Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    దుర్యోధనుడు దుర్మార్గుడు. అత్యాశాపరుడు. సర్వము తన అధీనమునందే ఉండవలెననుకొనుము. అతడు మమ్ము గుర్తించడు. మా రాజ్యమును గుర్తించడు. మా హక్కులను గుర్తించడు. మా బలమును గుర్తించడు.
    "మేము యుద్దము కోరము. జన క్షయము కోరము. వినాశము కోరము. అశాంతి కోరము. మాకు మా తండ్రి రాజ్యము సగము రావలెను. దానిని సాధించు శక్తి మావద్ద ఉన్నది. అయినను కుల క్షయము మాకు ఇష్టములేదు. యుద్దమును నివారించుటకు మరొక ఉపాయము చెప్పుచున్నాను. వినుము. అక్కడ విన్నవించుము.
    "సగము రాజ్యము ఇచ్చుటకు దుర్యోధనుడు సమ్మతింపడు. మాకు కుశస్థలము, వృక్షస్థలము, వాసంతి, వారణావతము, ఇంద్రప్రస్థము అను అయిదు పట్టాణముల రాజ్యము ఇచ్చిన చాలును. అందుకును దుర్యోధనుడు సమ్మతింపకున్న 'నెందేని నిలువ దావులయి దిచ్చిన సర్వశాంతియగు' ఈ విషయములన్నియు దుర్యోధనునకు తెలియచెప్పుము".
    "దేవా! ధర్మజా!" సంజయుడు అన్నాడు. "నీ చెప్పిన ప్రకారమంతయు అక్కడ విన్నవింతుము. నీకుణు, నీ తమ్ములకును వాసుదేవునకును సంతోషము కలుగు ప్రకరమున ధృతరాష్ట్రుడు జరుపగలడు" యమ చుం బ్రణామంబు సేసిన సంజయునకు ధనంజయుండిట్లనియె:-
        బాలసఖుండవు నాకును
        నీలెస్స దనంబు నేము నీతి విడిచి దు
        శ్శీలురమగుటయు శైశవ
        లీలమొదలుగాగమును దెలియదె నీకున్
    
    బలమత్తా కృతియైన భీముడును శుంభత్కుంభి సంరంభమున్
    నిలిపెన్ నాడును నంకుశంబయి తుదిన్ నేడుందదుద్రేకమున్
    మలుగంజేయ నజాతశత్రుని కృపా మౌగ్ధ్యంబు దాలంగ వా
    రలకేలా నయ విక్రమోచిత విచారక్లేశముల్ సంజయా
    
    అని పలికి ధర్మతనయానుమతంబున సంజయునకు సపరివారంబుగా సముచిత ప్రకారంబున మజ్జన భోజనంబు లొనరించి మాల్యాను లేపనాద్యుపచారంబులు సేయించి మణి భూషణ చిత్రాంబరంబులొసంగి వీడు కొల్పిననతండునుబాండవులను, వాసుదేవుని వీడ్కొని చనియె.
    
                                                       ఆలోచనామృతము
    
    1. శ్రీమహాభారతము మానవ ఇతిహాసము. మానవ మనస్తత్వమును నిశితముగా పరిశీలించి ఒక కథగా, ఒక గాథగా, ఒక చరిత్రగా మలచిన మహాగ్రంథము. యుగములు మారినవి. మానవుని భౌతిక జీవనమున అనంతములైన మార్పులు వచ్చినవి. మారణాయుధములు వెలసినవి. మానవుని వికాసమునకు జరుగుతున్న ప్రయత్నముతోబాటు మానవజాతి వినాశమునకు కూడా ప్రయత్నములు జరుగుచున్నవి. ఇన్ని జరిగినను, జరుగుచున్నను, జరుగనున్నను మౌలికముగా మానవ మనస్తత్వము మారినట్లు కనిపించదు. ప్రేమాభిమానములు, రాగద్వేషములు, ఈర్ష్య, అసూయలు, ఆస్తిహక్కులు, వాటి అపహరణలు వాటికై పోరాటములు ఎప్పటివలెనే ఇప్పుడు కూడా ఉన్నవి. ఉంటున్నవి. ఉంటవి. ఈ నిత్య సత్యము వలననే రామాయణ, మహాభారతాది గ్రంథములు నేటికిని నిత్య నూతనములు. అవి ఏనాటికి నాటి కథవలెనే అనిపించును. నేటి కథవలెనే అనిపించును. మన కథవలనే అనిపించును.
    2. రెండు సమాన శక్తుల ఘర్షణ చరిత్రము అగును. ఈ ఘర్షణ వ్యక్తి జీవితమున, కుటుంబ జీవితమున, సమాజ జీవితమున ఉండును. ఇది సాధారణముగ మంచి చెడుల మధ్య, ధర్మాధర్మముల మధ్య జరుగుచుండును. దీనికి సార్వత్రిక రూపమును ఇచ్చి దానిని అజరామరమయిన గాథగా మలచగలిగిన వారు మహాత్ములు, రచయితలు. వాల్మీకి, వ్యాసుడు ఇట్టి మహాత్ములు. వారు మానవజాతికి మహాగ్రంథములను ప్రసాదించినారు. ఈ రెండింటిలోను చెడుమీద మంచి చేయు దండయాత్ర చెప్పబడినది. రామాయణమున చెడు బయట ఉన్నది. లంకలో ఉన్నది. తన చుట్టు ఒక గిరి గీసుకొని ఉన్నది. భారతమున అట్లుకాదు. అది కుటుంబముననే ఉన్నది. దూరమున లేదు. ఇంటిలోనే ఉన్నది. అంతట వ్యాపించి ఉన్నది. బయటగెల్చుట సులువు. ఇంటిలోని పోరు గెలుచుట కష్టము.
    3. మానవుడు పుట్టినది మొదలు అతనికి కరువు అయినది శాంతి. హింసవలన అతనికి భయము తప్పుట లేదు. స్వరూప స్వభావములందు అంతరము ఉండవచ్చును. కాని ఆధునిక మానవునకు హింసఅలన భయము ఎక్కువ అయినది. అగుచున్నది. నేడు వ్యక్తి జీవితమున, సమాజ జీవితమున, ప్రపంచ జీవితమున హింస వికటాట్ట హాసము చేయుచున్నది. హింస చేయువానికి వివేకము అక్కరలేదు. శాంతికోరువానికి సంస్కారము అవసరము.
    4. శాంతి కొఱకు సంధి కొఱకు ముందు దూతను పంపినవారు పాండవులు. వారు అన్నియు సహించినారు. బలము కలిగి ఉన్నారు. యుద్దమున కౌరవులను నాశనముచేయగల శక్తి ఉన్నది. అయినను వారు జన క్షయమును కోరలేదు. తమ కొఱకు రక్తపు టేరులు ప్రవహింప దలచలేదు. అందువలన పురోహితుని దూతగా పంపినారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.