Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"మహాత్మా! శల్యా! నీవు సత్య సరస్వతివి. నీ చిత్తము ఔచిత్య విశారదము. నీవు ఉదారుడవు. నీవు నాకు అమాత్యుడవగుము. నా సైన్యమును నడిపింపుము. నన్ను ధన్యుని చేయుము. ఇదియే నాకోరిక. పాండవులును, కౌరవులును నీకు సమానులగుదురు. అయినను నీమీద నాకు అధిక భక్తి ఉన్నది. కావున నన్ను నీవానిగా గ్రహింపుము. నన్ను అనుగ్రహింపుము".
"దుర్యోధనా!" శల్యుడు ప్రీతి పూర్వకముగా అన్నాడు "నాకు పాండవ కౌరవులు సమానులు. నాకు ఉభయుల విషయమునను భేషబుద్ధి లేదు. అయినను నీవు ముందు నన్ను చూచినావు. వేడినావు. నీకే సాయము చేతును. అందుకు సందేహము లేదు. నేను నీ విషయమున ప్రసన్నుడను అయినాను. మరొక కోరిక ఉన్న చెప్పుము. తీర్చెదను".
"మహాత్మా" దుర్యోధనుడు సవినయముగా "సమ్మానము సేసి నాకిటు లమాత్యుడవైన పదంబుకంటే మేలైన మతి కెక్కు కోరిక యెటులారసి చూచిన నొండు గల్గునే" అన్నాడు.
అనిన విని వికచ వదనుండగుచు మద్రేశ్వరుండు "దుర్యోధనా! నీవు హస్తినకు వెళ్ళుము. మేము ఉపప్లావ్యమునాకు వెళ్ళుచున్నాము. మా మేనల్లురు పాండవులను చూడవలెనని మనసు ఆరాట పడుచున్నది. ధర్మరాజాదులను చూచి సైన్య సమేతులమై హస్తినకు వత్తుము. నీవు వెళ్ళుము" అన్నాడు.
"మామా!" దుర్యోధనుడు చిన్నబుచ్చుకొని "మీరు పాండవులను చూచుటకు వెళ్ళుము. కాని మీరు నాకు ఇచ్చిన మాటను మరువ వద్దు. మీ అండదండల వలన విజయము సాధించవలెననుకున్నాను. నామీద దయ దలచవలెను. నన్ను గెలిపించవలెను" అని వేడుకొన్నాడు. ప్రార్ధించినాడు.
శల్యుడు దుర్యోధనుని మాటలు విన్నాడు. నవ్వినాడు. దుర్యోధనుని కౌగిలించుకున్నాడు. "సంశయించకు వెళ్ళు" అని సాగనంపినాడు.
దుర్యోధనుడు ఎంతో సంతోషించినాడు. హస్తినాపురమునకు వెళ్ళినాడు.
శల్యుడు ఉపప్లావ్యమునకు సాగినాడు. చేరినాడు. శిబిరములు దాటినాడు. ధర్మరాజు వద్దకు వెళ్ళినాడు. శల్యుని రాకను గురించి ధర్మరాజు తెలుసుకున్నాడు. భీమార్జున నకుల సహదేవులు, అభిమన్యుడు మున్నగు పుత్రులు ద్రౌపది, సుభద్రలను వెంట తీసుకున్నాడు. శల్యునకు ఎదురేగినాడు. స్వాగతము పలికినాడు. అందరును శల్యునకు సాగిలి మ్రొక్కినారు. శల్యుని తోడ్కొని వెళ్ళినారు. బంగారపు ఆసనమున కూర్చుండపెట్టినారు. శల్యుని కుశలము అడిగినారు. శల్యుడు వారి ఆదరమునకు సంతసించినాడు. ధర్మరాజును కౌగిలించుకున్నాడు. ఆత్మీయముగా అన్నాడు:-
"అల్లుడా! ధర్మజా! ద్రౌపదితో కూడ నీ తమ్ములు నీవు పన్నెండు సంవత్సరములు నీర్జనారణ్యముల గడిపినారు. ఇది సాహసకార్యము. ఇతర్లకు సాధ్యముకానిది. అంతకన్న కష్టమయిన అజ్ఞాతవాసము చేసినారు. మీకు గల సత్యము, దయ మున్నగు గుణములే మిమ్ములను కాపాడినవి. నీకు దుఃఖము కలిగినపుడు భూలోకము దుఃఖించినది. సమస్త ప్రాణులు కన్నీరు కార్చినవి. ఇప్పుడు నీవు సమస్త కష్టముల నుండి బయటపడినావు. లోకము సాంతము సుఖించుచున్నది. సమస్త ప్రాణులు ఆనందముగా ఉన్నవి".
"అని యుచిత సంభాషణంబులు సేసి దుర్యోధనుండు దన్నుంగాంచిన విధంబును నతండు ప్రార్ధించిన తెఱంగును దానికి దానియ్యకొనుటయుం" జెప్పిన ధర్మనందనుండతనికిట్లనియె
"మామా! ఒకరిని మెచ్చి వారి కోరిక తీర్చుట పెద్దల గుణము. మీరు అందుకు అనుగుణముగనే వ్యవహరించినారు. అది నాకు సంతోషము కలిగించినది. మిమ్ములను నేను ఒకటి కోరదలచినాను. చిత్తగింపుము". "శ్రీకృష్ణుడు అర్జునునకు సారథ్యము చేయుటకు దయతో అంగీకరించినాడు. కర్ణుడు అర్జునుని మీద కక్ష పూని ఉన్నాడు. కర్ణుడు అర్జునునితో తలపడినపుడు శ్రీకృష్ణునకు సమానమయిన సారథ్యము కావలసి ఉండును. అందుకు మిమ్ము మించిన సమర్ధుడు లేడు. మీరే కర్ణునకు సారథ్యము చేయవలసి వచ్చును. యుద్ద సమయమున కర్ణుని మనసుకుంగునట్లు కఠిన వాక్యములు పలుకవలెను. ఆవిధముగా చేసి అర్జునుని రక్షించవలెను. ఆకృత్యంబని యనుమానించక మత్ప్రార్ధనంబున నెల్లభంగుల నివ్విధంబనుష్టింపవలయునని యభ్యర్ధించిన సమ్మతించి శల్యుండిట్లనియె:-
ధర్మజా! బాగు బాగు. నీవు చెప్పినది నిశ్చయము. నేను దుర్యోధనుని ప్రార్ధన మన్నించవలసి ఉన్నది కదా! అతడు నన్ను కర్ణునకు సారథ్యము వహించమనును. నేను సారథ్యము వహింతును".
"కర్ణుని సారథినైనను
నిర్ణయమునాకును బార్ధునింగాచెద నా
దుర్ణయ విచారు నెమ్మెయి
గర్ణకఠోరంబులాది, కలతుంబోరన్"
"కర్ణుని ధైర్య సాహసములు రాలిపోవునట్లు క్రూరమైన పలుకులు పలుకుదును. అప్పుడు కర్ణుడు నిర్వీర్యుడగును. నిస్తేజుడగును. అప్పుడు అర్జునుడు తీవ్ర బాణపరంపారాల వానిని కూల్చవచ్చును".
"ఇంతేకాదు. నీవు మరియేది కోరినను చేయగలను. ఆనాడు సభలో కర్ణుడు మిమ్ము దూషించినాడు. అది నా మనసును కలచి వేసినది. నాటి నుంచి నామనసు మీ పక్షము వహించినది. మీరు బహు బాధల పాలయినారు. మీకు సకల జనుల సానుభూతి ఉన్నది. మీరు విచారించరాదు. మీరు ఆపదలు గడచినారు. మీ కోరిక ఫలింపనున్నది. ఇది సత్యము. ఇది తథ్యము".





