Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    కర్ణుడు భీష్ముని వాక్కులు విన్నాడు. అగ్గిబుగ్గి అయినాడు అన్నాడు:-
    "ధృతరాష్ట్ర మహారాజా! వింటిరా భీష్ముని సాపెనలు! అతడు నన్ను లెక్క చేయుటలేదు. నిరాకరించుచున్నాడు. భీష్మా! నీవు నన్ను నిరాకరించినావు. కావున నాబలము నీకు సాయపడదు. యుద్దమున నీవు ఉండగా నేను యుద్దము చేయను. ఆయుధము ధరింపను. నీవు కూలిన తరువాతనే ఆయుధము ధరింతును. నా బలపరాక్రమములను ప్రదర్శింతును" అని దిగ్గునలేచి సభ నుండి లేచిపోయినాడు.
    కర్ణుడు లేచిపోవుట చూచినాడు భీష్ముడు. పెద్దగా నవ్వినాడు. "దుర్యోధనా! చూచినావా కర్ణుని ప్రతాపము. మాటలతో పాండవులను జయించినాడు. చేతలందు అస్త్ర సన్యాసము చేసి వెళ్ళిపోయినాడు. అయినను నీవు నా మాటలు వినవు. కర్ణుని మాటలే విందువు. ధర్మరాజుతో యుద్దము చేతువు. అదినాకు తెలియును. నేను మాత్రము యుద్దమున బాహ్లీక, ద్రోణులు చూచుచుండగా పాండవ పక్షపు అనేక సహస్ర వీరులను వధింతును. నా తరువాత కర్ణుడు ఎంతటి వీర కృత్యములు చేయునో చూతువుగాక" అన్నాడు.
    "భీష్మా" దుర్యోధనుడు విషము కక్కినాడు. "నీవు ద్రోణుడు నలుగురిలో పాండవులే గెలుతురని చెప్పుటకు ప్రతిన బూనినారు. నేను మిమ్ము నమ్ముకొని యుద్దమున దిగనున్నాను. ఇక మీ సాయము నాకు అక్కరలేదు. కర్ణ, దుశ్శాసనులను సాయముగాగొని నేనే సకల పాండవ సైన్యమును జయింతును. ఇతరుల సాయము కోరను. ఇది నా నిర్ణయము".
    తండ్రి, కొడుకు మాటలు విన్నాడు. విలవిలలాడినాడు. కటకట పడినాడు. కొడుకును వారించదలచినాడు. అయినను ఏమియు అనలేకపోయినాడు. ఇంకను గుడ్డిరాజు ఆశ చావలేదు. కొడుకులు చత్తురేమో అను అనుమానము అతనిని బాధించినది.
    "విదురా! దుర్యోధనుడు యుద్డంనకే తెగించి ఉన్నాడు. యుద్దమున జయము నిశ్చయము కాదు. ఇప్పుడు మనము ఏమిచేయవలెనో చెప్పుము" అని అడిగినాడు.
    "మహారాజా! కౌరవులు మొదలే దుర్బలులు. పరస్పర దూషణ ద్వేషముల వలన మరింత బలహీనులు అయినారు. పాండవులు గెలుచు టకు ఇది చాలును. అక్కడ పాండవులకు బంధుమిత్రుల సాయమున్నది. వారిది ఒకే తలపు. ఒకే లక్ష్యము. కార్యమును సాధించవలెనని దీక్షగా ఉన్నారు. ఒట్టిమాటలు కట్టిపెట్టి ధర్మరాజు చెప్పినట్లు సంధి చేసుకొనుటయే మేలు. ఇంతకు మించినది మనకు మేలుకాదు" అని విదురుడు ఉపదేశించినాడు.
    విదురుడు తాను అనుకున్నది చెప్పలేదు. అప్పుడు పుత్ర పక్షపాతి అయిన గుడ్డిరాజు "సంజయా! పాండవ కౌరవుల యుద్ద పాటవములు నీవు ఎరుగుదువు. యుద్దము జరిగిన ఎవరూ గెలుతురో నిశ్చయింతము. ఉభయ పక్షములందాలి అధిక ఉపాయా పౌరుషవంతులను గురించి వివరింపుము" అని అడిగినాడు.
    "మహారాజా!" విదురుడు విసుగు చెంది అన్నాడు. "ఈ విషయములు నేను ఇది వరకే చెప్పియున్నాను. మరల చెప్పుట వలన ప్రయోజనము లేదు. గాంధారీ దేవిని పిలిపింపుము. నీ తండ్రి వేదవ్యాసుని తలచుకొనుము. వారు వచ్చి నిర్ణయింతురు".
    ధృతరాష్ట్రుడు గాంధారిని పిలిపించినాడు. ఆమె వచ్చినది. వేదవ్యాసుని స్మరించినాడు. అతడు ప్రత్యక్షము అయినాడు. ధృతరాష్ట్రుడు వేదవ్యాసుని సత్కరించినాడు. అసీనుని చేసినాడు. వ్యాసుడు ధృతరాష్ట్రుని చిత్తవృత్తిని తెలుసుకున్నాడు. "సంజయా! నీవు సర్వము తెలిసినవాడవు. మహారాజు నిన్ను అడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పుము" అన్నాడు.
    సంజయుడు వేద వ్యాసునకు నమస్కరించినాడు. ఉపన్యసించినాడు:-
    "మహారాజా! మాటి మాటికి నీవు పాండవుల బాల పరాక్రమములను గురించి అడుగుచున్నావు. వారి శక్తియుక్తులు నిగూఢములు. తెలియరావు. అయినను తెలిసినంతవరకు చెప్పుచున్నాను. వినుము".
    "పాండవ పక్షమున శ్రీకృష్ణుడు ఉన్నాడు. అతడు సర్వలోక వీరుడగు బాణాసురుని బలమును గడియలో త్రుంచినాడు. దేవేంద్రుని కల్పవృక్షమును అనాయాసముగ తెచ్చినాడు. శ్రీకృష్ణుడు ఒక పక్షమయి, సకల లోకములు మరొక పక్షమయిన శ్రీకృష్ణుడే బలవంతుడు అగును. అతడు తన సంకల్ప మాత్రమున లోకములను సృష్టించను, రక్షించను, సంహరించను సమర్ధుడు. విలాసము కొఱకు శ్రీకృష్ణుడు మానవరూపమున అవతరించినాడు. మంచివారిని రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు అతడు భూలోకమున అవతరించినాడు. సత్యము, ధర్మము ఉన్నచోట శ్రీకృష్ణుడు ఉండును. అవి ఇప్పుడు పాండవుల పక్షమున ఉన్నవి. కావున శ్రీకృష్ణుడు వారి పక్షమున ఉన్నాడు. పాపాత్ములయిన నీపుత్రులను సంహరింపనున్నాడు".
    "శ్రీకృష్ణుడు విష్ణు స్వరూపుడు. విష్ణువును తెలుసుకొనుటకు విద్యను ఆశ్రయించవలెను. సాత్విక, రాజస, తామసములు ప్రకృతి ధర్మములు. వానికి లోనుకాక పుణ్యకార్యములు చేయుట విద్య అనబడును. ఈ విద్య కానిది అంతయు అవిద్య అనబడును. కావున మహారాజా! నీవు విద్యణు ఆశ్రయింపుము. విద్యను ఎరుగుము".




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.