Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    ఒకనాటి సాయంకాలము పగలు రాత్రి కాని వేళ సముద్రము వద్ద వృత్రుని చూచినాడు ఇంద్రుడు. సముద్రపు నురుగును చూచినాడు. అది తడిదికాదు. పొడిదికాదు. చెట్టుకాదు. రాయికాదు. శస్త్రముకాదు. అస్త్రముకాదు. ఇదే సమయము అనుకున్నాడు ఇంద్రుడు. విష్ణువును తలచినాడు. వజ్రాయుధమున సముద్రపునురుగును చేర్చినాడు. దానితో వృత్రుని వధించినాడు.
    వృత్రుడు అంతరించినాడు. అతని కథ ముగిసినది. కాని సకల భూతములు ఇంద్రుని దూషించినవి. నిందించినవి. ఇంద్రుడు బ్రహ్మహత్య చేసినందులకు తూలనాడినవి. దానితో ఇంద్రుని తేజస్సు మలిగినది. అతని పదవి ఊడినది. నీచస్థితి పొందిన ఇంద్రుడు నిషిధ పర్వతమున దాగినాడు.
    దేవ రాజ్యమునకు రాజు లేడు. రాజులేనందుకు దేవతలు భయపడినారు. మునులను వెంటపెట్టుకొని నహుషుని వద్దకు వెళ్ళినారు. ఇంద్రుని పదవిని చేపట్టవలసినదని ప్రార్ధించినారు. దేవతలను పాలించునంతటి శక్తి తనకు లేదన్నాడు నహుషుడు అగ్ని, వరుణుడు మున్నగు దేవతలు తమ శక్తిని అతనికి పంచి ఇచ్చినారు. అతనిని అధిక బలవంతుని చేసినారు. నహుషుడు అంగీకరించినాడు. దేవతలు, మునులు నహుషునకు దేవరాజ్యమును కట్టపెట్టినారు.
    నహుషుడు తుంబురు నారదాదుల వీణా ధ్వనులతోను, రంభాది అప్సరసలు వినోదములతోను భోగములు అనుభవించినాడు. అధికారమదము, విలాసలోలత అతనిని కామాంధుని చేసినవి.
    ఒకనాడు నహుషుడు ఇంద్రుని భార్య శచీదేవిని చూచినాడు. నన్ను మించినవాడు లేడు. ఆ చిన్నది నావద్దకు రాదేమి? అనుకున్నాడు. శచీదేవిని పిలిపించినాడు. శచీదేవి వడకిపోయినది. బృహస్పతిని శరణువేడినది. అతడు ఆమెకు రక్షణ కల్పించినాడు. తన ప్రయత్నమున ఇంద్రుని రావింతును అన్నాడు.
    నహుషుడు కామాతురుడు అయినాడు. కోపించినాడు. మునులను రప్పించినాడు. అన్నాడు "నేను శచీదేవిని పిలిపించినాను. బృహస్పతి ఆమెకు రక్షణ కల్పించినాడు. నేను ఇంద్రుడను. నామాట కాదనుట ఆ బృహస్పతికి తగునా?".
    మునులు కొంతసేపు మౌనము వహించినారు. తదుపరి "నీవు ఇంద్రుడవు. గుణవంతుడవు. పరస్త్రీని కోరుట తగదు" అని విన్నవించినారు.
    "తగదని చెప్పుటకు వీలులేదు" నహుషుడు రుసరుస లాడినాడు "ఇంద్రుడు అహల్యను కోరినపుడు మీరేమి చేసినారు? మీరు పలుకరాదు. శచీదేవిని నావద్దకు తీసుకొనిరండు" అని ఆదేశించినాడు.
    మునులకు నోట మాటరాలేదు. వారు బృహస్పతి వద్దకు వెళ్ళినారు. లోక హితార్ధము శచీదేవిని నహుషుని వద్దకు పంపవలసినదని కోరినారు.
    "మునులారా! మీరు లోకహితము కొఱకు ఒక స్త్రీ శీలమును హరింపచేయుటకు వచ్చినారా? నహుషుడు బలవంతుడు కావచ్చును. కాని శచీదేవి నాశరణుజొచ్చినది. నేను ఆమెను మీకు అప్పగించి పాపమునాకు ఒడిగట్టలేను" అన్నాడు బృహస్పతి.
    మునులు సందిగ్ధమున పడినారు. వారికి ఎటుతోచలేదు. ఏదో ఒక మార్గము చూపవలసినదని బృహస్పతినే కోరినారు.
    బృహస్పతి ఆలోచించి "మునులారా! ఇప్పుడు శచీదేవిని నహుషుని వద్దకు పంపింతుము. అది తప్పనట్లున్నది. ఆమె తన చాతుర్యమున నహుషుని వద్ద కొంత గడువు తీసుకొని రావలెను. అప్పుడు ఇంద్రునకు అభివృద్ధి కలుగు ఉపాయము కనుగొందము" అన్నాడు.
    శచీదేవి నహుషుని వద్దకు వెళ్ళినది. నహుషుడు ఆమెను చూచి సంతోషించినాడు. కామాతురుడు అయినాడు. శచి నహుషుని వారించినది. అన్నది:-
    "నహుషా! ఇంద్రుని విషయము ఇంతవరకు తెలియలేదు. నేను ఇంద్రుని వెతుకుటకు ప్రయత్నింతును. అతడు లేడు అని నిశ్చయించుకొని నేను నీదానను అగుదును. నాకు కొంత గడువు ఇవ్వవలసినది".
    నహుషుడు అందుకు అంగీకరించినాడు. ఇంద్రుని జాడ ఎరుగుటకు ఉపశ్రుతిని శచి ఆరాధించ సాగినది.
    ఈలోపు దేవతలు, మునులు విష్ణుదేవునివద్దకు వెళ్ళినారు. ఇంద్రుని పాప కర్మము పోగొట్టవలసినదని ప్ర్రార్ధించినారు. ఇంద్రుడు అశ్వమేధము చేసి నన్ను సంతోషపరచిన ఇంద్రుని పాప కర్మము నశించును. అతడు పుణ్యాత్ముడు అగును అని చెప్పినారు.
    దేవతలు ఇంద్రునిచే అశ్వమేధము చేయించినారు. ఇంద్రుడు పాపము పోగొట్టుకున్నాడు. అమరావతికి వెళ్ళినాడు. కాని నహుషుని తేజస్సు చూచినాడు. భయపడినాడు. పారిపోయినాడు. ఎక్కడికో పారిపోయినాడు. అన్యులు తెలియలేని చోట దాగినాడు.
    శచి ఉపశ్రుతిని ఆరాధించినది. ఉపశ్రుతి ప్రత్యక్షమయినది. శచిని వెంట తీసుకొని సాగినది. హిమాలయమున మంజుల పర్వతము దగ్గరకు వెళ్ళినది. అక్కడ నూరు ఆమడల వైశాల్యము గల ఒక సరస్సున్నది. ఆ సరస్సులో తామరలు ఉన్నవి. ఉపశ్రుతి శచీదేవిని సరస్సుమీద నడిపించినది. ఇరువురు సూక్ష్మరూపము దాల్చినారు ఒక తామరతూడులో ప్రవేశించినారు. అక్కడ సూక్ష్మరూపమున ఇంద్రుడు ఉన్నాడు. ఇంద్రుని చూపి ఉపశ్రుతి వెళ్ళిపోయినది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.