Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
వేదవ్యాసుడు చెప్పమనగా, సంజయుడు చెప్పిన పలుకులు ధృతరాష్ట్రుడు విన్నాడు. అతని మనసులో వెలుగు అంకురించసాగినది. "దుర్యోధనా! వింటివి కదా సంజయుని ఉపదేశము. విష్ణు దేవుడయిన శ్రీకృష్ణుని ఆశ్రయింపుము. నిన్ను, నీతమ్ములను కొడుకులను రక్షించుకొనుము" అన్నాడు.
"శ్రీకృష్ణుడు సర్వలోకములను సంహరించగల సమర్దుడే కావచ్చును. అతడు పాండవ పక్షపాతి. అర్జునుని మిత్రుడు. అందువలన అతనిని ఆశ్రయించను. ఆశ్రయించనుగాక ఆశ్రయించను" అని గంటకొట్టి చెప్పినాడు దుర్యోధనుడు.
"కుమారా! దుర్యోధనా" గాంధారి అన్నది. "నీ ఆయువును, సంపదను, మమ్ములను, సకల బంధువులను, స్నేహితులను విడువనున్నావు. నీవంటి అవివేకి మరెక్కడను కనిపించడు. దైవము భీముడయి వచ్చి సంహారము జరుపుచుండగా అడ్డువచ్చు వారు ఉండరు".
వేద వ్యాసునకు అన్నియు తెలియును. అతడు ధృతరాష్ట్రునకు ఉపదేశించినాడు:-
"కుమారా! శ్రీకృష్ణుడు నీయందు దయకలిగి ఉండును. సంజయుడు నీకు ఆప్తుడు. అతనిని నారాయణుని వద్దకు పంపినావు. మంచి పని చేసినావు. సంజయునకు శ్రీకృష్ణదేవుని ప్రభావము తెలియును. అతడు చెప్పిన ప్రకారము నీవు శ్రీకృష్ణదేవుని ఆశ్రయింపుము".
"కామ క్రోధములకు వశుడు అయినవాడు, తృప్తిలేనివాడు, అన్యాయ మార్గమున ప్రవర్తించువాడు శ్రీకృష్ణుని తెలియలేడు. దూరముగా ఉండును. నీవు సర్వవిధముల శ్రీకృష్ణునకు శరణాగతుడవయి జీవింపుము".
ధృతరాష్ట్రుడు వేద వ్యాసుని ఉపదేశము విన్నాడు. అతని మనసు నుండి అశాంతి తొలగసాగినది. శాంతి చోటుచేసుకొనసాగినది. అతడు వేద వ్యాసునకు చేతులు జోడించినాడు.
"తండ్రీ! మహాత్మా! నాకు జ్ఞానోదయము కలిగించినావు. శ్రీకృష్ణుని తెలియపరచినావు. నేను శ్రీకృష్ణుని ఆశ్రయించి జీవింతును" అని విన్నవించినాడు.
వ్యాసుడు ధృతరాష్ట్రుని ఆశీర్వదించినాడు. అంతర్ధానుడు అయినాడు.
దుర్యోధనుడు, సంజయుడు తమ తమ నివాసములకు వెళ్ళినారు.
గాంధారీ ధృతరాష్ట్రులు అంతఃపురమున ప్రవేశించినారు.
అక్కడ ఉపప్లావ్యమున సంజయుడు హస్తినకు మరలిన మరునాడు ధర్మరాజు తమ్ములను, పుత్రమిత్ర బంధువులను పిలిపించినాడు. అన్నాడు:-
"ఇప్పుడు మనము శ్రీకృష్ణుని ప్రార్ధించి కౌరవ సభకు పంపించవలెను. శ్రీకృష్ణుడు కౌరవ సభలో మాట్లాడిన సంధి కుదురును. బంధు, గురుజనులతో యుద్దము చేయుట తప్పిపోవును. హింస, రక్తపాతము, సంహారము నిలిచిపోవును. ఒక విపత్తుతొలగును. సకలప్రాణులు శాంతితో జీవింతురు".
ఆవిధముగా చెప్పి బంధు, మిత్ర సోదరుల సహితముగా శ్రీకృష్ణుని నివాసమునకు వెళ్ళినాడు. శ్రీకృష్ణుడుధర్మరాజాదులను గౌరవించినాడు. ద్రౌపది కూడ వచ్చినది. ఆమె పరిచారికలతో ఒక పక్కన ఉన్నది. అందరు ఆశీనులు అయినారు.
"మహాత్మా! శ్రీకృష్ణదేవా! మాతండ్రి పాండురాజు నిన్ను మాకు దిక్కుగా చూపి స్వర్గస్థుడు అయినాడు. మా ఆపదలు తీర్చుటకు, సుఖములు కలిగించుటకు నీవు సమర్దుడవు. మిత్రుల కార్యము చేయుటకు ఇది సమయము. దుర్యోధనుడు అవివేకి. అయినను నీవలన యుద్దము తప్పవచ్చును. సంధి కలుగవచ్చును. మారాజ్య భాగము మేము అనుభవించగలము. ప్రద్యుమ్నాదులవలె మేము నీకు పుత్రులవంటి వారము. మమ్ము రక్షింపుము" అని ధర్మరాజు ప్రార్ధించినాడు.
శ్రీకృష్ణుడు సంతసించినాడు "ధర్మజా! నేను నీవు ఆజ్ఞాపించినట్లు చేయగలను. నీ మనసులోని మాట చెప్పుము. నీ తలంపు వివరింపుము" అన్నాడు:-
ధర్మరాజు చెప్పినాడు:-
"మహాత్మా! శ్రీకృష్ణా! నీవు హస్తినకు వెళ్ళవలెను. సంధి కలిగింపవలెను. నిన్నటి సభలోని విషయములు విన్నావు. ధృతరాష్ట్రుడు తీయని మాటలు చెప్పి, మాకు రాజ్య భాగము మాత్రము ఇవ్వనట్లున్నాడు. నీవును సభాజనులు ఆశ్చర్యపడగా మాకు అయిదు గ్రామములు ఇచ్చిన చాలును అన్నాను. వారు అవి కూడ ఇత్తురో ఇవ్వరో తెలియకున్నది".
"యుద్దము క్రూర కర్మము. అందుకు నామనసు ఒప్పుట లేదు. నాకు సంపదలు అక్కరలేదు. కాని నన్ను ఆశ్రయించిన బంధుజనులకు అన్నవస్త్రములు కావలెను. కౌరవులు మేము కలిసి జీవించిన ఎల్లవారు సంతసింతురు".
"యుద్దము చేయుట చంపుట చచ్చుట అగును. ఎట్టి వానిని అయినను చంపి ప్రయోజనములేదు. నింద్యమగు యుద్దము కాక మరొక మార్గము చూతము. సకల బంధుజనులను హతమార్చుట మంచిదికాదు. అందువలన దురవస్థ కలుగును. అందువలన యుద్దమునకు నామనసు సమ్మతించుట లేదు".
యుద్దమున ఒకని కొఱకు అనేకులు చత్తురు. యుద్దమున విజయము తథ్యము కాదు. గెలిచినను అది మరణము కంటే నికృష్ణము. ఎల్లప్పుడు జరిగిన హింసయే గుర్తునకు వచ్చును. మానసిక హింస తప్ప గెలిచిన వారికి సహితము సుఖము లేదు. కావున శత్రువుతో సంధి చేసుకొనుట ఉత్తమము. అందువలన హింస తప్పును.





