Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

    సూర్యుడు కుంతిని సమీపించినాడు. ఆమె చేయి పట్టుకున్నాడు. తనతో రమ్మన్నాడు. పోదలమాటుకు పోదమన్నాడు.
    కుంతి కుంచించుకు పోయినది. ఆమెలో ఏభావమున్నదో చెప్పుట కష్టము. అనేక భావములు ముప్పిరిగోన్నవి. ఆమె నెమ్మదిగా చేయి విడిపించుకున్నది. కాస్త దూరమయినది. సూర్యునకు చేతులు జోడించినది ప్రార్ధించింది:-
    "భగవాన్! నీవు ముల్లోకములను ప్రకాశింపచేతువు. ఋగ్యజుస్సమమయుడవు. సర్వసాక్షివి. నన్ను మన్నింపుము. చిలిపిదనమున నిన్ను పిలిచినాను. దుర్వాసుని మంత్రము పరీక్షించుటకు పిలిచినాను. క్షమింపుము. వచ్చిన దారిన వెళ్ళుము."
    "కుంతీ! పిచ్చిదానా!" సూర్యుడు అన్నాడు. ఎందుకు గుబులు ? ఆవేశము పనికిరాదు. ఇది ప్రాణి సహజము. దుర్వాసుని మంత్రము వృధా కాదు. నీవు పిలిచినావు. వచ్చినాను. వలపుల నింపినావు. వలచినాను. నిన్ను కూడక పోలేను. నేను లోకమును కాల్చువాడను. కాదందువా కాలిచత్తును.
    "స్వామీ! ఏమిటది? నేను చిన్నదానను. ఎరుగక పిలిచినాను. నేను కన్యను. నీవలన పుత్రుడు కనినచో తలిదండ్రులు బంధు జనులు నవ్వుదురు. నేను ఒల్లను" అన్నది కుంతి. తప్పుకోనుటకు అడుగు వేసినది.
    సూర్యుడు ఆమె చేయి పట్టుకున్నాడు. తనతో నడిపించినాడు. మంత్ర ముగ్ధవలె అనుసరించినది. సూర్యుడు కుంతికి కన్యాత్వము చెడకుండ వరమిచ్చినాడు. పొదలచాటుకు చేర్చినాడు. ఆమెతో సుఖములు అనుభావించినాడు. కుంతి పరవశ అయినది. గాలిలో తేలినది. ఆకసమున విహరించినది. సూర్యుడు పని తీర్చుకున్నాడు. వెళ్ళిపొయినాడు.
    కుంతి కనులు తెరిచినది. సూర్యుడు లేడు. వెళ్ళిపొయినాడు. కుంతి చూచినది. చుట్టూ అడవి. తనకు కడుపు. గుండె జల్లుమన్నది. అనుభవించిన సుఖము ఆరిపోయింది. నివ్వేరపోయినది. లోకమును తలచుకున్నది కుందినది.
    వచ్చినవాడు సూర్యుడు ఇచ్చినది వరము. ఆమెకు గర్బము అయినది. ప్రసవించినది. పుత్రుని కన్నది. పుట్టినవాడు కర్ణుడు. పుట్టినపుడే సహజ కవచ కుండలములు ఉన్నవి. అతడు తేజోవంతుడు. కర్ణుడు ప్రకాశమానుడయి ఉన్నాడు. అందముగా ఉన్నాడు. ముద్దుగా ఉన్నాడు. ముచ్చటగా ఉన్నాడు. కుంతి కర్ణుని ఎత్తుకున్నది. ముద్దాడింది. మురిసిపోయింది.
    అప్పుడు కుంతికి లోకము గుర్తుకు వచ్చినది. ఇది అడవి. తాను ఒంటరి. వచ్చినవాడు సూర్యుడు బాగున్నది. ఈ బిడ్డడు? బిడ్డను ఎత్తుకొని తాను ఇంటికి పోగలదా? లోకమేమనును? తలిదండ్రులు ముఖమెట్లు చూపును?
    కుంతి చిన్నది. సమస్య పెద్దది. సతమతము అయినది. ఏమియు తోచలేదు. తాను తల్లి , తానే ఈ బిడ్డను కన్నది. తాను కన్నతల్లి. ఈ బిడ్డను వదిలి ఉండలేదు. వదలక ఈ అడవిలో వదిలిపోలేదు. ఆమెలో దుఃఖము పొంగినది. ఏడ్చినది. ఎలుగెత్తి ఏడ్చినది. ఆ ఏడ్పు అడవి వినలేదు. గాలి వినలేదు. గంగ వినలేదు. సూర్యుడు వినలేదు. ఏమి ఎరుగనట్లే ఉన్నాడు. ఎప్పటివలెనే వెలుగుచున్నాడు.
    కుంతి ఒక నిశ్చయమునకు వచ్చినది. బిడ్డను ఎత్తుకున్నది. గంగ ఒడ్డుకు వచ్చినది. గంగను చూచినది. నంగనాచివలె ఉన్నది. పారుచున్నది. బిడ్డను గంగకు అప్పగించ ప్రాణము ఒప్పలేదు. మనసు విలవిలలాడినది.
    కుంతి అటు చూచినది. ఒకపెటిక కనిపించినది. నీటిమీద తెలివచ్చుచున్నది. ఇటువైపునకే వచ్చుచున్నది. కుంతి ప్రాణము లేచి వచ్చినది. ఆ పెట్టె కొఱకు వేచినది. అది వచ్చినది. కుంతి పట్టినది. నిలిపినది. ఆ పెట్టెలో బిడ్డను పెట్టినది. ముద్దాడినది. పట్టుకొని కూర్చున్న వదల బుద్దికాదు. మరల బిడ్డను ఎత్తుకున్నది. ముద్దాడింది. ఒక నిశ్చయమునకు వచ్చినది. బిడ్డను పెట్టెలో పెట్టినది. వదలినది. వెనుదిరిగినది. ఉరికినది. మనసు ఆగలేదు. వెనుదిరిగినది. చెట్టు చాటుగా చూచినది. పెట్టె నీటిలో సాగిపోవుచున్నది. ఊగుచున్నది పోవుచున్నది.
    కుంతి ఏడ్చినది. ఏడ్చినది. ఆమె ఏడ్పు విన్నవారు లేరు. కన్నవారు లేరు. ఆమె కన్నీరు వడిసి పోయినది. ఆమె గుండె బండవారినది. ఆమె అప్పుడు ఇంటి తోవ పట్టినది.
    ఇల్లు చేరిన కుంతికి ఏమయినది?
    అది జనమెరిగిన సత్యము
    అది జగమెరిగిన నిత్యము
    ఒక పెట్టె పెట్టెలో బాలుడు. బాలుడు ఏడ్చుచున్నాడు. పెట్టె సాగిపోవుచున్నది. ఒక సూతుడు అటు వచ్చినాడు. ఏడ్పు విన్నాడు. ఉరికినాడు. గంగలో దూకినాడు. పెట్టెను తెచ్చినాడు. పెట్టెలో బాలుని చూచినాడు. బాలుడు ముద్దుగా ఉన్నాడు. మురిపించుచున్నాడు. సూతుడు మురిసిపోయినాడు. మైమరచిపోయినాడు. బిడ్డను ముద్దాడినాడు. బిడ్డను ఎత్తుకొని ఉరికినాడు. ఆగలేదు. ఇంటికి చేరినాడు.
    సూతుని భార్య రాధ. ఆమెకు బిడ్డలు లేరు. సూతుడు బిడ్డను ఆమె ఒడిలో వేసినాడు. జరిగినది చెప్పినాడు. ఈ బిడ్డ దైవదత్తము అన్నాడు.
    రాధ బాలుని ఎత్తుకున్నది. మురిసిపోయినది. ఆమె కనులు చెమ్మగిల్లినవి. ఆమె చనులు చేపినవి. ఆమె ఆశ్చర్య చకితురాలు అయినది. బిడ్డకు చన్నిచ్చినది. మైమరచినది.
    రాధ తల్లి అయినది.
    ఆమె బిడ్డడు రాధేయుడు అయినాడు.

                                                              ఆలోచనామృతము


1. కుంతి ఆనాటిది మాత్రమూ కాదు. కుంతి భారత కాలముది మాత్రము కాదు. కుంతివంటివారు సకలకాలములందు ఉందురు. ఆమె స్త్రీమూర్తి.
 స్త్రీకి మాతృమూర్తి అగు మహాప్రసాదమున్నది. అది ఒక్కొక్కసారి మహా శాపముగా పరిణమించుచున్నది. ఇందుకు సమాజము ఏర్పరచిన కట్టుబాట్లు కారణము.
 సమాజమునకు కట్టుబాట్లు అవసరము. అది సంపూర్ణ స్వేచ్చను ప్రసాదించదు. అన్ని విషయములందును కొన్ని నియమములు ఏర్పరచును.
 సమాజము నిర్ణయించిన అతి పవిత్ర వ్యవస్థ వివాహము. పెండ్లి లైంగిక అవసరములకు మాత్రమూ కాదు. అది కుటుంబమును ఏర్పరచుటకు. సంతానము కలిగించి వారి అభివృద్దికి తోడ్పడుటకు, ప్రేమాభిమానాలు పెంచుటకు, కుటుంబమును పూలతోటగా చేయుటకు.
 సమాజమునకు సంతానము అవసరము. సంతానమునకు బాధ్యత గల భార్యాభర్తలు అవసరము. భాద్యత ఎరుగని వారి సంతానము సమాజమునకు భారమగును. అందుకే పెండ్లికాక మునుపు పిల్లలు పుట్టరాదు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.