Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    దుర్యోధనుడు శ్రీకృష్ణునివద్ద నుండి బయలుదేరినాడు. బలరాముని వద్దకు వెళ్ళినాడు! తాను వచ్చిన కార్యమును గూర్చి తెలియపరచినాడు. బలరాముడు అంతయు విన్నాడు.
    "దుర్యోధనా! అభిమన్యుని వివాహము ఉపప్లావ్యమున జరిగినది. తదుపరి రాజుల సభ జరిగినది. ఆ సభలో నేను నీకు అనుకూలముగా మాట్లాడినాను. ఆవిషయము నీకు హస్తినలో తెలిసి ఉండవచ్చును. దానికి గొందరసహ్యపడి పాండవ పక్షపాతంబున బ్రతికూలవచనంబులు వలికిన నవి శ్రీకృష్ణునకు బ్రియంబులైయుండె నట్లగుటంజేసి నేను మారు పలుకలేదు. అచటి నుంచి వచ్చినాణు. నేను శ్రీకృష్ణునకు వ్యతిరేకము చేయలేను. అతని మనసు నొప్పించలేను. అతనిని విడిచి ఒక్కక్షణమయినను ఉండజాలను. అందువలన నేను ఒక నిర్ణయమునకు వచ్చినాను.
            మీరును వారును జలమున
            బోరెడు నెడ నెవ్వరెట్లువోయిన నేఱినే
            నూరక యుండుదు దోడె                    
            వ్వారికి బోనింత నిక్కువం బెబ్బంగిన్
    అనిన విని దుర్యోధనుండు దానికియ్యకొనిసవినయంబుగా బలదేవుని వీడ్కొని కృతవర్మ పాలికింజని యాతండొక్కయక్షౌహిణితోడ,దన్నుంగలయవచ్చువాడయి యూరడంబలికిన బ్రియంబంది నిజపురంబున కరిగె".
    
                                                           ఆలోచనామృతము
    
    1. ఉపప్లావ్యమున రాయబారమును గురించి మాటలు జరిగినవి. అక్కడ కూడ బలరాముడు దుర్యోధనుని పక్షము వహించినాడు. దూతమెత్తనివాడు కావలెనని సూచించినాడు.
    సుభద్ర పెండ్లి విషయమున కూడ బలరాముడు పాండవులకు అనుకూలుడు కాడు. ఏదో ఒక ఉపాయమున బలరాముని పూర్తి కౌరవ పక్షము కాకుండ చేయుచున్నాడు శ్రీకృష్ణుడు.
    2. ఉపప్లావ్య సభ తరువాత శ్రీకృష్ణ బలరాములకు ఒక ఒప్పందము జరిగి ఉండవచ్చునని నా అభిప్రాయము. దానిని అనుసరించి యుద్దమున ఉభయులు పాల్గొనరాదు. తటస్థముగా ఉండవలెను.
    3. దుర్యోధనుడు శ్రీకృష్ణుని అడిగినపుడు తాను ఆయుధము పట్టను, యుద్దము చేయను అని స్పష్టపరచినాడు. బలరాముడు సుమారు అదేమాట చెప్పినాడు.
    4. కుటుంబమున బలరాముడు బలహీనుడు అయినాడు. ఎంతటి బలవంతుడయినను కుటుంబ పరిస్థితులకు లొంగక తప్పదు అనుటకు ఇది ఒక నిదర్శనము.
    5. అర్జునుడు అన్నీ తెలిసి ఆయుధము పట్టని శ్రీకృష్ణునే వరించినాడు. ఇది గొప్ప మేధావిత్వము.
కందబలము పోరుటకు పనికి వచ్చును. గెలుచుటకు పనికిరాదు. గెలుచుటకు ఉపాయము కావలెను. ఉపాయము ఉన్న ఎంతటి అపాయమునయినా తప్పించుకొనవచ్చును. ముఖ్యముగా యుద్దములందు వ్యూహ రచనము ముఖ్యము. శ్రీకృష్ణుని మేధాశక్తి అద్బుతము. అంతేకాక శ్రీకృష్ణుడు భగవదవతారము. సాక్షాత్తు దైవమే తమ పక్షమున ఉన్న విజయము తథ్యము. వీటన్నింటిని గురించి ఆలోచించియే అర్జునుడు శ్రీకృష్ణుని వరించినాడు.
దుర్యోధనునకు ఆ అదృష్టములేదు. శ్రీకృష్ణుడు కౌరవ పక్షమున ఉండలేడు. ఉండవలసిన బలరాముని శ్రీకృష్ణుడు తటస్థుని చేసినాడు.
దుర్యోధనునకు కండ బలముమీద నమ్మకము ఎక్కువ. కండబలము నమ్మిన వానికి కావరము ఎక్కువ. కవరమున్న వానికి పతనము తప్పదు.
    హిట్లర్ పతనము ఇందుకు నిదర్శనము.
    6. శ్రీకృష్ణుడు పార్దునకు సారథి మాత్రము కాడు. అతడు పాండవ యుద్ద సారథి.
    శ్రీకృష్ణుడు పాండవులకు "విజయ సారథి".
    
                                                                                               సమీకరణము
    
    యుద్ద సన్నాహములు సాగినవి. సైన్య సమీకరణ ప్రారంభము అయినది. ధర్మరాజు మద్రా భూపతి శల్యుని వద్దకు దూతలను పంపినాడు. దూతలు శల్యుని వద్దకు వెళ్ళినారు. అతనితో సముచితముగా మాట్లాడినారు. సమర సహాయము అర్ధించినారు. దూతల మాటలకు శల్యుడు సంతసించినాడు. సాయము చేతును అన్నాడు. పుత్ర మిత్ర సమేతంబుగా, నానా సేనాతి సంకులంబుగా గదలి పాండవులున్న యెడకు నిత్య ప్రయాణంబు నడచు సమయంబున.
    శల్యుడు ఉపప్లావ్యమునకు వెళ్ళుచున్నాడు. ఈవార్త చారుల వలన దుర్యోధనుడు తెలుసుకున్నాడు. శల్యుడు సాగు మార్గమున సకల సౌకర్యములు కలిగించినాడు. పందిళ్ళు వేయించినాడు. మంచి నీటి బావులు ఏర్పరచినాడు. ఏనుగులు గుఱ్ఱములు నిలుచుటకు కొట్టములు వేయించినాడు. జంతువులకు మేత ఏర్పరచినాడు. వంటలకు సకల సామగ్రి సమకూర్చినాడు.దుర్యోధనుడు పరిచారకుని వేషమున శల్యసేన వెంట నడచినాడు.
    ఒకనాడు, ఒకచోట శల్యుడు విడిచినాడు. ఏర్పరచిన సౌకర్యములకు సంతోషించినాడు. "ఇంత మంచి సౌకర్యములు కలిగించినవారు ధర్మరాజు మంత్రులు కావచ్చును. వారిని చూడవలెనని నామనసు ఆరాటపడుచున్నది. కావున వారిని వెంటనే ప్రవేశ పెట్టగలరు" అని తన పరిచారకులకు ఆదేశించినాడు.
    దుర్యోధనుడు ఈ సమయమునకే వేచినాడు. ఈ మాటకే చూచినాడు. వెంటనే శల్యుని ముందుకు చేరినాడు. తనను తెలియపరచుకున్నాడు. శల్యుడు దుర్యోధనుని చూచినాడు. ఆనందమున పొంగినాడు. ఆలింగనము చేసుకున్నాడు. బంగారుపీట మీద కూర్చుండ పెట్టినాడు. యింతయు నిమ్మహాత్మునుద్యోగంబున నయ్యెగావలయు నని తలంచి విస్మయంబంది నీ కెయ్యది యిష్టంబు గోరు మిచ్చెదననిన గాంధారీ నందనుండు పరమానందంబునుంబొంది యిట్లనియె:-




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.