలచి ఉన్నారు. కురువంశమును నశింపచేయదలచలేదు. అందువలన కౌరవులు మనము పాలు, నీళ్ళు కలిసినట్లు కలిసి బ్రతుకవలసి ఉన్నది. కావున నీవు నీశక్తికొలది బోధించి దుర్యోధనునితో సంధి కలిగింపుము. దుష్టుడయిన దుర్యోధనుని వలన భరతవంశమునకు కీడు కలుగనున్నది. కావున దుర్యోధనునకు బుద్ధి చెప్పుము. సంధి కలిగించుము. భరతవంశమును రక్షింపుము నామాటలుగా దుర్యోధనునకు ఇట్లు చెప్పుము".
"దుర్యోధనా! మనము అన్నదమ్ములము. ఇతరులు నవ్వునట్లు మనము యుద్దము చేయరాదు. మనకు పెద్దలు ఉన్నారు. వారు చెప్పినట్లు విందము. రాజ్యమును పంచుకుందము. అనుభవింతము".
శ్రీకృష్ణుడు భీముని మాటలు విన్నాడు. భీముని మెత్తదనము బాగనిపించలేదు. భీముని పురిగొల్ప దలచినాడు.
"భీమా!" వేళాకోళము చేసినాడు శ్రీకృష్ణుడు. "నిప్పు చల్లారినట్లున్నది. మహాపర్వతము తేలికయినట్లున్నది. యుద్దమనిన తొడచరచువాడవు, శత్రువు పేరు చెప్పిన సంహారింతునని మండిపడువాడవు, ధర్మరాజునకు పట్టము కట్టెదనని పొంగిపోయెడు వాడవు, ఎందుకింత భీరువువలె మాట్లాడుచున్నావు? భయమన్నది ఎరుగని మహావీరుడవు. ఎవరూ నీకీ పిరికిమందు పోసినారు? ఎందుకీ పిరికితనము పూనినావు?" కలకల నవ్వినాడు శ్రీకృష్ణుడు.
"శ్రీకృష్ణా" భీముడు నవ్వి అన్నాడు. "నీవు బంటుతనపు మాటలకు పోవద్దు. మా అన్న ధర్మరాజు అర్ధరాజ్యము చాలునన్నాడు. సంధికావలెనన్నాడు. అతని మాటలకు కట్టుబడినాను. ఇది పిరికిధనము కాదు బావా! కార్యదీక్ష. ఇక యుద్దమేరానిమ్ము. నాప్రతాపాన్ని నీకు చూపకపోను. భూమ్యాకాశములను చేతులొడ్డి తోయగలను. బావా విన్నావా?"
"భీమా!" శ్రీకృష్ణుడు అన్నాడు. "నవ్వులాటకు అన్నాను. పూర్వము దుర్యోధనుడు చేసిన దుష్కార్యములను మరచి మెత్తగా మాట్లాడినవాడు భీముడేనా? అని అట్లన్నాను. కాని నీబల పరాక్రమములు తెలియనివాడనా? నీవీర కృత్యములు ఎరుగని వాడనా?"
"పార్ధుడు నన్ను సారథిని కమ్మన్నాడు. నేను అంగీకరించినాను. మేము ఇద్దరమూ యుద్దమునే కోరి ఉన్నాము. నీ పరాక్రమమును నమ్ముకొని ఉన్నాము. శత్రువును జయించవలెను. అందువలన కీర్తికలుగును. రాజ్య భోగములు లభించును. రాజ్యము యాచించుట వలన రాదు".
"అవును మీరిద్దరే మొనగాండ్రు. కౌరవ సేనను హతమార్తురు. మేము వినోదము చూచుచుందుము. ముందు నీవు కౌరవసభకు వెళ్ళిరమ్ము" అని భీముడు ఉగ్రుడయినాడు. నిప్పులు కురిపించినాడు.
"బావా! కృష్ణా! యుద్దమే రానిమ్ము. నాగద ఎట్టి ప్రళయ నాట్యము చేయునో చూడగలవు. గదగొని కౌరవ సైన్యములోనికి చొచ్చి ఏనుగుల కుంభ స్థలములు బద్దలు చేతును. గుర్రముల బారులను నేలకూల్చెదను. రథ సమూహములను పిండి పిండి చేసెదను. కౌరవ సైన్యమును హతాహతము చేసి నెత్తుటి ఏరులు పారింతురు. శ్రీకృష్ణా! ఇప్పుడు కాదు అప్పుడు చూడుము నా రుద్రరూపము. ప్రళయ స్వరూపము. యుద్దము రానిమ్ము".
"భీమా!" శ్రీకృష్ణుడు సంతోషించి అన్నాడు. "నీవు మహావీరుడవు. అది నాకు తెలియనిదికాదు. నీవు మొనగాడవు. చెప్పినదానికన్న ఎక్కువ చేయగల సమర్దుడవు. అనేక సార్లు నిన్ను తెప్పగా చేసుకొని మేము దుఃఖ సముద్రమును దాటినాము. కౌరవ సైన్యములను హతమార్చుము. మాకు సౌఖ్యములు కలిగించుము. నేను హస్తినకు పోయివచ్చెదను".
అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణునితో ఇట్లన్నాడు:-
"పరమ పురుషా! శ్రీకృష్ణా! నీవు హస్తినకు వెళ్ళుము. చెప్పవలసినది సాంతము మా అన్న ధర్మరాజు చెప్పినాడు. నీవు అన్నియు తెలిసినవాడవు. నీకు చెప్పవలసిన పనిలేదు. అయినను నాకు తెలిసినంత చెప్పెదను. వినుము".





