Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
5. జూదమునకు పిలిపించవలసినదని ధృతరాష్ట్రుని ఒప్పించినది దుర్యోధనుడు. శకునితో ఆడించినది దుర్యోధనుడు. పాండవులను అడవులకు పంపినది దుర్యోధనుడు. అయినను దుర్యోధనుడు ప్రత్యక్షముగా కనిపించడు. ఇది అత్యంత రాజకీయ చాతుర్యము. తలలు తీయించువాడు వేరు, తీయువాడు వేరు.
6. పాండవుల యుద్ద ప్రయత్నములు చూచి దుర్యోధనుడు ప్రారంభించినాడట. ఒకటి హక్కును కాజేసినవాడు ఎప్పుడు నిండుకుండవలెనే ఉండును. కపుడు మండినవాడు హక్కు కోల్పోయినవాడు పోరుకు దిగును. అట్టివారు పాండవులు.
7. తొలిసారి జూదమున ధర్మజుడు రాజ్యము పోగొట్టుకున్నాడు. ద్రౌపది వలన అది మరల వచ్చినది. రెండవ సారి జూదమున ధర్మరాజు రాజ్యమును ఓడలేదు. అది పణముగా పెట్టరాదని శకునియే చెప్పినాడు. జూదమున ఓడినది అరణ్య అజ్ఞాతవాసములకే. అందువలన ఇంతకాలము రాజ్యము ధర్మరాజుదే. పరులు పాలించినారు. దానిని మరల ధర్మరాజునకు అప్పగించుటయే కావలసినది.
ఇటువంటి ఒక ఉదాహరణ ఆఫ్రికాలోని నమీబియాను దక్షిణాఫ్రికా తెల్లజాతి ప్రభుత్వం విడువకుండుట. అక్కడ ప్రజాయుద్దము జరుగుచున్నది.
విజయ సారథి
హస్తినలో దుర్యోధనుడు యుద్ద ప్రయత్నములు సాగించినాడు. తనకు మిత్రులయిన రాజులవద్దకు మనుషులను పంపినాడు. శ్రీకృష్ణుని వద్దకు ఇతరులను పంపుట సమంజసముకాదని భావించినాడు. తాను స్వయముగా ద్వారకకు బయలుదేరినాడు చేరినాడు.
దుర్యోధనుడు శ్రీకృష్ణునివద్దకు వెళ్ళినాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పానుపున పవళించి ఉన్నాడు. శ్రీకృష్ణుని తలవద్ద ఒక ఉన్నత ఆసనము ఉన్నది. దుర్యోధనుడు అది చూచినాడు. ఆసీనుడు అయినాడు. అర్జునుడుణు అదే సమయమున శ్రీకృష్ణునివద్దకు వచ్చినాడు. శ్రీకృష్ణుడు నిద్రలో ఉన్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుని పాదములవద్ద నిలిచినాడు.
శ్రీకృష్ణుడు నిద్రనుంచి మేల్కొన్నాడు. అర్జునుని చూచినాడు. దుర్యోధనుని కూడ చూచినాడు. వారిని ప్రియముగా పలుకరించినాడు. ఆధార దృక్కుల పరికించినాడు. వచ్చిన పనిని గురించి అడిగినాడు.
"శ్రీకృష్ణా!"దుర్యోధనుడు విన్నవించినాడు. "యుద్దము జరుగనున్నది. మేమును పాండవులును నీకు సమానులే. సమాన బంధువులమే. నీవు వేరుచూడవు. అట్లని యుద్దమునకని నీ సాయముకోరి వచ్చినాను. నిన్ను అడుగుటకు నేను మొదట వచ్చినాను. సత్పురుషులు ముందు చూచిన వానినే గ్రహింతురు. నీవు సౌజన్య సారాయుతుడవు. నీకు చెప్పవలసిన పనిలేదు. కావున లోకంబుపాడి విచారించి నాకుందోడు కావలయు"ననిన వాసుదేవుండిట్లనియె:-
"దుర్యోధనా! నీవు నావద్దకు మొదలు వచ్చినావు. అది నిజము. నేను ముందు అర్జునుని చూచినాను. ఇదియు నిజాము. కావున ఇద్దరికి సాయము చేతును. రెండు విధములయిన సాయము ఏర్పరతును. మీకు ఇష్టమయినదానిని కోరుకొనుడు".
"నావంటి వారు పదివేలమంది గోపాలురు ఉన్నారు. వారు నారాయణ గోపాలురు. వారు నాతో సములు. యుద్ద విద్యా విశారదులు. చాపాద్యాయుధములు ధరింతురు. సమర భూమిలో యుద్దము చేతురు. వీరిని ఒకరు కోరుకొనవచ్చును".
"నేను ఒక్కడను. నిరాయుధుడను. యుద్దము చేయను. ఆప్తునిగ మాత్రము ఉందును. నన్ను ఒకరు కోరుకొనవచ్చును. కావున మీరిద్దరు మీ ఇష్టము వచ్చిన వారిని కోరుకొనవచ్చును. అర్జునుడు చిన్నవాడు కావున ముందు అతడు కోరుట సమంజసము".
అర్జునుడు శ్రీకృష్ణుని మాట విన్నాడు. అతనిలో ఆనందము పొంగినది. ఉత్సాహము ఉరకలు వేసినది. "శ్రీకృష్ణుని ఒక్కనినే కోరుకున్నాను" అన్నాడు అర్జునుడు. తదుపరి పలుక లేదు.
వీరులను, నారాయణ గోపాలురణు అర్జునుడు అడుగుతాడు అనుకున్నాడు దుర్యోధనుడు. అట్లుకాలేదు. అందుకు అతడు సంతోషించినాడు. కోరవలసిన పనిలేకపోయినది. శ్రీకృష్ణునివద్ద నుండి సాగినాడు. సాయమడుగుటకు బలరాముని వద్దకు వెళ్ళినాడు.
శ్రీకృష్ణుడు దుర్యోధనుని సాగనంపినాడు. అర్జునుని అభిమానించినాడు. ఆసీనుని చేసినాడు. అడిగినాడు:-
"అర్జునా! భూరి పరాక్రమవంతులు అయిన నారాయణ గోపాలురను దుర్యోధనుడును కోరుకున్నాడు. నీవు నన్ను-సంగ్రామారంభ రహితుని ఎందుకు కోరుకున్నావయ్యా!".
అర్జునుడు ముకుళిత హస్తుడు అయినాడు. అన్నాడు:-
"బావా! శ్రీకృష్ణా! రణమున నీసాయము నాకు వద్దు. ఏలనందువా! నీవు సుప్రసిద్ధుడవు. నీవే యుద్దము చేసిన నాకు కీర్తి ఎట్లువచ్చును?".
"నీకెదురై జయంబు గొనరాదట్లగుటంజేసి విజయమూలంబగు నీతోడును వలయు. నీవు సమరంబు సేయకునికియుం బ్రియంబు కావున నిన్నుం గోరి కొంటినని చెప్పి మరియు నిట్లనియె
సారథ్యం బొనరింపుమ
పారకృపాలీలనెల్ల భంగుల నాకే
గౌరవమును జిరకాలము
గోరినయది దీని నిమ్ము గుణరత్న నిధీ!"
శ్రీకృష్ణుడు అర్జునునిమాట విన్నాడు. "కిరీటీ! నీకోరిక తీర్చుట నాకు వ్రతము. సారథ్యంబొనరించెద నీకు నసమ యుద్ద క్రీడన్" అని అర్జునునకు చెప్పినాడు. కార్యాలోచనమునకు అర్జునుని సహితముగా ఉపప్లావ్యమునకు శ్రీకృష్ణుడు వెళ్ళినాడు.





