Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    "విరోధము మంచిదికాదు. దీర్ఘ విరోధము చాల చెడ్డది. విరోధము ఉన్నవాడు పామును ఇంట్లో కాపురము ఉంచుకున్నవాడగును. కావున విరోధమును మాన్పవలెను. దానివలన లోక శాంతి, జనశాంతి, మనశ్శాంతి కలుగును".
    "కృష్ణా! మాకు రాజ్యభాగము కావలెను. దానిని వదులుకొనజాలము. అందుకు ధన, కుల, జనక్షయము కారాదని నా అభిప్రాయము. యుద్దము తప్ప మరే ఇతర మార్గమును అయినను నీవు అవలంబించవలసి ఉన్నవి. నీవు కౌరవసభలో మాయందు పక్షపాతము వహించరాదు. ఉభయ పక్షములందు సమానబుద్ది కలవాడయి మాట్లాడవలెను. మాకును వారికిని సంధి కలుగునట్లు మాట్లాడుము. భీష్మద్రోణాదులు సంతోషించునట్లు మాట్లాడుము. దుర్యోధనుడు కఠినుడు. వాడు కరకు మాటలు మాట్లాడును. అయినను సహనము వహించుము. అతని మాటలు విని లేచిరావద్దు. నీవు ధర్మమాగ్రమున లోకప్రసిద్ధమగునట్లు మాట్లాడుము. వేయిమాటలు చెప్పనేల. నీవు నన్ను ఏరీతిగా నడుపదలచితివో అదియే నాకు పరమసంతోషము".
    ధర్మరాజు కొంతసేపు మౌనము దాల్చినాడు. ఏదో ఆలోచించినాడు. "శ్రీకృష్ణా! నీవు దుర్యోధనుని వద్దకు వెళ్ళరాదు. వాడు దుష్టుడు. కర్ణ, శకుని, దుశ్శాసనులు దుష్టులు. అవివేకులు. క్రూర కర్ములు. వద్దు నీవు హస్తినకు వెళ్ళరాదు. నేను నిను ఆ నీచుల దగ్గరికి పంపను. పంపలేను. పంపజాలను. నీవు కష్టపడిన పక్షమున నాకు దేవేంద్రపదవి వచ్చినను వద్దు. వద్దు శ్రీకృష్ణా వద్దు. నీవు దుర్యోధనుని వద్దకు వెళ్ళవద్దు" అన్నాడు ధర్మజుడు. అతని మాటలలో ఆవేదన కనిపించినది.
    అక్కడివారు ధర్మజుని మాటలు విన్నారు. శాంతి కొఱకు ధర్మజుడు పడు ఆరతమును గ్రహించినారు. యుద్దము ఎంత హేయమయినదో తెలుసుకున్నారు. అందరి మనసులందు "శాంతి-సంధి"ని గురించి ఆలోచనలు సాగినవి.
    సమావేశము మౌనము దాల్చినది.
    "ధర్మజా!" శ్రీకృష్ణుడు మాట్లాడినాడు. "నీవన్నది నిజము. దుర్యోధనుడు మాత్రమే కాదు ధృతరాష్ట్రుడును కుటిలుడు. వారు నామీదకు యుద్దమునకు రావచ్చునని నీవు అనుకున్నావు. రానిమ్ము. అట్లు వచ్చిన కౌరవులలో ఒక్కడు కూడ దక్కడు. కావున నీవు నా విషయమున చింతించవలసిన పనిలేదు. నన్ను కౌరవసభకు పంపుము. నేను వెళ్ళుటవలన కార్యానుకూలము కావచ్చు. కౌరవులు నామాటలను లక్ష్యపెట్టకున్న మనయందు దోషము లేదని లోకులు తెలుసుకుందురు. నన్ను పంపుము. నేను వెళ్ళి వచ్చెదను".
    "మహాత్మా!" ధర్మరాజు విన్నవించినాడు. "నీవే నిశ్చయించినచో మంచిదే అగును. హస్తినకు వెళ్ళుము. పాండవులు, కౌరవులు కలిసి ఉండునట్లు సంధి చేయుము. నీవు మా అభిప్రాయములను ఎరుగుదువు. వారి అభిప్రాయములు నీకు తెలియును. మాట్లాడవలసిన పద్దతి తెలియును. నీకు చెప్పవలసినంతవాడను కాను".
    ధర్మజుడు శాంతిని గురించి, సంధిని గురించి మాట్లాడుచున్నాడు. యుద్దము విషయమున విముఖుడు అయినట్లు ఉన్నాడు అనుకున్నాడు శ్రీకృష్ణుడు. ధర్మరాజుతో అన్నాడు.
    "ధర్మజా! నీవు కేవలము ధర్మమును అవలంబించినావు. సంధికి యత్నించుచున్నావు. వారు కేవలము వైరము వహించి ఉన్నారు. కయ్యమునకు కాలుదువ్వుచున్నారు. వారు నీ రాజ్యమును అపహరించినారు. నీకు వారు రాజ్యము పంచి ఇవ్వరు. దుర్యోధనాదులందరు దుర్మార్గులు. వారు మాటలకు లొంగరు".
    "ధర్మరాజా! నీవు దైన్యము విడువుము. ధైర్యము కలిగి ఉండుము. క్షత్రియులకు యాచించుట ధర్మము కాదు. యుద్దమునకు సిద్దమగుము. కౌరవులను సంహరించుము. రాజ్యము పొందుము. శాశ్వతమయిన కీర్తిపొందుము".
    "వారు మిమ్ములను లక్క ఇంట కాల్చినారు. మాయాజూదమున ఓడించినారు. రాజ్యము గుంజుకున్నారు. అడవులకు తోసినారు. ద్రౌపది వలువలు నిండుసభలో ఒలిచినారు. ఆమె దీనస్థితిని చూచి వెకిలిగా నవ్వినారు. నానా దుర్భాషలాడినారు. ఇన్నిచేసి ఇప్పటికీ వారు పిసరంత చింతించుటలేదు. అట్టి వారిమీద జాలి తలచుట ధర్మము కాదు. ఉచితము కాదు".
    మీరు బలవంతులు. అయినను సత్యమునకు కట్టుబడినారు. ప్రతీకారము చేయలేదు. అడవులకు వెళ్ళినారు. అది చూచి జనులు చింతించినారు. దుఃఖించినారు. కౌరవులను తిట్టినారు. రోసినారు. ప్రజలు, దైవము వారి పక్షమున లేరు. దైవోపహతులను ఓడించుట సులభము.
    "కౌరవులు క్రూర స్వభావులు. చంపదగినవారని జనులు అనుకొనుచున్నారు. అట్టివారిని నీవు ఎందుకు చంపవు? పాములను చంపినట్లు కౌరవులను చంపవలెను. పాపులను చంపుట వలన పుణ్యము వచ్చును".
    "దుర్యోధనుని బొందిలో ఊపిరి ఉన్నంత వరకు నీకు నేల చెక్కఇవ్వడు. నీవు యుద్దము చేసియే సాధించవలసి ఉన్నది. యుద్దమున నిన్ను విజయలక్ష్మి వరించనున్నది. అందుకు అనుకూలముగా నాకు అనేక శకునములు కనిపించుచున్నవి. కావున నీవు సమరోత్సాహమును విడువరాదు. బలములను సిద్దము చేయుము. రణమునకు పురికొల్పుము. కార్యమును సాగించుము".




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.