Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"కోపము హాలా హలము వంటిది. దానిని సామాన్యులు మింగలేరు. హాలా హలమును శివుడు, కోపమును నీవు మింగగలరని కీర్తిని పొందినారు. ఆ కీర్తిని నిలుపుకొనుము".
"సంజయా!" ధర్మజుడు పలికినాడు. "ధర్మములు బోధించినావు. మంచిపని చేసినావు. కొన్ని కార్యములు మొదట ధర్మమువలె కనిపించును. విచారించగా అవి అధర్మములగును. కొన్ని మొదట అధర్మమువలె కనిపించును. ఆలోచించగా ధర్మములగును. నీవు నన్ను దూషించదలచిన నాపని అధర్మమని నిరూపించుము. దూషించుము. వంశదూషకులును, లోకకంటకులునునగు పాపాత్ముల నిర్మూలంబుగా జెరచుట ధర్మంబని పెద్దలచేత విందు" మరియట్లుండె సంగ్రామంబు రాజులకు ధర్మంబు గాదని నీవె చెప్పుము. అయినను తర్కవితర్కములు మనకు అక్కరలేదు. కర్తవ్యాకర్తవ్యములు నిర్ణయించువాడు, మనలను శాసింప సమర్ధుడు వాసుదేవుడు ఉన్నాడు. అతని వచనము అవశ్యము అలంఘనీయము".
ధర్మజుని మాటలు విన్నాడు శ్రీ కృష్ణుడు. ఉపన్యసించినాడు. "సంజయా! తీయగా మాట్లాడినావు. నేర్పరివలె మాట్లాడినావు. పాండవులు శాంతము వహించవలె. సహనము వహించవలె. కీర్తి పొందవలె. మంచిదే. కాని వారు రాజ్య భాగమును కోరి కౌరవులను రణరంగమునకు ఈడ్చవచ్చును. కౌరవులను హతమార్చవచ్చును. యుద్దమే పాండవులకు శరణ్యముగా తోచుచున్నది. రాజులకు యుద్దము ధర్మము కాదేమో చెప్పమని నిన్ను ధర్మజుడు అడిగినాడు. నేను చెప్పుచున్నాను. వినుము. రాజులకు యుద్దము కులధర్మము. దానిని విడువరాదు. రాజులు ధర్మమును కాపాడవలసి ఉన్నది. అందుకు దుష్టులను శిక్షించుట వారి ధర్మము అగును. అందుకొరకే శస్త్రాశస్త్రములు సృష్టించబడినవి. సంజయా! ఇక్కడ ఇన్ని నీతులు చెప్పినావు కదా! అవి కౌరవులకు చెప్పరాదా!".
"సంజయా! గతము మరచినావా? మాయాజూదమునాడు, పాండవులను అవమానించిననాడు, ద్రౌపదిని సభకు ఈడ్చి వలువలు విడిచిననాడు ఈ నీతులు ఏమైనవి? పాండవులు ఎంతకాలము సహింతురు? వారు క్షత్రియులు కారా? వారికి పౌరుషము లేదా? వారు వీరులు కారా? కౌరవులను చెండాడలేరా?".
"మహాత్మా! కృష్ణా! ఇన్నింటిని మనసులో పెట్టుకొని మాట్లాడిన సంధి పొసగునా?" సంజయుడు గునిగినాడు.
"సంజయా! అంతటి అవమానములను మింగి రాజ్యము వదులుకొని సంధికి ఒప్పుకొనుట ధర్మమా! దుశ్శాసనుడు సభకు ద్రౌపదిని ఈడ్చుకొని రాగా గోడుగోడున ఏడ్చు ద్రౌపదిని ఓదార్చలేని ధృతరాష్ట్రుడు నిన్ను పాండవుల క్షేమము తెలుసుకొనుటకు పంపించినాడు. సంతోషము నిండుసభలో కర్ణుడు ద్రౌపదిని దుర్భాషలాడినాడు. జూదమున ఓడని మరొక మగనిని వెదుకుకొనమన్నపుడు నీవు సభలో లేకుంటివా? ఇన్ని జరిగిన తర్వాత పాండవులకు కౌరవులకు సంధి కలుగుత అసాధ్యము. అయినను కౌరవుల వద్దకు నేనేవత్తును. తగురీతిగా చెప్పిచూసెదను. వారు నా మాట వినినచో సరి. అట్లుకాకున్నా పాండవుల బాణాగ్ని కన్న ముందే తమ లోభమను చిచ్చు దరి కొనంగదెగిన వారయి పోదురింతయి తలంప".
"దుర్యోధనుడు రోషమయమగు వృక్షము వంటివాడు. దానికి కర్ణుడు స్కంధము. కొమ్మ శకుని. పూలు పండ్లు దుశ్శాసనాదులు. మూల శక్తి ధృతరాష్ట్రుడు".
"ధర్మరాజు ధర్మవృక్షము వంటివాడు. దానికి అర్జునుడు బోది. భీముడు బలమైన శాఖ. నకుల సహదేవులు పూలు, పండ్లు, నేను, బ్రాహ్మణులు, వేదములు, వేరులవంటి వారము. ఈరెంటిలో సారమేదియో, అసారమేదియో గుర్తింపుము".
"కౌరవులు కాననమువంటి వారు. పాండవులు సింహములు. సింహములు లేకున్నా అడవిని పరులు పాడుచేతురు. అడవులు లేకున్న సింహములు ఉండజాలవు. కావున పాండవులు కౌరవులు కలిసిమెలిసి ఉండుట శ్రేయస్కరము. కావున పాండవులకు కౌరవులకు సంధి కలిగించుటకు నేను హస్తినకు వత్తును. వారు నా మాటలు విన్నచో మేలు అగును. కాకున్న యుద్దము తప్పదు. ఈ మాటలన్నియు నీవు ధృతరాష్ట్రునకు విన్నవింపుము".
సంజయుడు శ్రీకృష్ణుని మాటలు విన్నాడు. "మహాత్ములారా! శ్రీకృష్ణుడే హస్తినకు వచ్చిన చెప్పవలసినదేమి? నేను వచ్చిన, కార్యము సఫలమయినది. నేను వెళ్ళివచ్చెదను. నాకు అనుజ్ఞనొసంగుడు" అన్నాడు.
సంజయుని మాటలు విన్నాడు. ధర్మరాజు అన్నాడు:-
"సంజయా! వెళ్ళుము. హస్తినకు వెళ్ళి అక్కడి సభలో పెద్దలను అందరిని అడిగినట్లుగా చెప్పుము. పేరు పేరున వారి క్షేమము అడిగితిని అని చెప్పుము. ఈ సభలో జరిగిన వృత్తాంతములు అన్నియు తెలియపరచుము. మరియు ఇట్లానుము".
"మేము యుద్దమునకు దిగకుండుట కౌరవులకే మేలు. దుర్యోధనుడు అధిక ఆశాపరుడు. ఆశ అగ్నివంటిది. దానిని చల్లార్చుట ఎవరికిని తరముకాదు. అతనికి బుద్ధి చెప్పవలసి ఉన్నది. దుర్యోధనునకు మహావీరులు సాయముగా ఉన్నారు. నిజాము. మాకు ధర్మము సాయముగా ఉన్నది. సకలలోక పూజితుడు శ్రీకృష్ణుని అండ మాకు ఉన్నది. కావున కౌరవులు మమ్ములను గెలుచుట అసాధ్యము. అసంభవము".
నేను భీమాదులకన్నను దుర్యోధనాది కౌరవులకన్నను పెద్దవాడను. అగ్రజుడను. ఉభయులును నామాటను కాదనరాదు. ఇరుపక్షములవారు సంధి చేసుకొనిన నామనసు శాంతించును. ప్రసన్నమగును. మాపెద్దలు సంతోషింతురు.





