Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
శల్యుడు నహుషుని కథ వినిపించినాడు. ధర్మరాజుతో అన్నాడు:-
"ధర్మజా! ఇంద్రుడు అనేక కష్టములు పడినాడు. అజ్ఞాతవాసము చేసినాడు. తిరిగి రాజ్యమును పొందినాడు. సుఖించినాడు. దేవేంద్రునికే ఇక్కట్లు తప్పలేదు. మానవ మాత్రులకు తప్పవు. దుర్యోధనుడు నహుషుని వలె నశించును. ఇంద్రుని వలె నీవు నీ తమ్ములతో సకల రాజ్యలక్ష్మిని అనుభవించగలవు. ఇది నిశ్చయము".
"మామా! శల్యా! నీవు మంచి కథ వినిపించినావు. ఆ కథ విన్నాను. నా మనసు శాంతించినది. నీవు మావాడవు. కాబట్టి ఇంతమంచి మాటలు చెప్పినావు" అని ధర్మరాజు శల్యుని కీర్తించినాడు. అతనికి స్నాన భోజనాదులు ఏర్పాటు చేసినాడు.
శల్యుడు ప్రయాణమయినాడు. ధర్మరాజాదులు అతనివెంట వెళ్ళిసాగనంపినారు. అతనిని పంపి తిరిగి వచ్చునపుడు ధర్మరాజు "రణములోన మీరు రాధేయు బలుకుట మరవకుండ వలయు మమ్ముదలచి" అని వెడుకున్నాడు.
శల్యుడు ధర్మజుని మాటలు విన్నాడు. అతనిని ఊరడించినాడు. ఆలింగనము చేసుకున్నాడు. సైన్య సమేతముగా శల్యుడు హస్తినాపురమునకు సాగిపోయినాడు.
సాత్యకి ఒక అక్షౌహిణి సైన్యముతో ఉపప్లావ్యమునకు వచ్చినాడు. అంత జేదిపతియగు ధృష్టకేతుండును జరాసంధ నందనుండగు సహదేవుండును జెరొక యక్షౌహిణి తోడం జనుదెంచిరి. సహోదరులేవురగు కేకయాపతులు నేకా క్షౌహిణీ సమేతులై యేగుదెంచిరి. ద్రుపదుడు ఒక అక్షౌహిణి సేనను తెచ్చినాడు. విరాటుడు తన పుత్ర సహోదర సహితముగా పర్వతరాజును చేర్చుకొని ఒక అక్షౌహిణి కూర్చినాడు. పాండ్య విభుండులోనుగా బలుదెసలనుండి వచ్చిన బలంబొక్క యక్షౌహిణికిం గలిగియొప్పె.
ఏడ క్షౌహిణులిమ్మెయి
గూడెం బాండు నృపసుతుల గ్రూరాహవసం
క్రీడా వినోదమునకుం
దోడుపడంబూని యతి కుతూహల వృత్తిన్
ఇవ్విధంబునం గూడి పెరిగి యుధిష్టిరు సైన్యంబు గయ్యంబునకుంగాలు ద్రువ్వుచు నుండెనంత నక్కడం గిరాత కాంచన సైన్య నిచయంబులం గూర్చికొని సమరంబునకు సమరి యొక్క యక్షౌహిణిగల భగదత్తుండు సుయోధనుంగలసె భూరి పరాక్రమవంతుండయిన శల్యుండును నేకాక్షౌహిణీ సమేతంబుగా నేతెంచెను. వారలయట్లు సన్నద్ధులై, కాంభో జనాథుండైన సుదక్షిణుండను యవనేశ్వరుండును వచ్చె, నత్తెరంగున సమకట్టి జయద్రథ ప్రముఖులైన సింధు సౌవీర నరపతులరుగుదెంచిరి. మాహిష్మతీపతియగు నీలుండును యాదవ వీరుండగు కృతవర్మయు నవంతీశ్వరులు సోదరులునగు విందానువిందు లిరువురునుం బలుదెసల నుండి వచ్చి కూడిన వాహినులు మూడక్షౌహిణులకుంగలిగె ధార్త రాష్ట్రులకుందోడుపడం బూనినయవి పదునొకండ క్షౌహిణులయ్యె.
సవరణల నొప్పియని బాం
డవ బలముల మార్కొనంగ గడంగుచు నత్యు
త్సవమున బేర్చిన సేనల
కవకాశములేదు విడియ హస్తినపురమునన్
హస్తినలో దొరలు నిలుచుటకు స్థలము లేకపోయినది. అది చూచి కౌరవనాథుడు సంతసించినాడు. వారి వారి సైన్యములను వేరు వేరు చోట్ల నిలుచుటకు నియమించినాడు. ఇత్తెరంగున గురజాంగలంబున రౌహిత కారణ్యమున మరుదేశంబున నహిచ్చత్రంబున గాల కూటంబున, గంగా కూలంబున వారణావతంబున వటస్థానంబున విచ్చలవిడి విడిసి ధనధాన్యాది సమస్త వస్తువుల కలిమింజేసి యెలమి మిగిలియుండె.
ఆలోచనామృతము:-
1. రాజుల పెండ్లిండ్లు రాజకీయములు. ఈ విషయము ద్రౌపది, సుభద్ర, ఉత్తర వివాహ సందర్భములందు గ్రహించినాము. రాజుల బంధుత్వములు కూడ రాజకీయములే.
పాండవులకు యుద్దమందు సాయపడుటకు వచ్చిన వారిలో చాలమంది బంధువులే.
ఆడపిల్లలవైపు వారు ఎక్కువ సాయపడినారు. ద్రుపదుడు, శ్రీకృష్ణాది యాదవులు, విరాటరాజు ఇట్టివారు.
శల్యుడు మద్రేశుడు. మాద్రి పాండురాజు రెండవ భార్య. నకుల సహదేవులకు తల్లి. పాండురాజుతో సహగమనము చేసిన సాధ్వి. శల్యుడు మాద్రికి సోదరుడు. ఆవిధముగా పాండవులకు మేనమామ. కావున అతడు పాండవులకు సాయము చేయుట సహజము.
శల్యుడు బలవంతుడు. అతడు పాండవులకు సాయపడరాదని కుట్ర పన్నినాడు దుర్యోధనుడు. శల్యుని సంతోష పెట్టుటకు ఎన్నో ఏర్పాట్లు చేసినాడు. శల్యునితో వాగ్ధానము సాధించినాడు దుర్యోధనుడు.
రాజకీయ కార్యములను సాధించుటకు విందులు వినోదములు ఏర్పాటు చేయుట ఈనాటికి జాతీయ, అంతర్జాతీయ రంగాలలో అమలులో ఉన్నది.
2. ధర్మరాజు ప్రతిక్రియ ప్రారంభించినాడు. దుర్యోధనుడు లక్క ఇంటికంటే ముందునుంచే పాండవులకు ఆపదలు కల్పించినాడు. పాండవులు అన్ని సందర్భములందును తమ రక్షణకే చూచుకున్నారు. ఇప్పుడు ప్రతిక్రియ ప్రారంభము అయినది.





