Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
రుద్రునకునైన నోర్వరాని
ధర్మపుత్రుకోపమునకు దలకవలదె?
అని పలికి సంజయు దిక్కు మొగంబై యెల్లవారును విననిట్లనియె:-
"నీవు ధర్మరాజు వద్దకు వెళ్ళుము. అతడు పేరోలగమున ఉన్నపుడు దర్శించుము. అతనికి, అతని తమ్ములకు బంధువులకు సంతోషము కలిగించునట్లు మాట్లాడుము
నెయ్యము వాటించి కడుం
దియ్యమెసగ నలుకలెల్ల దీరునటులుగా
గయ్యమును తలపులోనుగ
నియమ నందనుండు మానునట్టి తెరగునన్
శాంతిప్రకారంబునంగార్యంబు నడపి యొక్కటియై మనుట యెడ గూర్చి రమ్ము రథంబెక్కి పొమ్మని తగిన తెరంగున" వీడ్కొలిపెను.
సంజయుడు ఉపప్లావ్యము చేరినాడు. ముందు శ్రీకృష్ణార్జునులణు కలిసినాడు. ధర్మరాజు సభాచేసి ఉండగా వెళ్ళినాడు. ధర్మజుడు సంజయుని గౌరవించినాడు. ఆసనము ఇచ్చి తన పక్కన కూర్చుండ పెట్టుకున్నాడు. అప్పుడు సంజయుడు "ధర్మజా! నా భాగ్యవశమున నిన్ను దర్శించుకొనకలిగినాను. మీ తండ్రి ధృతరాష్ట్రుడు మీ అందరి యోగక్షేమములు తెలుసుకొనుటకు నన్ను నీవద్దకు పంపినాడు" అన్నాడు.
"సంజయా!" ధర్మరాజు అన్నాడు. "మా తండ్రి నిన్ను మావద్దకు పంపినాడు. అందుకు కృతజ్ఞతలు. అక్కడ అతని పుత్రులు, పౌత్రులు క్షేమమే కదా! ప్రజలు సంతోషముగా ఉన్నారా? ద్రోణాచార్య, కృపాచార్య, అశ్వత్ధామలు కుశలమేనా? మా పితామహుడు భీష్ముడు క్షేమమా? కౌరవులు అతని మాటకు ఆదరము ఇచ్చుచున్నారా?".
"సంజయా! కౌరవులు అర్జునుని అవిక్రమ పరాక్రమమును తలతురా? భీముని అనితర బలపరాక్రమములను గుర్తుంచుకుందురా?నకుల సహదేవుల యుద్ద విద్యా నైపుణ్యమును ఎన్నడయిన జ్ఞప్తికి తెచ్చుకుందురా? కౌరవులకు వారి ఘోషయాత్ర గుర్తున్నదా? వారు గంధర్వులచేత పడిన ఆపదలను మరువలేదు కదా!".
"సంజయా! మధ్యస్థులముగా మాట్లాడుకుందము. అర్జునుని ఎదిరించి, ప్రాణములు దక్కించుకొని బయటపడగల మొనగాడు ఉన్నాడా? దుర్యోధనుని ఇంట కర్ణుని పెత్తనము సాగుచున్నదా?".
అనిన విని సంజయుండు సవినయముగా నిట్లను గురురాజునొద్ద నవినీతులు, నీతిమంతులు, సత్త్వసంపన్నులు, దురహంకారులు మరియు వివిధ ప్రకారులునయి బెరసి యుండుదురు వారొకళ్ళోకళ్ళ మాటలంబోయెడు వారు గారు, కావున వరినంతయనంబని లేదు. నా విన్నపంబు చిత్తగింపుము.
"ధర్మజా! నీవు శాంత చిత్తుడవు. నిర్మల మనస్కుడవు. మంచి మనసున పొందు గూర్చదలచినావు. ఇంతకుముందు లేకున్నను ఇక ముందు అందరికి క్షేమము కలుగును. నీవు శాంత చిత్తుడవు అయినచో ఇకముందు కౌరవులకు మేలుకలుగును. నీవు ధర్మము ఎరిగినవాడవు. ధర్మబుద్ధి కలవాడవు. నీకు శత్రువులు లేరు. నీవు అజాత శత్రుడవు. నీ కీర్తి సకలలోకములందు వ్యాపించి ఉన్నది. ప్రజలు ఎల్లప్పుడు పాండవుల పరాక్రమమునే తలచుచుందురు. పాండవులు ధర్మము తప్పరు అని ప్రజలు వేనోళ్ళ కొనియాడుచున్నారు".
"ధర్మజా! నీవు, నీ నలుగురు తమ్ములు, వాసుదేవుడు ఉన్నపుడు ధృతరాష్ట్రుడు కొన్ని మాటలు విన్నవింపు మన్నాడు. విన్నవింతును" అన్నాడు సంజయుడు. సభ సాంతము అతని మాటలు వినుటకు నిశ్చలమైనది. మాటలు చెప్పుటకు సంజయుడే మనసులో ఉలికినాడు.
సంజయుడు శ్రీకృష్ణునకు నమస్కరించినాడు. భీమార్జున నకుల సహదేవ ధృష్టద్యుమ్న ద్రుపద విరాటులను వినయముగా చూచినాడు. మాటలు సాగించినాడు:-
"ధర్మజా! ధృతరాష్ట్రుడు శాంత చిత్తుడు అయి ఉన్నాడు. నన్ను పంపినాడు. ఈ మాటలు చెప్పమన్నాడు".
"సంధి మంచిది. యుద్దము చెడ్డది. మీకు అన్ని ధర్మములు తెలియును. కావున కౌరవులతో యుద్దము చేయరాదు. యుద్దము మంచిదికాదు. అందు గెలుపు నమ్మకముకాదు. గెలిచినను సుఖములేదు. యుద్దమందు సకల బాల వృద్దులను చంపుదువా? అట్లు చంపి గెలిచినను సుఖములేదు. దుర్యోధనుడు అవివేకి. చెప్పినమాట వినడు. నీవు వివేకవంతుడవు. యుద్దము వలన కలుగు నాశనమును ఎరుగుదువు. కావున యుద్దము మానుము. శాశ్వతమయిన కీర్తిని పొందుము".
"యుద్దము జరిగినచో నీకు వాసుదేవుడు పెట్టని కోటవలె ఉన్నాడు. భీమార్జున నకుల సహదేవులు తక్కువవారు కారు. కౌరవ పక్షమునందు భీష్మ, ద్రోణ, కృపాచార్య, కర్ణ, శల్యులున్నారు. వారిని గెలుచుట ఎవ్వరికిని సాధ్యముకాహ్డు. కౌరవులు, మీరు అన్నదమ్ములు. అన్యోన్య కలహములు మంచివికావు. ఉభయపక్షములకు మేలుకోరువారిని సంప్రదించుము".
అని పలికి సూతనందనుండు గొలువు గలయంగనుంగొని





