Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    ఇంద్రుడు, శచి ఒకరిని చూచి ఒకరు ఆనందమున పొంగిపోయినారు. గొంతులు పూడిపోయినవి. కొంతసేపు మాట పెకలలేదు.
    "శచీ! నీవు....ఇక్కడికి....ఎట్లు వచ్చితివి? ఏల వచ్చితివి?....ఎవరు తెచ్చిరి?"
    "స్వామీ! అదంత పెద్ద కథ. నహుషుడు దురాత్ముడు. నన్ను కోరినాడు. మీరు రావలె. వానిని ఓడించవలె. నన్ను కాపాడవలె" అని జలజల కన్నీరు రాల్చినది.
    "శచీ!" ఇంద్రుడు శచిని దగ్గరకు తీసుకున్నాడు. తల నిమిరినాడు. ఓదార్చినాడు. "శత్రువు బలవంతుడుగా ఉన్నాడు. కాలము కొఱకు వేచి ఉండవలెను. ఉపాయమున మాత్రమే అతనిని ఓడించవచ్చును. శచీ! అది నీవలననే సాధ్యమగును" అన్నాడు.
    "స్వామీ! నావలన సాధ్యమయిన సెలవియ్యండి చేతును".
    "నీవు నహుషుని దగ్గరికి వెళ్ళవలెను. 'నీవు నన్ను పొందవలెనన్న మునులు వాహనముగా నావద్దకు రావలెను' అని కోరుము. అతడు ఆవిధముగా చేసిన పతనమగును".
    శచి అందుకు సమ్మతించినది. ఆమె నహుషుని వద్దకు వెళ్ళినది. తన కోరిక తెలియపరచినది. "నీవు నన్ను పొందవలెనన్న మునులు వాహనముగా నావద్దకు రావలెను. అప్పుడు నేను నీదాననగుదును. నహుషుని దాననగుదును" అని నవ్వినది.
    నహుషుడు శచీదేవి నవ్వులో కరిగిపోయినాడు. "నీకోరిక తీర్చెదను. సప్తరుషులచే మోయించుకొని వచ్చెదము. నీకు ఆనందము కూర్చెదను" అన్నాడు. నహుషుడు మహాముని సంఘములను పిలిపించినాడు. తాను అందలము ఎక్కినాడు. మహామునులతో మోయించినాడు. అన్ని దిక్కులయందు సంచరించినాడు.
    ఇది ఇట్లుండగా బృహస్పతి ఇంద్రుని జాడ తెలుసుకొనుటకు అగ్నిదేవుని ప్రార్ధించినాడు. అగ్ని దేవుడు అంతట వెదకినాడు. సరస్సునందు తామర తూడున దాగిన ఇంద్రుని కనుగొన్నాడు. బృహస్పతి మునులను తీసుకొని ఇంద్రుని వద్దకు వెళ్ళినాడు. యముడు, వరుణుడు, కుబేరుడు, చంద్రుడు కూడ అక్కడికి చేరినారు. వారందరిని చూచినాడు. ఇంద్రుడు బయటకి వచ్చినాడు.
    "ఇంద్రా!" బృహస్పతి అన్నాడు. "నీవు విష్ణుమాయ వలన వృత్రుని వధించినావు. విష్ణుని ఆజ్ఞవలన అశ్వమేధము చేసినావు. ఇప్పుడు నీవు పవిత్రుడవు అయినావు. బలవంతుడవు తేజోవంతుడవు అయినావు. నహుషుడు తనపాపకార్యములచే తేజోహీనుడు అయినాడు. ముని సంఘములచే తన పల్లకి మోయించి పతనమయినాడు. నీవు అమరావతికి బయలుదేరుము. ఇది వరకే ఓడి ఉన్న నహుషుని ఓడింపుము. స్వర్గ సామ్రాజ్యమును  పాలించుము".  
    నహుషుని గెలుచు ఉపాయమును గురించి ఇంద్రుడు యమ, వరుణ, కుబేర, సోములతో సంప్రదింపులు జరిపినాడు. అదే సమయమునకు అగస్త్యుడు అక్కడికి వచ్చినాడు. "నహుషుడు పదభ్రష్టుడు అయినాడు. ఇంద్రా! వచ్చి సింహాసనము అధిష్ఠించుము" అన్నాడు.
    ఇంద్రుడు ఆశ్చర్యపడినాడు. అగస్త్యుని ఆదరించినాడు. "మహర్షీ! నహుషుడు ఏరీతిగా పదభ్రష్టుడు అయినాడు వివరించవలసినది" అని సవినయముగా అడిగినాడు.
    అగస్త్యుడు చెప్పినాడు.
    "నహుషుడు ముని సంఘములతో తన పల్లకి మోయించినాడు. ఆ అందలమున అనేక చోట్లకు తిరిగినాడు. ఒకసారి మహర్షులు అందలమున ఉన్న అతనిని ఒక ప్రశ్న అడిగినారు. గోసంప్రోక్షణమున బ్రాహ్మణ్యములయిన మంత్రములు చెప్పబడి ఉన్నవి. అవి నీకు ప్రమాణములు అగునా? కాదా?" నహుషుడు తనకు అవి ప్రమాణములు కావు అన్నాడు. అప్పుడు నేను "సర్వ సమ్మతములయిన మంత్రములనే కాదందువా తులువా?' అని అతనిని ఎదిరించితిని. నహుషుడు అది సహించలేక  పోయినాడు. నా తలను తన్నినాడు. నాకు సహించరాణి కోపము వచ్చినది. వెంటనే అందలము విడిచినాము. నహుషుడు నేల కూలినాడు.
    "ఓరీ దురాత్మా! నహుషా! మునులను బానిసలను చేసినావు. మంత్రములణు దూషించినావు. నన్ను అవమానించినావు. నీవు ఇంద్రపద భ్రష్టుడవు అగుము. భూలోకమున సర్పముగా కలకాలము పడిఉండుము" అని శపించినాను.
    "నహుషుడు నేలకూలినాడు. లేచినాడు. వడకిపోయినాడు. చేతులు జోడించినాడు. శాపమును మరలింపుమని వేడుకున్నాడు. కాళ్ళ, వేళ్ళ పడినాడు. కన్నీరు కార్చినాడు. నేను అనుగ్రహించినాను. రానున్న కాలమున ధర్మరాజు జన్మించగలడు. అతనికి శత్రువులు ఉండరు. అందువలన అతడు అజాతశత్రువు అనబడును. అతని దర్శనమున నీకు శాప విముక్తి కలుగును. అన్నాను. ఇంద్రుడు పాముగా మారి భూమి మీద పడిపోయినాడు. కావున నీవు స్వర్గ సామ్రాజ్యమును పాలించవలసినది" అగస్త్యుని మాటలు విన్నారు. ఇంద్రుని సహితముగా దేవతలు, మునులు ఆనందించినారు. అగస్త్యుని కొనియాడినారు. ఆనందమున అప్సరసలు ఆడినారు. కిన్నెరలు పాడినారు. పూలవాన కురిసినది.
    అక్కడికి శచీదేవి వచ్చినది. ఐరావతము వచ్చినది. ఇంద్రుడు శచీదేవి సహితముగా ఐరావతముణు ఎక్కినాడు. దేవతలు, ముని గణములు, అప్సరసలు, కిన్నెరలు ముందునడువగా ఇంద్రుడు అమరావతికి చేరినాడు. అక్కడ వారు శాంతి సుఖములను అనుభవించినారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.