Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"ఈయుగమున వారు శ్రీకృష్ణార్జునులుగా అవతరించినారు. నారాయణుండు శ్రీకృష్ణుడు కంస, నరకాసురాది దుష్టులను సంహరించినాడు. నరుని రూపగు అర్జునుడు సముద్రతీరమున ఉన్న హిరణ్యపురమును గెలిచినాడు. నివాత కవచులను అరువదివేల మందిని నిర్జించినాడు. పర్జన్యునకు ప్రియము చేసినాడు".
"వారిద్దరూ కలసి ఎత్తి వచ్చిన హరి హర బ్రాహ్మదులు కూడ గెలువలేరు. శ్రీకృష్ణుడు సారథి, అర్జునుడు రథియై వచ్చిన నాటి మాట చెప్పుటకు కాదు. చూడవలసినదే" అని దుర్యోధణుని ఉద్దేశించి పలికినాడు.
"నామాట వినవు. లక్ష్య పెట్టవు. అకార్యము దప్ప నీ మనసుకు పట్టదు. కౌరవులకు అంత్యకాలము ప్రాప్తించినట్లున్నది. ఇందుకు నీకున్న గర్వమే నిదర్శనము. ఇప్పుడు నేను చెప్పు హితము వినవు. కర్ణ, శకుని, దుశ్శాసనులు చెప్పుమాటలే విందువు. అప్పుడు వాడు చచ్చె, వీడు చచ్చె, అను మాటలు వినవలసి వచ్చును".
భీష్ముని మాటలు విని విననట్లు నటించినారు దుర్యోధనాదులు. వారిలోవారు ముచ్చటలు సాగించినారు. అప్పుడు ద్రోణుడు ధృతరాష్ట్రునితో అన్నాడు:-
"మహారాజా! భీష్ముడు కురు సంతతికి పితామహుడు. వృద్ధుడు. జ్ఞాని. ఉభయుల హితము కోరుచున్నవాడు. అ పితామహుని చులకన చేయుట హితముకాదు. ధర్మజుడు ధర్మాత్ముడు. అతనితో సమరము కూడదు. సంధియేమేలు. అర్జునుడు సంజయునితో అన్నమాటలు అతిశయోక్తులుకావు. అతడు అంతటి వీరుడు. ఖాండవదహనాదులందు వివ్వచ్చుని పరాక్రమమును మనము ఎరిగియే ఉన్నాము. అర్జునుడు పోరునకు ఉరికిన అతనిని ఎదిరించి గెలిచిన మగవారు లేరు. అందువలననే అతనికి విజయుడు అని పేరు వచ్చినది. మనలోనే కాదు లోకమంతటను విజయుని ఎదిరించగల మొనగాడు లేడు, లేడు. ఇది నిశ్చయము. ఇందు ఇసుమంత అనుమానము లేదు. కావున సంధి ఉభయులకు హితకరము. భీష్ముని మాటలు వినుట, ఆచరించుట ఉత్తమము అగును".
భీష్మద్రోణుల ఉపదేశములను, ధృతరాష్ట్రుడు విని విననట్లు నటించినాడు. వారిని ఆదరించలేదు. వారికి సదుత్తరములు ఇవ్వలేదు. "సంజయా! ధర్మరాజు బలమెంత? అతని సేన ఎంతటిది? అతనికి సాయము వచ్చువారెవ్వరు? వారి బాల పరాక్రమములు ఎంతటివి?" అని అడిగినాడు.
గుడ్డిరాజు సంజయుని అడిగిన ప్రశ్న విన్నారు. కురు కులము వారు తమ ప్రాణముల మీద ఆశలు వదులుకున్నారు. గుడ్డిరాజు మాటలకు సంజయుడు కుంగిపోయినాడు. నోట మాట రాలేదు. గుడ్డిరాజే ఇంతటి వాడయిన కొడుకుల మాట చెప్పనేల? అనుకున్నాడు. అయినను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పినాడు:-
"ధర్మరాజు ధర్మము కోరుచున్నాడు. సంధి కోరుచున్నాడు. తన రాజ్య భాగము కోరుచున్నాడు. అది లభించకున్న యుద్దమునకు సన్నద్దుడై ఉన్నాడు. అతనిదెస ఉన్నవారు జగమెరిగిన వారు. బక, జట, హిడింబాసురలను వధించినవాడు, కీచక కుల నిర్మూలకుడు, పదివేల మదపుటేనుగుల శక్తి గలవాడు భీముడు ఉన్నాడు. శివునితో ద్వంద్వ యుద్దము చేసిన అర్జునుడు ఉన్నాడు. వీరాధివీరులు నకుల సహదేవులున్నారు. ద్రౌపదీపుత్రులు, అభిమన్యులు ఉక్కు తునకలు. సాత్యకి, ధృష్ట ద్యుమ్నుడు, ద్రుపదరాజు, విరాటుడు, అతని తుమ్ములు, అతని పుత్రులు, కేకయులు, జరాసంధుని కొడుకు మాగధసహదేవుడు, జయత్సేనుడు, ధృష్టకేతుడు, చేకితానుడు, వృషభుడు, శైబ్యుడు వంటి మహాశూరులు ఉన్నారు. మాయా బలసమన్వితుడు ఘటోత్కచుడు ఉన్నాడు. తూర్పు ఉత్తర దిక్కుల రాజులున్నారు. పాండవపక్షపు రాజులు అగ్గిని సహితము పిడికిట పట్టుటకు సాహసించి ఉన్నారు".
"మహారాజా! అందరిని మించి ముల్లోకములను అరచేత ఆడించగల వాసుదేవుడు పాండవ పక్షమున ఉన్నాడు. ధర్మరాజునకు నారాయణుడే అండగా నిలిచినాడు. ధర్మరాజు యుద్దమునకు వచ్చును. అతని బలములను ఎదిరించు శక్తి ఎవరికిని లేదు. యుద్దమున విజయము తథ్యమని ధర్మరాజు నమ్మి ఉన్నాడు".
సంజయుడు ముగించినాడు. బరువు దిగినట్లు కూర్చున్నాడు. ధృతరాష్ట్రుడు తలవంచి అంతయు విన్నాడు. అతనిలో అంతర్యుద్ధము ప్రారంభము అయినది. భీముడు అతనికి యమునివలె ప్రత్యక్షము అయినాడు. అతడు తన కొడుకులను చెల్లాచెదరు చేసినాడు. భీముని గదాఘాతమునకు నిలుచువారు కనిపించలేదు. తలా ఒకవైపు పారిపోవుచున్నారు. భీముడు వెన్నంటుచున్నాడు. రక్తపు నదులు పారుచున్నవి. పీనుగులు పోగులు పడినవి. భీముడు ఒక్కడు ఒక్కడే గదగొని వికటాట్టహాసము చేయుచున్నాడు. తన సంతానము సాంతము పోయినది. తాను గాంధారి కన్నీరు మున్నీరుగా ఏడ్చుచున్నారు. ఏడ్చుచున్నారు. ఏడ్చుచున్నారు.
ధృతరాష్ట్రుడు తల ఎత్తినాడు. అతడు మనోలోకము నుండి బయటపడినాడు. సభను విన్నాడు. అతని గుండెదడ తగ్గినది. అతడు భౌతిక ప్రపంచమునకు వచ్చినాడు. అతని గుండెదడ కొంత తగ్గినది. ధైర్యము తెచ్చుకున్నాడు. గంభీరముగా అన్నాడు:-
"పుత్రా! దుర్యోధనా! నీకు నీపరిజనులకు ఈరాజ్యము నందలి సగపాలుచాలు. మిగలిన సగము పాండవులకు ఇచ్చి మనము బ్రతుకుటమేలగును. నాకు యుద్దముతో పనియేమి? మన పెద్దలకు యుద్దము సమ్మతము గాదు. భీష్మద్రోణాదులు సమ్మతముకాని సమరమున పోరరు. ధర్మరాజు మహాత్ముడు. అతనితో కలిసి జీవించుట అందరికి క్షేమము".





