Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    "కాలమును ఎవరును ఎదిరించలేరు. అప్పుడప్పుడు దేవతలకు కూడ ఇక్కట్లు తప్పవు. ఇంద్రుడు శచీదేవిని వీడి అనేక కష్టముల పాలయినాడు. తుదకు విజయము సాధించినాడు. మీరు ఇంద్రుని కన్న అధికులుకారు. విధి వశమున కలిగిన ఆపదలను అనుభవించి తీరవలెను".
    శల్యుని మాటలు విన్నాడు ధర్మరాజు. అతడు సాయము చేతును అన్నందుకు ఎంతో సంతోషించినాడు. కృతజ్ఞతలు తెలియపరచినాడు. అన్నాడు:-
    "ఇంద్రుడు శచీదేవి సహితముగా ఇక్కట్ల పాలగుటకు కారణమేమి. వినుటకు కోరికగా ఉన్నది. వివరింపుము".
    "ధర్మజా! ఈ విషయమున పూర్వపు ఇతిహాసము ఒకటి ఉన్నది చెప్పెదను వినుము" అని శల్యుడు కథ చెప్పినాడు.
    పూర్వము త్వష్టకు ఇంద్రునకు వైరము ఏర్పడినది. ఇంద్రునకు కీడు చేయదలచినాడు త్వష్ట. అతడు మూడు తలలు గల విశ్వరూపుని సృష్టించినాడు. విశ్వరూపుడు ఇంద్రుని పదవి కోరి గొప్ప తపస్సు ప్రారంభించినాడు. ఇంద్రుడు అతని తపమును చూచి భయపడినాడు. అతని తపము భంగము చేయదలచినాడు. అప్సరస్త్రీలను పంపినాడు. విశ్వరూపుడు అప్సరసల విలాసములకు చలించలేదు. ఇంద్రుని ప్రయత్నము ఫలించలేదు. ఇంద్రునకు దుష్టబుద్ది కలిగినది. అతడు విశ్వరూపుని మూడు తలలను నరికినాడు. అతడు చేసిన పాపకార్యము బయటపడకుండ ఒక సంవత్సరము గడిపినాడు. ఆ తరువాత ఇంద్రుడు చేసిన ఆకృత్యము బయటపడినది. అప్పుడు ఇంద్రుడు ఒక విషమ వ్రతము పూనినాడు. బ్రహ్మ హత్యా దోషమును నాలుగు భాగములు చేసినాడు. ఒకటి సాగరమునకు, రెండవది వృక్షములకు, మూడవది భూమికి, నాలుగవది స్త్రీలకు ఇచ్చినాడు. ఇంద్రుడు ఆవిధముగా హత్యాదోషమును పోగొట్టుకున్నాడు. ఎప్పటియట్లు సుఖించినాడు.
    త్వష్ట ఇదంతయు తెలుసుకున్నాడు. కోపించినాడు. "సకల భూతములారా! విశ్వరూపుడు  ఇంద్రునకు అపకారము తలపెట్టలేదు. చేయలేదు. విశ్వరూపుడు తపస్సంపన్నుడు. శాంత చిత్తుడు. ఇంద్రుడు విశ్వరూపుని వధించినాడు. అతడు పాపాత్ముడు. ఇంద్రుని పట్టుకొని మింగ గల మహాకాయుని సృష్టింతును" అని అగ్నియందు హోమము చేసి ఒక పుత్రుని సృష్టించినాడు. త్వష్ట ఆ పుత్రునకు "వృత్రుడు" అని పేరు పెట్టినాడు.
    వృత్రుడు అంజలి ఘటించి తండ్రిముందు నిలిచినాడు. తండ్రీ! నన్ను ఎందుకు సృష్టించినావు? నన్ను ఏమి చేయమందువు? అని అడిగినాడు.
    "వృత్రా!" త్వష్ట ఆదేశించినాడు. "నా తపోబలమున నీవు మహాతేజోవంతుడవు అగుము. నీవు యుద్దము చేసి ఇంద్రుని జయింపుము. త్వరగా వెళ్ళుము. వెంటనే ఇంద్రుని ఓడింపుము".
    వృత్రుడు ఇంద్రలోకమునకు ఉరికినాడు. ఇంద్రుని మీద దాడి చేసినాడు. ఇంద్రునకు వృత్రునకు గొప్ప యుద్దము జరిగినది. యుద్దమున వృత్రుడు ఇంద్రుని పట్టుకొన్నాడు. మింగినాడు. దేవతలు తల్లడిల్లినారు. ఉపాయమున వృత్రునకు ఆవులింత కలిగించినారు. ఇంద్రుడు సూక్ష్మరూపుడయి బయటికి వచ్చినాడు. ఇంద్రుడు బతికి బయటపడినాడు. నిజము. కాని బలహీనుడు అయినాడు. వృత్రునితో పోరలేక పోయినాడు. పారిపోయి మందార గిరి శిఖరమున దాగినాడు.
    వృత్రుడు గెలిచినాడు.
    దేవతలందరు మందరగిరిలో కూడినారు. వృత్రుని ఓడించుటను గురించి ఆలోచించినారు. విష్ణుదేవుని వద్దకు వెళ్ళినారు. తమ బాధలను గురించి మొరపెట్టుకున్నారు. కాపాడవలసినదని వేడుకున్నారు.
    "దేవతలారా!" నారాయణుడు పలికినాడు "వృత్రుడు బలవంతుడుగా ఉన్నాడు. ప్రస్తుతము అతనికి ఇంద్రునితో స్నేహము కలిగింపుడు. కొంత కాలమునకు నేను ఇంద్రుని వజ్రాయుధమున ప్రవేశింతును. అప్పుడు ఇంద్రుడు తేజోవంతుడు అగును. అప్పుడు వృత్రుని గెలువగలడు".
    దేవతలు విష్ణుదేవుని మాటలు విన్నారు. నమస్కరించినారు. సాగిపోయినారు. వృత్రుని వద్దకు మునులను పంపినారు. "వృత్రా! నీవు మహాబలవంతుడవు. ఇంద్రుడు తక్కువవాడుకాడు. మీ ఉభయుల యుద్దము లోకమునకు క్షేమముకాదు. కావున శత్రుభావము విడువుము. ఇంద్రునితో స్నేహము చేయుము. ఇంద్రుని రాజ్యలక్ష్మిని అనుభవింపుము" అన్నారు.
    మునుల మాటలకు వృత్రుడు సమ్మతించినాడు.
    "మునులారా! నేను ఇంద్రుని తేజస్సును గుంజుకొనదలచినాను. నాకును, ఇంద్రునకు సఖ్యము కుదరని పని" అన్నాడు.
    మునులు వృత్రుని మాటలు విన్నారు. అతనితో అన్నారు:-
    "వృత్రా! ఇంద్రుడు సర్వలోక పూజితుడు. సత్పురుషుడు. అతని స్నేహము వలన మేలుకలుగును. మంచి వారితో స్నేహము కలుగు అవకాశము రాదు. వచ్చినపుడు కాదనుట నీతికాదు. కావున నీవు ఇంద్రునితో స్నేహము చేయుట మంచిది".
    వృత్రుడు ఇంద్రునితో స్నేహమునకు సమ్మతించినాడు.
    "తడి, పొడి వస్తువులు, వృక్షములు, రాళ్ళు, శస్త్రాస్త్రముల వలన కాని, పగటివేళ కాని, రాత్రివేళ కాని నాకు మృత్యువు కలుగకుండునట్లు మీరు నాకు వరమునీయవలెను. అప్పుడు ఇంద్రునితో స్నేహమునకు నేను సిద్దము" అన్నాడు వృత్రుడు.
    మునులు అందుకు అంగీకరించినారు. వరము ఇచ్చినారు. ఇంద్రునితో మాట్లాడినారు. ఉభయులకు స్నేహము కూర్చినారు. తమ తమ నివాసములకు వెళ్ళినారు.
    ఆవిధముగా కొంతకాలము గడచినది. ఇంద్రుని పగతీరలేదు. అతడు వృత్రుని అంతము చేయుటను గురించి ఆలోచించినాడు. విష్ణువు చెప్పిన మాటలను, మునులు కూర్చిన సంధిని గురించి ఆలోచించినాడు. సమయమునకై వేచినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.