Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"దేవర పంపగా జని యుధిష్ఠిరునింగని వచ్చినాడ నా
భూవిభుడప్రమేయ గుణపూజ్యుడు మీకు నమస్కరించె సం
భావనసేసె నాకిచటి బంధులనెల్ల దలంచె మీసుఖ
శ్రీవిభవంబులన్ సుతుల సేమము నన్నడి గెం బ్రసన్నుడై"
"ధర్మరాజునకు విషయ భోగములు రుచింపవు. ధర్మము రుచించును. ధర్మములలో అహింస అతనికి మిగుల ఇష్టము. అతడు మానుష బలమును నమ్మడు. దైవ బలమును నమ్ముకున్నాడు. పూర్వాపరములు రెండింటిని నీయందే పెట్టినాడు".
"మహారాజా! నీవు ధర్మజుని గౌరవించవు. నీకొడుకును గౌరవింతువు. దుర్యోధనుడు స్వాధీనుడు కాడు. అతడు దుశ్శాసన శకుని కర్ణుల అధీనుడు. వారు చెప్పినట్లు దుర్యోధనుడు వినును. దుర్యోధనుడు చెప్పినట్లు నీవు వినువాడవు. కాని ధర్మము ప్రకారము నడచువాడవు కావు. కొడుకులను కన్నవారు అనేకులు ఉన్నారు. కాని కొడుకులు చెడుమార్గము తొక్కినపుడు, వారిని మంచి మార్గమున పెట్టుచున్నారు. నీవు అట్లుకాదు. దుష్టుడగు పుత్రునకు లొంగి కార్యాకార్యములు విచారించకున్నావని జనులు నిన్ను తిట్టుచున్నారు".
"నీకొడుకు పాండవులకు పలు కష్టములు కలిగించినాడు. పాండవులు కలకాలము ఓర్చినాడు. ఇప్పుడు వారి కోపమును, ఆవేశమును ధర్మరాజు కూడ అడ్డలేకున్నాడు. వారు దండెత్తి వచ్చిన కార్చిచ్చు వచ్చినట్లగును. హస్తిన అగ్గిపాలగును".
"నీవు నీ కొడుకు మాట వినకుము. పాండవులకు న్యాయము చేయుము. రాత్రి అయినది. ప్రయాణమున అలసి ఉన్నాను. సెలవుతీసుకొందును. వివరములు రేపు వచ్చి విన్నవింతును" అని సెలవు తీసుకొని వెళ్ళినాడు.
ధృతరాష్ట్రుడు సంజయుని మాటలు విన్నాడు. ఆవేదన పడినాడు. అతని మనసు కలవరపడినది. నిద్రరాలేదు. అతడు విదురుని పిలిపించినాడు. విదురుడు వచ్చినాడు.
"తమ్ముడా! విదురుడా!" ధృతరాష్ట్రుడు అన్నాడు. "సంజయుడు వచ్చినాడు. పాండవులు చెప్పినది చెప్పలేదు. రేపు చెప్పుదును అన్నాడు. నా ఎదుటనే నన్ను నానావిధముల దూషించినాడు. వెళ్ళినాడు. నామనసు కలతచెందినది. ధర్మరాజు ఏమన్నాడో ఏమి చేయనున్నాడో అని కలవరపడుచున్నాను. నీవునాకు మనశ్శాంతి కలిగించు మాటలు చెప్పవలసినది".
విదురుడు ధృతరాష్ట్రుని మాటలు విన్నాడు. సమయానుసారముగా అన్నాడు:-
"జనులకు నొడబాటగు విధ
మున నడచుచు లోకనింద్యములు నుడుగుచు మీ
దని యొకని కలిమి కులుకక
మనుజులతో బొంది పొసగి మనుటొప్పు నృపా"
"దేవా! జ్ఞాతులు గుణహీనులైనను విడువందగదనిన సకల గుణసంపన్నులై భగవత్ప్రసాదంబు గోరుచున్న కౌంతేయులన్ దిగవిడువందగునే; యేను నీకు హితంబు గొరెడు వాడనని నిశ్చయించి నా బుద్ధి వినుము. వారల జీవనంబునాకు గొన్నియలంతి పల్లియలైనను దుర్యోధను నొడంబరచి యేర్పరచి తెరంగు పరచిన లెస్సయని చూచెద నతని విడువ వలయునని చెప్పితినే నీ పెనకువంబశ్చాత్తాపంబు పుట్టు దానికప్పుడు ప్రతీకారంబు లేదు కావున నెల్ల భంగుల నియ్యకొని పాండవుల తోడ సంధి చేయవలయు".
నిట్ల చేయువాడ నిదియ కర్జము ధర్మ
మును యశంబు లాభమును దలంప
విదురుడు ధృతరాష్ట్రుని మాటలు విన్నాడు. ఎంతో సంతోషించినాడు. "మహారాజా! చాల కాలమునకు నీ మనసు కార్యవృత్తిలో పడినది. మళ్ళీ కొడుకును చూడగనే మారవలదు. స్థిర నిశ్చయుడవు అగుము. దుర్యోధనుడు వాలినదిశ వాలకుండ ఉండుము. అట్లయిన మావంటి వారు సంతోషింతురు" అని తన నివాసమునకు వెళ్ళినాడు.
ధృతరాష్ట్రుడు రాత్రి గడిపినాడు.
తన కులమున పుట్టినవారు పోరుకు దిగుదురని తెలిసి చంద్రుడు వెలవెలబోయినాడు. తెలవారినది.
హస్తినలో సభ తీరినాడు ధృతరాష్ట్రుడు, గుడ్డిరాజు సంజయుడు తెచ్చిన సందేశము వినుటకు సభ ఆతురతగా ఉన్నది. సంజయుడు వచ్చినాడు. ధృతరాష్ట్రునకు మ్రొక్కినాడు. సభకు నమస్కరించినాడు. ఉపప్లావ్యమున సభలో జరిగిన విశేషములన్నీ వివరించినాడు. "అయిదు తావులు ఇచ్చినను సంధికి సిద్దముగా ఉన్నాడు ధర్మరాజు. జనక్షయమును వంశనాశనమును నివారించదలచినాడు ధర్మరాజు. యుద్దమును ఆపదలచినాడు ధర్మరాజు" అని చెప్పినాడు.
సభలో కలకలము బయలుదేరినది. కొందఱు సంతసించినారు. కొందఱు దుఃఖించినారు. కొందఱు ఆవేశపడినారు. కొందఱు అవహేళన చేసినారు.
ధృతరాష్ట్రుడు సభను శాంతపరచినాడు. "సంజయా! పాండవులు బలవంతులు. పైగా శ్రీకృష్ణుడు సర్వశక్తిమంతుడు. వారి పక్షమున ఉన్నాడు. ఇంతకు వాసుదేవుడు ఏమన్నాడో చెప్పితివికాదు. శ్రీకృష్ణుని మాటలు విన్నవింపుము".





