Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

 కోరికలు ప్రాణి సహజములు. మానవుని కోరికలకు నియమములు ఉన్నవి. వాటిని పాటించుట అవసరము. కుంతి అవేశమునకు లోనయినది. అవేశమున ఆమె సమాజమును మరచినది. తల్లి అయినది. బిడ్డను ఉంచుకోనలేకపోయినది. వదలి వేసినది. తల్లిగా ఆమె మనసు ఎంతో ఘోషించినదో!
    కుంతి సమాజ నియమములను దిక్కరించినది . శిక్ష అనుభవించినది.
    ఈ కధ స్త్రీజాతికి ఒక హెచ్చరిక. ఇట్టి హెచ్చరికలవలననే సమాజము ఒక మార్గమున నడుచుచున్నది. అందువలననే కుంతులు అంతట కనిపించుటలేదు. అరుదుగా కనిపించుచున్నారు.
2. అది సమాజమున సత్పరిణామములు తెచ్చుటకు నిరంతర పరిశోధన జరుగుచున్న రోజులవలె కనిపించును.
 పరాశరునకు సత్యవతికి వేదవ్యాసుడు పుట్టినాడు. అప్పుడు కధ ఇంతగా సాగలేదు. అట్టి విషయము అప్పుడు అతి సామాన్యమయి ఉందును.
 పరిణామములు శీఘ్రగతిన వచ్చినవి. గర్భవతి అయిన కుంతి సమాజమునకు భయపడుచున్నది. నలుగురు నవ్వుదురు అనుకుంటున్నది. తల్లిగా ఇష్టము లేకున్ననూ బిడ్డను గంగలో వదిలింది.
    అది సమాజమున నియమములు బలవత్తరములగుచున్న రోజులు.
3. కర్ణుడు సూతనకు దొరుకుట యాదృచ్చికము. కాని తండ్రులు లేని బిడ్డలను గాలికి వదలరాదు. బిడ్డలు లేనివారు వారి బాధ్యత వహించవలెను. ఈ మహాత్తరము అయిన నీతిని ప్రతిపదించుట రాధను ప్రవేశ పెట్టినాడు వ్యాసుడు.
    ఇది నిత్య సత్యము.

                                                    పాండురాజు కధ


    కుంతిభోజుడు కుంతికి వివాహము చేయడలచినాడు. స్వయంవరమును ప్రకటించినాడు. పాండురాజు స్వయంవరమున కుంతిని పొందినాడు. భీష్ముని అనుమతి పొందినాడు. మద్రరాజు పుత్రిక మాద్రిని కూడ పెండ్లాడినాడు.
    పాండురాజు మహా వీరుడు. అతడు చతురంగ బలమును కూర్చినాడు. దిగ్విజయ యాత్రకు బయలుదేరినాడు. అతని ధాటికి భూమి పడకినది. పర్వతములు కదలినవి. మేఘములు సర్వదిశల వ్యాపించును. అట్లే పాండురాజు సైన్యములు వ్యాపించినవి. పాండురాజు సైన్యములు మేఘములవలె గర్జించినవి. పిడుగులు కురిపించినవి. పాండురాజు రుద్రుడు అయినాడు. కార్చిచ్చువలె వ్యాపించినాడు. అతని ప్రతాపాగ్నిముందు రాజులు నిలువలేక పోయినారు. నలుదిక్కుల రాజులు అతనికి లోంగినాడు. అతనిని ఆశ్రయించినారు. అతనికి గుఱ్ఱములను ఇచ్చినారు. ఏనుగులను అర్పించినారు. బంగారమును, కన్యకలను బహూకరించినారు. ధనురాసులను కానుకలుగా అర్పించినారు. కోట్ల ధనము కప్పముగా ఇచ్చినారు.
    పాండురాజు సకల భూమందలమును ఆక్రమించినాడు. ఇంద్రుని వలె ప్రకాశించినాడు. సకల ధనరాశులతో హస్తినకు వచ్చినాడు. ధృతరాష్ట్రుని అనుమతి పొందినాడు. తెచ్చిన ధనమందు కొంత భీష్మునకు ఇచ్చినాడు. కొంత సత్యవతికి ఇచ్చినాడు. కొంత తల్లులు, అంబిక, అంబాలికలకు ఇచ్చినాడు. కొంత విదురునకు ఇచ్చినాడు. పాండురాజు తెచ్చిన ధనముతో ధృతరాష్ట్రుడు నూరు ఆశ్వమేధములు నిర్వహించినాడు.
    పాండురాజు వినయ సంపన్నుడు. అన్నకు ఇష్టకార్యములు సాధించినాడు. బంధు జనులకు అనుకూలముగా ఉన్నాడు. మిత్రులకు సంతోషము కలిగించినాడు. విద్వాంసులు కరుణించినాడు. సమస్త జనులకు సుఖము కలిగించినాడు. అతడు పూరుని వలె ప్రకాశించినాడు. భరతుని వలె తెజరిల్లినాడు.
    పాండురాజునకు వేటయనిన మక్కువ. ఒకసారి అతడు వేటకు వెళ్ళినాడు. అతని వెంట కుంతి, మాద్రి బయలుదేరినారు. వారు హిమాలయముల దక్షిణ ప్రాంతమునకు చేరినారు. పాండురాజు వేటాడుటలో నిమగ్నుడు అయినాడు.
    ఒకనాడు పాండురాజు వేటాడుచున్నాడు. ఒక మృగమునకు బాణము తాకినది. అది పారిపోయినది. దానిని వెంబడించినాడు. మార్గమధ్యమున ఒక ఇర్రి, లేడి భోగించుచు కనిపించినవి. అయిదు బాణములు వేసినాడు. వాటిని గాయపరచినాడు. మరొక బాణము ఎక్కు పెట్టినాడు. అప్పుడు మగ మృగము ఇట్లన్నది :-
    "రాజా! నేను కిందముడను మునిని. అడవిలో మృగములు రమించుచుండగా చూచినాను. వానివలె రమించవలెనను కోరిక కలిగినది. నా భార్య, నేను మృగములము అయినాము. మేము భోగించునప్పుడు నీ బాణములు తగిలినవి. మరణింపనున్నాము. పారిపోవుటకు శక్తి లేని మృగములను, సంభోగమందున్న మృగములను, ప్రసవింప సిద్దముగా ఉన్నవానిని , వ్యాధులు గల మృగములను వేట యందు వధింపరాదు. నీవు ఆ నియమము దిక్కరించినావు. సంభోగమందున్న మమ్ముల చంపుచున్నావు. కావున నీవు నీ భార్యతో భోగించునపుడు మరణింతువు. నీ భార్యయు నీతో పరలోకము పొందగలదు" అట్లని ఆ మృగములు చనిపోయినవి.
    పాండురాజు మునిశాపము విన్నాడు. హతాశుడు అయినాడు. అతనికి వేట మీద విరక్తి కలిగినది. బ్రతుకు మీద విరక్తి కలిగినది. అతడు మునివృత్తిని అవలంభించినాడు. సర్వసంగమములను విడిచినాడు. సర్వభూతములందు సమచిత్తుడు అయినాడు. ఇంద్రియ వ్యాపారములను విడిచినాడు. మనోవృత్తిని నిగ్రహించినాడు. నిందాస్తుతులను తలచలేదు. శీతోష్ణ భయ చింతలకు లొంగలేదు. స్పర్శరూప రస గంధములకు తావీయలేదు. అతనికి మరణమున భయము లేదు. జీవితమున ఆశ లేదు. పాండురాజు అట్లు మునివృత్తిని అవలంబించినాడు. తపము చేయసాగినాడు.
    పాండురాజు తన భార్యలను హస్తినకు వెళ్ళమన్నాడు. "అరణ్యములు దుర్గములు. తపస్సులు కఠినములు. అందువలన హస్తినకు వెళ్ళుడు" అన్నాడు.
    పాండురాజు భార్యలు భర్త మాటలు విన్నారు. కన్నీరు బొటబొటా రాల్చినారు. అన్నారు:-
    "రాజా! నీ నిశ్చయము గొప్పది. నిన్ను తపముల నుండి మరలింపము. కాని నిన్ను వదలి మేము వెళ్ళము. గట్టిగా వెళ్ళమందువా ప్రాణములను విడుతుము."
    పాండురాజు వారిని వారించినాడు. తనవద్దనే ఉండమన్నాడు. వానప్రస్థము అవలంభించుటకు నిశ్చయించినాడు. నార బట్టలు కట్టినాడు. నియత మనస్కుడయి తపము ప్రారంభించినాడు. కుంతి, మాద్రి కూడ నార బట్టలు కట్టినారు. భోగములను వర్జించినారు. భర్తతో కాలము గడిపినారు.
    పాండురాజు నాగపర్వతమున కొన్నాళ్ళున్నాడు. చైత్రరధమున కొంత కాలము నివసించినాడు. తరువాత హిమవంతము దాటినాడు. గంధమాదనము చేరినాడు. అది దాటినాడు. ఇంద్రద్యుమ్నమను సరస్సును చేరినాడు. అది దాటినాడు. హంస కూటము చేరినాడు. అది దాటినాడు. శతశృంగ పర్వతము చేసినాడు. అచట దేవతలు, సిద్దులు , యక్షులు ఉందురు. వారితో కలిసి ఉన్నాడు. తపము ఆచరించినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.