Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    "నాయనా! సుయోధనా! నీవు పెద్దల మాటలు వినవు. కర్ణ, శకుని, దుశ్శాసనుల మాటలు నీకు కమ్మగా ఉండును. వారి మాటలు కార్యసాధకములు కావు. నామాట వినుము. సంధికి సమ్మతింపుము".
    "ఆహారాజా!" దుర్యోధనుడు ఆవేశమున అన్నాడు. "భీష్మ ద్రోణాది ముసళ్ళు యుద్దమునకు సమ్మతింపరన్నావు. నేను ఆ వృద్ధుల మీద ఆశపెట్టలేదు. కర్ణ, దుశ్శాసనులిద్దరి సాయము నాకు చాలు. పాండవులను మట్టి కరిపించగలను. నీవు నీపిరికి మాటలచే నన్ను బాధించవద్దు. నేను ఇదే చెప్పుచున్నాను. పాండవులకు సూదిమొన మోపినంత నేల కూడ నేనివ్వను ఇది నా నిశ్చయము. దీనికి తిరుగులేదు".
    దుర్యోధణుని మాటలు విని సభ సాంతము గడగడలాడినది. ధృతరాష్ట్రుని మనమున రాళ్ళవాన కురిసినది. అతని మనసు తల్లడిల్లినది. అతడు కొద్దిసేపు మాట్లాడలేదు. ఇంతలో అతనికి ఒక ఆశ చిగురించినది. యుద్దమున తన వారే గెల్తురేమో? తానే పిరికివాని వలె ప్రవర్తించు చున్నాడేమో? ధృతరాష్ట్రుడు ఆమాటలు అనుకున్నాడు. సంజయుని సంప్రదించినాడు. చాలసేపు ఉభయ పక్షముల బలాబలములను గురించి లెక్కలు వేసినారు. మరికొంతమంది కూడినారు. కూడికలు వేసినారు. తీసివేసినారు. హెచ్చించినారు. భాగించినారు.  ఎంత చేసినను పాండవుల బలమే బలవత్తరమని తేలినది. పాండవులధి దైవబలమనియు, కౌరవులది మానుష బలమనియు ధృతరాష్ట్రుడు తెలుసుకున్నాడు. దైవబలమును మానుషబలము గెలుచుట అసంభవము అని గ్రహించినాడు.
    "కుమారా! దుర్యోధనా!" ధృతరాష్ట్రుడు బోధించినాడు. "అర్జునుడు సామాన్యుడు కాడు. అతనికి అగ్నిదేవుడు దివ్యరథ, ధ్వజ, అశ్వములను, దివ్యధనుర్భాణములను అక్షయ తూణీరములను ఇచ్చినాడు. పాండవులకు పంచదేవతలు తండ్రులు. వారు పాండవులకు కీడు కలుగకుండ కాపాడుచుందురు. కావున భీష్మ ద్రోనాదులు వారిని యుద్దమున అవమానింపరు. వాస్తవముగ పాండవులకు దేవతా రక్షణతో పనిలేదు. దేవతలు జయింపరాణి రాక్షసులను అర్జునుడు జయించినాడు. నీకు అర్జునుని బలము, పరాక్రమము, శక్తి తెలిసియున్నది. నీవలన కౌరవులందరకు మహావిపత్తు కలుగనున్నది. దీర్ఘవైరము ఎవరికిని పనికిరాదు. ఎన్నివిధముల చూచినను యుద్దము వలన ప్రయోజనములు లేవు. శాంతియే మనకు శరణ్యము".
    "మహారాజా!" దుర్యోధనుడు కస్సుమన్నాడు. మీరు బలహీనులుగా మాట్లాడరాదు. భయపడి పలుకరాదు. దేవతల రక్షణ పాండవులకు ఉండదు. రాగద్వేషములు లేనివారు దేవతలు. దేవతలు వాస్తవముగ పాండవులకు సాయము చేసిన, వారి దేవత్వము ఊడిపోవును. అప్పుడు వారు పాండవులకు ఏమి సాయము చేతురు?
    "తండ్రీ! నీవు నా బలమును తెలియకున్నావు. నేను కార్చిచ్చును ఆర్పగలను. శిలావృష్టిని నిలుపగలను. పెనుగాలిని ఆపగలను. సముద్రమును భూమిగా మార్చగలను. భూమిని సాంతము సముద్రము చేయగలను. సింహ శరభాది క్రూర జంతువుల ఆగడములను ఆపగలను. అగ్ని స్తంభన, జల స్తంభన, వాయు స్తంభనది విద్యలు నేర్చి ఉన్నాను. మిత్రులకు శుభము, అమిత్రులకు అశుభములు కలిగించు విద్యలు నేర్చినాను. సకల సిద్ధులు నాయందు ఉన్నవి. సకల దేవతలను ఆరాధించి ఉన్నాను. వారందరు నావిషయమున ప్రసన్నులు".
    "పాండవులవద్ద నావద్ద ఉన్న విద్యలు లేవు. ఎట్లనిన అవి ఉన్నచో వారు పన్నెండేండ్లు ఆకులలములు తినుచు అడవులందు ఉండవలసిన పనిలేదు".
    "తండ్రీ! పాండవ పక్షమున ఉన్న రాజులు ఎందునను నాతో సములు కారు. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్ధామలకు తెలిసిన శస్త్రాస్త్రములు అన్నియు నాకు తెలియును".
    "మహారాజా! మీరు భయపడవలసిన పనిలేదు. జయము మనది. గెలుపుమనది" అని ముగించినాడు.
    దుర్యోధనుని శక్తియుక్తులణు గురించి ఇతరులు చెప్పగా సభవారు వినలేదు. ఇప్పుడు దుర్యోధనుని నోట విన్నారు. ఆశ్చర్యపడినారు. చకితులు అయినారు.
    "దుర్యోధన మహారాజా!" కర్ణుడు ధృతరాష్ట్రుని లెక్కచేయక సాగించినాడు. "నీకు సాయము నేను ఉన్నాను ఎవరువచ్చునో రమ్మనుము. కవచముగా నిలచి నిన్ను కాపాడెదను. ఈ భీష్మ, ద్రోణాదులు నాబలమును తెలియకున్నారు. చులకన చేయుచున్నారు. పరశురాముని కోపమున నాకు దివ్యాస్త్ర స్ఫురణలేదని జనులు చెప్పకొనుచున్నారు. అది నిజము కాదు. పరశురాముని పూజించినాను. అతని అనుగ్రహము పొందినాను. దివ్యాస్త్రస్ఫురణ నాకు లభించినది. ఇంద్రాది దేవతలు సైతము నన్ను ఎదిరించజాలరు. అర్జునుడు నాకొక లెక్కకాదు. భీష్మాదులు చూచుచుండగా పాండవ సేనను చీల్చిచెండాడెదను. పాండవులను హతమార్తును. నీకు జయము కలిగింతును".
    "కర్ణా!" భీష్ముడు గర్జించినాడు. "నీవు మాటలకు మొనగాడవు. చేతలకు కాదు. మృత్యువును తొడకొట్టి పిలుచుచున్నట్లు మాట్లాడినావు. నీది గర్వము. దురహంకారము. నీకు దేవేంద్రుడు శక్త్యాది ఆయుధములు ఇచ్చినాడు. వాటితో అర్జునుని కొట్టవచ్చునని గర్వపడుచున్నావు. నీవద్ద సర్పముఖ బాణము ఉన్నది. దానితో అర్జునుడు కూలును అనుకొనుచున్నావు. శ్రీకృష్ణుడు వాటిని అన్నింటిని నశింపచేయును".
    "కర్ణా! ఘోషయాత్ర సమయమున దుర్యోధనుని బంధించినపుడు నీపరాక్రమము ఏమైనది? అది ఎచట దాగినది? మొన్న ఉత్తర గోగ్రహణమున నీవు ఇప్పుడు పలికిన బీరములు పనికి రాలేదేమి? అర్జునుని ఒక్కనిని ఎదిరించలేకపోయినావు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునకు సాయమున్నాడు. మహాసైన్యములున్నవి. మహావీరులున్నారు. నీవు తెంపుచేసి యుద్దమునకు ఉరుకుదువు. చత్తువు. యుద్దమున చచ్చుట భృత్యధర్మమే అగును. సమరమున చచ్చిన వారికీ పుణ్యగతులు కలుగకపోవు".




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.