Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    మ్రొక్కెద వాసుదేవునకు మోడ్చెద చేతులు సవ్యసాచికిం
    దక్కటి మిత్త్రబాంధవ హిత ప్రియ మంత్రి వయస్య కోటికిన్
    స్రుక్కుచు విన్నవించెద నసూయలు దక్కి యనుజ్ఞ సేయుడీ
    యిక్కరుణాకరున్ శరణ మేనిదె వేడెద గ్రోధశాంతికిన్
    
    అనుచుం బ్రణామ పూర్వకంబుగా బాండవాగ్రజు వదనంబునం జూడ్కి నిలిపి దేవా యుపశమించుట లెస్స యిమ్మెయికిం గురు పితామహుండును సంతసిల్ల నాతనికి మతంబయిన తెరంగు సర్వలోక సమ్మతంబగు ననవిని ధర్మనందనుండిట్లనియె:-
    "సంజయా! నీ ఉపదేశము, నీ మాటలు వింతగా ఉన్నవి. యుద్దమును గురించి నీవు భయపడుచున్నావో, మమ్ములను భయపెట్టదలచినావో తెలియకున్నది. వినయము కనబరచుచున్నావు. నన్ను క్రోధము మానుమనుచున్నావు. నా క్రోధము మాన్పించమని సభకు విన్నవించుచున్నావు".
    "నేను కోపమున మాట్లాడలేదు. స్నేహము తప్ప అన్యము మాట్లాడలేదు. అది నీకు క్రోధమువలె వినిపించినదేమో తెలియదు. కలహము లేక కార్యసిద్ధి కలిగిన కలహమునకు దిగువాడు మూర్ఖుడు. సజ్జనులు సకల ప్రయత్నములు చేతురు. వాటి వలన కార్యము ఫలింపదు. అప్పుడు యుద్దమునకు దిగుదురు. భీమార్జునులు అధర్మ కార్యమునకు దిగరు. యుద్దము దుఃఖకరము కావచ్చును. కాని అనివార్యమయినపుడు తప్పదు".
    "ధృతరాష్ట్రుడు తన కొడుకులను మమ్ములను ఎప్పుడును సమానాముగా చూడలేదు. భేద భావమునే కనబరచినాడు. దుర్యోధనుడు మమ్ములను అనేక బాధలు పెట్టినాడు. ధృతరాష్ట్రుడు తన కొడుకును వారించలేదు. ఇప్పుడు మాకు నీతులు చెప్పుచున్నాడు. బుద్ధులు బోధించుచున్నాడు. స్నేహ భావము ఉభయ పక్షముల ఉండవలెను. అట్లు కానిచో మనసులు కలిసి ఉండుట కుదరదు. ఉన్నది సాంతము మాది, మీరు శాంతము వహించవలె అని చెప్పుట నీతికాదు. చాతుర్యము అగును. స్నేహమునకు చాతుర్యము పనికిరాదు".
    "సంజయా! మాకు రాజ్యము లేదు. అందువలన బలహీనులము అనుకొనుచున్నారు. దుర్యోధనుడు మమ్ములను పిలిచి పూజించి రాజ్యభాగము ఇచ్చునా? అతని చరిత్ర నీకు తెలియనిదా? మాకు తెలియనిదా? ఇక ధృతరాష్ట్రుడు కొడుకు విషము మింగమనిన సంతోషమున మింగును. జూదమున గెలిచిన రాజ్యమునకు ఆశపడరాదని విదురుడు చెప్పినాడు. విన్నాడా? దుర్యోధనుడు కర్ణుడు, శకుని చెప్పినట్లు విన్నాడు. ఇప్పుడు కూడ అతడు వారి మాటలనే వినుచుండును. ఆచరించుచుండును. మంచివారి మాట వినడు. మంచి మార్గము తొక్కడు. నీతులు మాకు కాదు. దుర్యోధనాదులకు చెప్పవలసి ఉన్నది".
    "సంజయా!" ధర్మజుడు కోపించి అన్నాడు. "ముందు వినయముగ మాట్లాడినావు. యుద్దము మానమన్నావు తదుపరి యుద్దమున మేము గెలువలేమని చతురునిగా పలికినావు".
    గాండీవ జ్యారవంబుత్కటమయి పెలుచన్ గ్రమ్మినన్ భీము బాహా
    దండం బేపారి శుంభద్గద జడియుచు రౌద్రంబుగా దోచినన్ వే
    దండం ద్వంద్వంబు మాడ్కిందరిమి కవలు మాద్యద్గతిందాకినన్ జా
    కుండం బోకుండ గౌరవ్యులకు వశమె బిట్టుల్కి మూర్చిల్లకుండన్    
    
    "ద్రోణ భీష్మ కృప అశ్వత్ధామ కర్ణ దుర్యోధనులకు అర్జునుని ప్రతాపాగ్ని తెలియనట్లున్నది. భీష్మాదులు ఆశా పాశములకు కట్టుబడినారు. బలాబలములు ఎరుగరు. అర్జునుని ఎదిరింతురు. కపిధ్వజకాంతికే చత్తురు".
    "సంజయా!" శాంతముగ అన్నాడు. "నీవు గుణవంతుడవు. మావద్దకు వచ్చినావు. శాంతించమన్నావు. శాంతింతుము. ఇదివరకు కౌరవుల దుష్కార్యములను పలుమారులు సహించినాము. ఇప్పుడు కూడ సహింతుము. వారికి ఎటువంటి అపకారము చేయుటకు తలపెట్టము. మా మాట నమ్ముము. ధృతరాష్ట్రుని నమ్మింపుము. మాతండ్రి, ఆ ధృతరాష్ట్రుడు మమ్ములను
            రండని పిలువ బనిచి పా
            లిండని కొడుకులకు చెప్పి యింద్రప్రస్థం
            బొండెను వేరొక పట్టణ
            మొండెను మాకిచ్చి యనుపు టుచితముకాదే
    అందువలన పోరు కలుగదు. కౌరవులు, మేము స్నేహముగా ఉందుము. ధృతరాష్ట్రునకు అనంతమయిన కీర్తి లభించును".
    ధర్మరాజు మాటలు విన్నాడు. సంజయుడు అన్నాడు.
    "ధర్మరాజా! నీవు చాల చెప్పినావు. అయినను నాకు తృప్తి కలుగలేదు. నీవు శాంతగుణ సముద్రుడవు. సహనమున నిన్ను మించినవారు లేరు. నీకు తెలియని ధర్మములులేవు. అయినను విన్నవింతును".
    "అహింసను మించిన ధర్మము లేదు. కౌరవులు రాజ్య భాగము ఇవ్వకున్నను నీవు యుద్దమునకు పూనుకొనరాదు. యుద్దమున లభించిన నెత్తుటి కూటి కంటే బిచ్చపు  కూడు మేలు. నీవు రాజసూయము చేఇస్నావు. దేవతలను మెప్పించినావు. ధర్మమూర్తివిగా నీకీర్తి సకల లోకములకు వ్యాపించినది".
    "కౌరవులు నీ రాజ్యమును గుంజుకున్నారు. మిమ్ములను అవమానించినారు. అయినను నీవు కోపించలేదు. ఆగ్రహించలేదు. ఆనాడు శాంతుడవయి ఇప్పుడు యుద్దమునకు పూనుట మంచిది కాదు. ఇప్పుడు క్రూర కర్మకు దిగుదువా?యుద్దము చేతువా? బంధుజనులను హతమార్తువా? అందువలన నీకు సుఖము కలుగునా? కలిగినను అది స్థిరమగునా?"




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.