Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

    పాండురాజు ఒకనాడు ముని సంఘములను చూచినాడు. వారు పయనమయి పోవుచున్నారు. వారు బ్రహ్మలోకమునకు పోవుచున్నారని తెలుసుకున్నాడు. భార్యా సాహిటుడయి వారి వెంట నడచినాడు. మిట్ట పల్లములందు నడచినారు. కఠిన మార్గముల పయనిమ్చినారు. మునులు, పాండురాజునకు స్వర్గలోక మార్గము చూపినారు. వారు బ్రహ్మలోకమునకు వెళ్ళినారు.
    పాండురాజు అక్కడ నిలిచి పోయినాడు. అతడు ఆలోచించినాడు. "అపుత్రస్య గతిర్నాస్తి" పుత్రులు లేనివారికి గతులు లేవు. పుత్రులు ఆరు విధములు. 1. వివాహము అయిన భార్యకు పుట్టినవాడు. అతడు ఔరసుడు. 2. భర్త అనుమతిన ఇతరుని వలన కన్నబిడ్డ. అతడు క్షేత్రజుడు. 3. తండ్రి కాని తల్లి కాని ఇచ్చిన బిడ్డ. అతడు దత్తపుత్రుడు. 4. తల్లి కాని తండ్రి కాని అమ్మిన బిడ్డ. అతడు క్రీతపుత్రుడు. 5. రహస్యముగా రంకుపోయి కన్న బిడ్డ. అతడు గూడజుడు . 6. తలిదండ్రుల చేత విడవబడి పెంచబడిన బిడ్డ . అతడు అపవిద్దుడు. తనకు ఔరసపుత్రులు కలుగరు. కాబట్టి ఇతర మార్గములు అవలంబించవలెనని నిశ్చయించినాడు. కుంతిదేవిని చర్చించినాడు :-
    "ముని శాపము విన్నావు. మనకు సంతానము కలుగదు. సంతానము లేనివారికి గతులు లేవు. కాబట్టి దేవరన్యాయమున పుత్రులను కనుము. అందుకు శాస్త్రము సమ్మతించును."
    "రాజా! తెలియని వానివలె మాట్లాడుచున్నావు. మేము భర్తను తప్ప అన్యులను మనసునందయినను తలపము. అట్టి మాకు నీవు ఇట్లు ఆజ్ఞాపించుట తగదు. నీకు ఒక పురాణ గాధ చెప్పుదుము వినుము."
    "పూర్వకాలమందు స్త్రీలు , పురుషులు స్వేచ్చా చారులు. వారికి సంగమ నియమములు లేవు. సకల జంతువుల వలె ప్రవర్తించినారు. స్త్రీలు ఋతుకాలమున దొరికిన మగవానితో రమించినారు. అప్పుడు, స్వ, పర బేదములు లేవు. ఇతర పురుషులతో కూడిన ఆక్షేపణ లేదు."
    "అట్లుండగా ఒక కధ జరిగినది. ఉద్దాలకుడు ముని. అతని భార్యకు శ్వేతకేతువు కలిగినాడు. శ్వేతకేతువు బ్రహ్మతో సమానుడు యోగి, జ్ఞాని, మహాతపస్సంపన్నుడు.
    "ఒకనాడు శ్వేతకేతుని ఆశ్రమమునకు ఒక వృద్ద బ్రాహ్మణుడు వచ్చినాడు. ఉద్దాలకుని భార్యతో సంభోగించ యత్నించినాడు. శ్వేతకేతుడు అది చూచినాడు. కోపించినాడు. అన్నాడు:-
    "ఒయీ! బ్రాహ్మణుడా! నీవు ఇది వరకు గల లోకాచారమును అవలంబించినావు. నా తల్లితో రమించుటకు వచ్చినావు. ఇది ఇప్పుడు ధర్మ విరుద్దము. నేను సహించజాలను. ఇది మొదలు నేను ఒక నియమము గావించుచున్నాను. లోకమందలి స్త్రీలు పర పురుషులను అపెక్షింపరాదు. పర పురుషులతో భోగించరాదు. అట్లు చేసిన మహాపాపము పొందుతురు. ముఖ్యముగా వివాహమయిన స్త్రీలు ఈ నియమమును తప్పక పాటించవలెను."
    "రాజా! శ్వేతకేతుడు బ్రహ్మసముడు. లోకోపకారి. అతని నియమము ధర్మబద్దము. దానిని లోకము అనుసరించుచున్నది. అందువలన భార్యా భర్తలకు స్నేహము వర్ధిల్లును. వారు పరులను తలపెట్టరు. కాబట్టి ఆ ధర్మమును అనుసరించుట మన కర్తవ్యము."
    అందుకు పాండురాజు ఇట్లన్నాడు:-
    "కుంతీ! నీవు చెప్పినది ధర్మము. కాదనను. కాని నేను చెప్పినది అధర్మము కాదు. మునిశాపమున్నది. నావలన నీకు పుత్రులు కలుగరు. మానవుడు పుట్టినప్పుడు నాలుగు ఋణములతో పుట్టును. 1. దేవఋణము: యజ్ఞయాగాదులు చేయుట వలన తీరును. 2. ఋషిఋణము: వేదధ్యయనము , తపము, బ్రహ్మ చర్యము చేత తీరును. 3. పితృఋణము: శ్రాద్ధమూలవలనను, పుత్ర లాభమునను తీరును. 4. మనుష్యఋణము : ధర్మమార్గమున ధనము ఆర్జించుటవలనను, సత్యవాక్యము వలనను తీరును. వీనిలో పితృఋణము తప్ప మిగిలిన వానిని నేను తీర్చినాను. ఆ ఋణము తీర్చుటకు సంతానము అవసరము. దేవరన్యాయము శాస్త్ర సమ్మతము. కల్మాషపాదుని భార్య దేవర న్యాయమున సంతానము పొందినది. నేనును మా అన్న ధృతరాష్ట్రుడు వేద వ్యాసునకు పుట్టినాము. కాబట్టి ధర్మ సందేహము వదులుము. దేవర న్యాయము అవలంబించుము. సంతానము పొందుము.
    కుంతీ పాండు రాజు మాటలు విన్నది. అంగీకరించినది. దుర్వాసుడు తనకు మంత్రోపదేశము చేయుటను గురించి చెప్పినది. ఏ దేవుని ఆహ్వానించవలెనో అజ్ఞాపించుమని పాండురాజును అడిగినది.
    "సకల లోకములు ధర్మ దేవునియందు నిలుచును. ధర్మము ,సత్యము, సకల దేవతలందు ధర్మదేవుడు గొప్పవాడు. కాబట్టి అతనిని ఆహ్వానించుము" అన్నాడు పాండురాజు.
    కుంతీదేవి స్నానమాడినది. శుచి అయినది. పాండురాజునకు ప్రదక్షిణము చేసినది. సమాధి చిత్త అయి కూర్చున్నది. మంత్రము అవలంభించినది. ధర్మదేవుని ధ్యానించినది.
    ధర్మదేవుడు వచ్చినాడు. కుంతికి పుత్రవరము ప్రసాదించినాడు. వెళ్ళినాడు.
    కుంతి గర్భవతి అయింది. సంవత్సరము పూర్తి అయినది. మగశిశువును కన్నది.
    అతడు ధర్మరాజు.
    "సకల జీవులు వాయుదేవుని వలన జీవిన్చుచున్నాయి. అతనిని మించిన బలవంతులు లేరు. అతనిని ఆహ్వానింపుము." అన్నాడు పాండురాజు.
    కుంతీదేవి మంత్రము అవలంభించినది. వాయుదేవుని ద్వానించినది. ఆహ్వానించినది.
    వాయుదేవుడు వచ్చినాడు. కుంతికి పుత్రవరము ప్రసాదించినాడు. వెళ్ళినాడు.
    కుంతి గర్బవతి అయినది. సంవత్సరము పూర్తి అయినది. మగశిశువును కన్నది.
    అతడు భీముడు.
    "సకల దేవతలకు ప్రభువు ఇంద్రుడు. అతనిని ఆహ్వానించుము" అన్నాడు పాండురాజు.
    కుంతీదేవి మంత్రమును అవలంభించినది. ఇంద్రుని ధ్యానించినది. ఆహ్వానించినది.
    ఇంద్రుడు వచ్చినాడు. కుంతికి పుత్రవరము ప్రసాదించినాడు. వెళ్ళినాడు. కుంతి గర్బవతి అయినది. సంవత్సరము పూర్తి అయినది. మగశిశువును కన్నది.
    అతడు అర్జునుడు.
    కాలము గడచినది. కుంతి పుత్రవతి అయినది. మాద్రికి సంతానము లేదు. ఆమె విచార పడినది. దుఃఖించినది. భర్తను సమీపించినది. తనకు సంతానము కలుగు మార్గము చూడవలసిందని ప్రార్ధించినది.
    పాండురాజు విన్నాడు. మాద్రి బాధ గ్రహించినాడు. కుంతిని పిలిచాడు. మాద్రి బాధ వి  వరించినాడు. దూర్వసుని మంత్రము మాద్రికి ఉపదేశించమన్నాడు. కుంతి అంగీకరించినది. మంత్రము ఉపదేశించినది. మాద్రి సంతోషించినది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.