Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
ధర్మరాజు ఉపాయము చేసినాడు. పెద్ద ఎత్తు వేసినాడు. శల్యుని కౌరవ పక్షమందే ఉండమన్నాడు. కాని కర్ణుని నిర్వీర్యుని చేయమన్నాడు. శల్యుడు మానసికముగా పాండవులవాడు. భౌతికముగా కౌరవులవాడు. శల్యుని సైన్యము కౌరవపక్షమే అగును. కాని వారు కౌరవ విజయము కోరుచున్నారా! అని.
ధర్మరాజునకు ఇది గొప్ప విజయము.
3. ఇది ధర్మజునకు న్యాయమేనా? కాకపోవచ్చును. పాండవులకు సాయము చేయుటకు వచ్చు వానిని తనవైపు మరలించుకున్న దుర్యోధనునిది న్యాయము అగునా?
అన్యాయమును అన్యాయముతో కూడ ఎదిరించవచ్చును అనుకొత్త నీతిని ఇక్కడ ధర్మరాజు అనుసరించినాడు.
అన్యాయమునకు, అధర్మమునకు లొంగుట ధర్మము కాదు. వాటిని ఎదిరించుటయే ధర్మమగును. ఇది సకల మానవాళికి, సర్వకాలములందు ఉపయుక్తమయిన నీతి.
4. శల్యుడు చెప్పిన కథ సందర్భోచితము. అంతేకాక అందులో అనేక మూల విషయములు ఉన్నవి.
(i) ఇంద్రుడు హత్యలు చేసి పాప కార్యములు చేసినాడు. ధర్మరాజు జూదమాడి పాప కార్యము చేసినాడు.
(ii) ఉభయులకును అది పాపకార్యమని తెలియును.
(iii) ఎంతటి గొప్ప వానికి అయినా తెలిసి చేసిన దుష్కార్యపు ఫలితము అనుభవించవలసినదన్న శాశ్వత సత్యమును ప్రతిపాదించినాడు.
(iv) ఇంద్రుడు పారిపోయి అజ్ఞాతము చేసినాడు. ధర్మజుడు స్వచ్చందముగ చేసినాడు. అది వారి కార్య,ములలోని అంతరము.
(v) ఇంద్రుడు స్వార్దమునకు హత్యలు చేసినాడు. ధర్మజునిలో స్వార్ధము లేదు. అందువలన విధి ధర్మజుని విషయమున ఇంద్రునకు వలె కాఠిన్యము వహించలేదు.
vi) రెండు సందర్భములందును భర్తలు చేసిన పనులకు భార్యలు బాధలు అనుభవించినారు.
vii) ఇంద్రుడు గెల్చుటకు అతని బాల దర్పములు కారణములు కావు. నహుషుని దుర్మార్గము కారణము. దుర్యోధణుని గెలుచుటకు దుర్యోధణుని దుర్మార్గమే కారణమగును. శల్యుని తనవైపు తిప్పుకొనుట దుర్యోధనుడు చేసిన ప్రస్తుత దురన్యాయము.
5. "నహుషుని కథలో అనేక గొప్ప విషయములు ఉన్నవి.
(i) వ్యాస మహర్షి దేవతలు, మానవులు, రాక్షసులు వేరు వేరు అను భావము చూపలేదు. దేవతలు మానవులకు, మానవులు దేవతలకు సాయపడిన అనేక సందర్భములు భారతమున ఉన్నవి.
(ii) ఇంద్రుడు దేవతలకు రాజు. అతడు ధర్మమునకు అతీతుడు కాడు. అకార్యము చేసినాడు అనుభవించినాడు.
(iii) నహుషుడు మానవమాత్రుడు. ధర్మాత్ముడు. కావున దేవతలే అతనిని తమకు రాజునుగా చేసుకున్నారు.
(iv) గుణమునుబట్టిగాని జాతినిబట్టి ఎవరును గొప్పవారు కారని నిరోప్పించినాడు వ్యాసుడు.
(v) పదవి ఎంతటి వానిని అయినా పతనమునాకు దారితీయును అనుటకు నహుషుడు నిత్య నిదర్శనము.
(vi) సమాజమున దుర్భలులు అయినవారు స్త్రీలు, మేధావులు. ఏ ప్రభుత్వమయినను ఈ ఉభయ వర్గాములను కాపాడవలసి ఉన్నది. వారిని దూషించిన వాడు ఎంతటి బలవంతుడయినను కూలక తప్పదు. ఇందుకు రావణుడు చక్కని నిదర్శనము.
(vii) నహుషుడు స్త్రీని అవమానించినాడు. మరొకటి భార్యను ఆశించినాడు.
(viii) అధికార మదము నహుషుని గుడ్డివానిని చేసినది. బృహస్పతి వంటి మేధావిని నిరసించినాడు. అతడు తనకు బానిస అన్నట్లు వ్యవహరించినాడు.
(ix) మునులు, ఋషులు, మేధావులు. వారిని దూషించినాడు. అవమానించినాడు.
(x) నహుషుని రాజును చేసినది దేవతలు. అతనిని పడగొట్టినది అగస్త్యుడు. అగస్త్యుడు మానవ మాత్రుడు. దేవతలు చేసిన తప్పును మానవులు సరిదిద్దినారు.
మానవులను అంత మహత్తరులను చేసిన వాడు వ్యాసుడు.
6. ఇంద్రుడు తన పదవి కోసము చూచుకున్నాడు. తన వాళ్ళను బాధించలేదు.
7. ఒక్కొక్క సారి మనము తెచ్చి నెత్తిన పెట్టుకున్న ప్రభువుల కంటే, పూర్వము ఉండినవారే మంచివారిగా ఉందురు. ఇందుకు చరిత్రలో అనేక నిదర్శనములు ఉన్నవి.
సంధి ప్రయత్నములు
ద్రుపదుడు తన పురోహితుని హస్తినకు పంపినాడు. పురోహితుడు హస్తిన చేరినాడు. ధృతరాష్ట్రుని దర్శించినాడు. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్ధామ విదురుల ఇండ్లకు వెళ్ళినాడు. వారితో మాట్లాడినాడు.





