Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"రాజా! నేను శ్రీకృష్ణుని భవనమునకు వెళ్ళినాను. అప్పుడు అర్జునుడు, సత్యభామ, ద్రౌపది అక్కడనే ఉన్నారు. వారు నారాకను ఎరిగినారు. నన్ను పిలిచినారు. ఆదరించినారు. నాకు బంగారు పీట వేసినారు. కూర్చుండ నియమించినారు. నేను నేలమీదనే కూర్చున్నాను. బంగారుపీట మీద చేతులు ఉంచినాను. నేను చేతులు జోడించినాను. ఉభయులకు నమస్కరించినాను. నేను వచ్చిన సంధి ప్రయత్నము గురించి వారికి విన్నవించినాను. అర్జునుడు ఏదో ఆరంభించబోయినాడు. శ్రీకృష్ణుడు వారించినాడు".
"సంజయా! నా మాటలు వినుము. నిండు సభలో అందరు వినునట్లుగా ధృతరాష్ట్రునాకు విన్నవింపుము. వినిపింపుము. మహారాజా! ధర్మజుడు కోపించడు. కోపించైనా నీట నిప్పు పుట్టినట్లు అగును. అది బడబాగ్ని. దానిని ఆపుటకు, ఆర్పుటకు ఎవరును శక్తులు కారు. కౌరవులు ఆ మహాగ్నిని కంటితో చూడనైనలేరు. కావున హస్తినలోని కౌరవులందరు తమ కడపటి కోర్కెలను తీర్చుకుందురు గాక. ప్రాణములను అరచేతులందు ఉంచుకొని యుద్దమునకు నడచి వత్తురుకాక. యుద్ద భూమికి వచ్చి ప్రాణములతో హస్తినకు మరలుట అసాధ్యము. అసంభవము".
సంజయుడు ఆమాటలు చెప్పినాడు. మౌనము వహించినాడు. సభ సాంతము మూగది అయినది. గాంభీర్యము దాల్చినది. పిట్టపీచుమన్న వినవచ్చినట్లున్నది.
"సంజయా!" గ్రుడ్డిరాజు మౌనమును ఛేదించినాడు. "అపజయము ఎరుగనివాడు అర్జునుడు. అందుకే విజయుడు అనిపించుకున్నాడు. అతడు అక్కడనే ఉన్నాడని చెప్పినావు. అతడు ఏమన్నాడు? అది వినగోరుచున్నాను. వినిపింపుము".
సభ సాంతము సచేతనము అయినది. ప్రాణములన్నియు వీనులందు కేంద్రీకృతమయినవి. సంజయుడు చెప్పినాడు:-
"విజయుడు తొణకలేదు. బెణకలేదు. అతనివి ఎఱ్ఱని కన్నులు మరీ ఎర్రనైనవి. అతని నోట అగ్గి కురిసినది".
"సంజయా! సభ సాంతము వినుచుండగా నామాటలు వినిపింపుము".
"సుయోధనుడు మున్ను మమ్ము అగ్గిలోకి తోసినాడు. ఇప్పుడు మేము అడిగిన రాజ్యము ఇవ్వను అనును. అదియే మాకు మేలు. యుద్దమునకు సిద్దమగును. మేము వారిని కార్చిచ్చులోనికి తోసినగాని ధర్మజుని వారు గౌరవించరు".
"భీముడును, నేనును రణరంగమున విజ్రుంభించిన నాడు గాని మా పెద్దన్న కార్యము ఫలించదు. వనవాసమున మా అన్న నేల మీద శయనించినాడు. దుర్యోధనుడు యుద్ద భూమిలో అంపశయ్యమీద పడినప్పుడుగాని వారికి తెలిసిరాదు".
సూనృత మూది బన్నములు సూడక లోన నడంచినట్టి కో
పానల మెండియున్న నిబిడాటవిపై బచరించు తీవ్రదా
వానలు బోలిశాత్రవు చయంబు పయింగవియించినిల్చినం
గాని యుధిష్టిరున్ సరకుగా గొన రాధృతరాష్ట్ర నందనుల్
గదసారించుచు నంత్యకాల విచలత్కాలాకృతిన్ భీముడు
న్మదమాతంగ చయంబు నుగ్గుగ లసన్నానారథవ్రాతముల్
చదియన్ భూరిహయ వ్రజంబు పొడిగా సంరంభితంగాంగుడై
కదియం జూచి బలే సుయోధనుడు భాగంబిచ్చు రాజ్యంబునన్
బాలక్రీడ మహాసుర ప్రకరమున్ భంజింపడే యెప్పుడుం
ద్రైలోక్యంబును భక్తియుక్తి దగ నారాధింపదే యట్టి శౌ
ర్యాలంకారు మహాత్ముదా సరుకు సేయుండచ్యుతున్ మమ్మతం
డేలాకైకొను నాసుయోధనుని యందెగ్గేది యూహింపగన్.
మేము భీష్మునకు, ద్రోణునకు కృపాచార్యునకు నమస్కరింతుము. మా రాజ్య భాగమునకు యుద్దము చేతుము. మాతో యుద్దమునకు ఎంతటివారు వచ్చినను చత్తురు. కౌరవులు మా శస్త్రాస్త్రములముందు నిలువజాలరు. ఏలనన ధర్మము మా పక్షమున ఉన్నది. పన్నెండు సంవత్సరములు వనవాసము చేసినాము. పదమూడవ ఏట అజ్ఞాతవాసము ముగించినాము. మాకు జరిగిన అన్యాయములకు సహించినాము. ఎన్నడును కోపించలేదు. కౌరవులకు అపకారము తలపెట్టలేదు. మేము చేయనున్న యుద్దము సహితము మా రాజ్యభాగమునకు గాను చేయనున్నాము. కాబట్టి మాకు గెలుపు తథ్యము. గెలుపు సత్యము. గెలుపు నిశ్చయము. ఇంద్రాది సుర సహాయులయ్యును ధార్తరాష్ట్రులు గెల్చువారైరేని ధర్మంబుకంటే నధర్మము బలవంతంబైనదియగు. అట్లు అగుట అసంభవము. మేము వాసుదేవునిముందు ఉంచుకొని సాగుదము. కావున యుద్దమున మాకు జయంబు సిద్దంబు. కావున కౌరవ సభలో భీష్మాదులు నిశ్చయించిన రీతి జరుగవలసి ఉన్నది. సుయోధనాదులు ఆయుష్మంతులగుదురుగాక".
సంజయుడు ముగించినాడు. శాంతుడు అయినాడు. కూర్చున్నాడు. ధృతరాష్ట్రుడు విన్నాడు. గంభీరుడు అయినాడు. తలవంచినాడు. సభలో కొందఱు విజయుని మెచ్చినారు. కొందఱు తెగడినారు. గుసగుసలు సంభాషణలు సాగినవి.
"మహారాజా!" భీష్ముడు పలికినాడు. ధృతరాష్ట్రుడు వినుటకు సిద్దపడినాడు. పూర్వము బ్రహ్మ లోకమున ఒక వృత్తాంతము జరిగినది. బ్రహ్మదేవుడు సభ తీరి ఉన్నాడు. ఇంద్రాది దేవతలు ఆసీనులయి ఉన్నారు. అపుడు ఇద్దరు దివ్యులు బ్రహ్మదేవుని ఒరసికొనుచు వెళ్ళినారు. అది బృహస్పతికి వ్చిత్రమనిపించినది. 'ఇంత సభలో నిన్ను లక్ష్యము చేయక సాగిపోయినవారు ఎవరు?' అని బ్రహ్మదేవుని అడిగినాడు. "వారిలో ఒకడు నారాయణుడు. మరొకడు నరుడు. ఒకరు తపోబలము, మరొకరు శౌర్యబలము కలవారు. వారు అన్నియుగములందు ఉందురు. లోకహితార్ధము చరింతురు" అని చెప్పినాడు.





