Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
బలవంతుల నుండి, సంస్కారవంతులనుండి మాత్రమే శాంతి సందేశములు వెడలును. నేటి అంతర్జాతీయ ఘర్షణలో రెండు అగ్ర రాజ్యములు ఉన్నవి. ఒకటి హింసకు కాలు దువ్వుచున్నది. అస్త్రములను పెంచుచున్నది. ఆకాశమును కూడా కబళింప చూచుచున్నది. మరొకటి అస్త్రములను తగ్గించమంటున్నది. మానవజాతిని మారణాయుధముల నుండి కాపాడమంటున్నది.
ఈ ఉభయ అగ్ర రాజ్యములలో ఒకరు కౌరవులు, మరొకరు పాండవులు. వారి కథ భారతమునకు అన్వయించిన సరిపోవును.
5. పురోహితుడు ధృతరాష్ట్రుని సభలో అన్నియు విన్నవించినాడు. సభలో ఏకాభిప్రాయము లేదు. అవునుకాదని తేల్చలేకపోయినారు. శాంతి సందేశముణు బహిరంగముగ కాదనలేరు. యుద్దమునకు దిగుదుమని బహిరంగముగ చెప్పలేరు. శాంతికి అంగీకరించిన తమ పెత్తనము ఊడును. యుద్దమునకు అంగీకరించిన గెలుతుమని నమ్మకము లేదు.
ఇది ఆనాడు కౌరవులకు వచ్చిన సమస్య. ఈనాడు ఒక అగ్రరాజ్యమునకు కలిగిన మింగరాని, కక్కరాణి విషమ సమస్య.
6. "నీకు ఇచ్చునది ఏమియు లేదు. నీవు అడుగరాదు. నీవు శాంతముగా ఉండుము. కయ్యమునాకు దిగవద్దు" ఇది సంజయరాయబారము. దీనికి సంజయ రాయబారమని నానుడి ఏర్పడినది.
ఇది విచిత్రమయిన రాయబారము. ఇందు పొగడ్తలు ఎక్కువ. ఇవ్వదలచినది హుళక్కే. శాంతి, అహింస బోధించుట ఎక్కువ.
కడుపు మండిన వానికి చెప్పు నీతులను మనము నిత్య రాజకీయ జీవ్తమున చూచుచున్నాము. "నీవు తిరుగుబాటు చేయకుము. నీకు తిండి పెట్టము" అనునది ఇందులోని మౌలిక అవినీతి.
"మేము ఆయుధములు పెంచుచుందుము. మీరు ఆయుధము సృష్టించరాదు" అను ఒక అగ్రరాజ్యపు దుష్టనీతి కూడా ఇదియే.
7. అహింస అనిన అన్నింటిని సహించుటకాదని మహాత్ముడు వక్కాణించినాడు. "అహింసయ యుత్తమ ధర్మంబగునట్లయినను వంశదూషకులును లోకకంటకులునునగు పాపాత్ముల నిర్మూలంబుగా జెరచుట ధర్మంబని పెద్దలచేత విందు" అన్నాడు ధర్మజుడు.
అహింస అవలంబించని వానికి ఇతరులకు బోధించు హక్కులేదు.
తమ అధికారమును రక్షించుకొనుటకు అనేక నీతులను వల్లించు ప్రబుద్దులను మనము నిత్యము చూచుచున్నాము. ఆ నీతులు వారికి వర్తించవు.
ఇది కౌరవ నీతి.
8. ధర్మరాజు ఒక ముఖ్య ధర్మమును ఇక్కడ చెప్పినాడు. కౌరవ పాండవులది ఉమ్మడి కుటుంబము. పాండవులు, కౌరవులు అందరిలో పెద్దవాడు ధర్మరాజు. మొదట పుట్టినవాడు ధర్మరాజు. దుర్యోధనాదులు తరువాత పుట్టినవారు. ఆవిధముగా అందరికి అగ్రజుడు ధర్మజుడు. ధర్మజుని మాట పాండవులతోపాటు కౌరవులందరును వినవలసి ఉన్నది. ఇది ధర్మము.
ధృతరాష్ట్రుని తరువాతి వాడు ధర్మరాజు అగును. ధృత రాష్ట్రుడు ధర్మజునిమాట వినవలసి ఉన్నది. దుర్యోధనునిమాట కాదు. ఇది ధర్మము.
ధృత రాష్ట్రుడు భీష్మపితామహుని మాటలే వినలేదు. ధర్మజుని మాటలు వినునా?
ధృతరాష్ట్రునిది పుత్రేషణ. అతనికి ఇతర ధర్మములు అక్కరలేదు.
9. ధర్మరాజు యుద్దమును నివారించదలచినాడు. తమ కొఱకు జనక్షయము చేయదలచలేదు. "ఏవురకు నిలువ దావులయిదిచ్చిన సర్వశాంతియగు" అన్నాడు.
ధర్మరాజు దిగివచ్చినాడు. అర్ధ రాజ్యము అక్కరలేదన్నాడు. తాను కోరిన అయిదు పట్టణములు కూడా వద్దన్నాడు. తాము నిలుచుటకు అయిదు స్థలములు ఇమ్మన్నాడు.
నీతిమంతుని ఉదారతను దుర్వినీతుడు బలహీనతగా భావించును. సామానమయిన ఉదారత కలవాడు మాత్రమే అర్ధము చేసికొనగలడు.
10. ఒక చిన్న విషయము. ధర్మరాజునకు తన బలగపు బలము మీద అంత విశ్వాసము లేదను ఇంచుక సంశయము కలుగకమానదు. భీమార్జునులు భీష్మ ద్రోణాదులను ఎదిరించలేరను ఇసుమంత అనుమానము ధర్మరాజును బాధించుచున్నది.
11. శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతియై తన సర్వశక్తులను పాండవుల కొఱకు వినియోగించినాడు. తానే దూతగా వెళ్ళుదునన్నాడు.
12. సభలో శ్రీకృష్ణుడు, ధర్మరాజు తప్ప అన్యులు మాట్లాడలేదు. అర్జునుడు కొసమెరుపు మెరిపించినాడు.
సంప్రదింపులు
సంజయుడు ధర్మరాజాదులను వీడుకొన్నాడు. హస్తినకు చేరినాడు. అప్పటికి సాయంత్రము అయినది. ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్ళినాడు నమస్కరించినాడు. అన్నాడు:-





