Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
అనిన వాసుదేవుండు పాంచాలపతి వచనంబు లుచితంబులయి యున్నవని యిబ్బంగిన చేయవలయునని పలికి మరియు నిట్లనియె.
"ద్రుపద మహారాజా! మీరు మాకు పెద్దలు. ప్రఖ్యాతులు. ధృతరాష్ట్రుడు మీ మాటకు విలువ ఇచ్చును. భీష్మ, ద్రోణ, కృపులు మీ స్నేహము కోరుదురు. మీ పురోహితుని ధృతరాష్ట్రుని వద్దకు పంపుబాధ్యత మీది. అతడు సంధికి ఒప్పైనా సరి. అట్లుకాకున్న అర్జునుడు కార్చిచ్చు అయి కౌరవవనమును దహించును. మీరు చెప్పినట్లు మేము చేయగలము. మీరే మార్గ నిర్దేశకులు".
"పెండ్లికని పిలువగా వచ్చినాము. పెండ్లి చేసినాము. వేడుకలు చూచినాము. చాల రోజులు ఉన్నాము. మేము ద్వారకకు వెళ్ళి రావలెను" అని శ్రీకృష్ణుడు బయలుదేరినాడు. బలరామ, సాత్యకులు అనుసరించినారు. వారు ద్వారకకు వెళ్ళినారు.
పాండవులు యుద్ద ప్రయత్నములు సాగించినారు. విరాటుడు యుద్దమునకు సిద్దమయినాడు. ద్రుపదుడు సకల యుద్ద ప్రయత్నములు సాగించినాడు. సేనా సమూహములతో ఉపప్లావ్యమునకు వచ్చినాడు. వారు తమ మిత్రులగు రాజులవద్దకు దూతలను పంపినారు.
ఉపప్లావ్యమున పాండవులు యుద్ద ప్రయత్నములు చేయుచున్నారు. ఈ విషయము హస్తినలో దుర్యోధనుడు తెలుసుకున్నాడు. అతడు గూడ ప్రయత్నము సాగించినాడు. తనకు మిత్రులయిన రాజులవద్దకు మనుష్యులను పంపినాడు. వారిని రప్పించినాడు. నానాదేశముల నుండి చతురంగ సేనలు బయలుదేరినవి. వాటి కదలికకు భూమి అదరినది. అశ్వ, రథ, గజ సేనను చూడగా ప్రళయము రానున్న సూచన కనిపించినట్లయినది.
ఈవిధముగా నలుదిక్కుల నుండి సేనలు సాగినవి. వానిలో కొన్ని హస్తినకు చేరినవి. కొన్ని ఉపప్లావ్యమునకు చేరినవి.
అట్టి సమయంబున నజాతశత్రు ననుమతి వడసి పాంచాలపతి వయో, జ్ఞాన వృద్ధుండైన తన పురోహితుం గురుపతిపాలికింబుచ్చువాడై యతని రావించి
హితుడవు మతిమంతుండవు
చతుర వచనకోవిదుడవు సమయజ్ఞుడవు
న్నతవంశ వర్దనుడ విం
గిత వేదివి నెచ్చెలివి సుకృతి నట్లగుటన్
నాకు గర్తవ్యమగు పని నీకు జేయ
దగవు గావున నెల్లవిధముల బూని
పాండవార్ధంబు ధృతరాష్ట్రు పాలి కరిగి
నేర్పు వాటించి కార్యంబు దీర్పవలయు.
ఆలోచనామృతము
1. లక్క ఇంటి నుండి బయటపడినప్పటి నుండి ద్రౌపది వివాహము వరకు పాండవులు అజ్ఞాతవాసమునే చేసినారు. దుర్యోధనుడు ప్రత్యక్షముగా చెప్పక చేయించిన అజ్ఞాతవాసము. ద్రౌపది పెళ్ళి వలన ద్రుపదుని అండవలన ఆనాడు పాండవులకు అర్ధ రాజ్యము వచ్చినది.
ఇప్పుడు పాండవులు ముగించిన అజ్ఞాతవాసము దుర్యోధనుని నియమమునకు, శకుని కితవమునకు కట్టువడి చేసినది. ఇది మరింత కఠినమయినది. ఏలనన అప్పుడు పాండవులున్నారని దుర్యోధనుడు స్పష్టముగా ఎరుగడు. ఇప్పుడు అజ్ఞాతవాసమును భంగపరచుటకు అడుగడుగున అతడు ప్రయత్నించినాడు.
అప్పుడు వారి వెంట తల్లి కుంతి ఉండినది. ఇప్పుడు ద్రౌపది ఉన్నది. అప్పుడు వారి వెంట తల్లి కుంతి ఉండినది. ఇప్పుడు ద్రౌపది ఉన్నది. అప్పుడు ద్రౌపది వివాహము. ఇప్పుడు ఉత్తర వివాహము. అప్పుడు ద్రుపదని వలన, ఇప్పుడు విరాటుని వలన పాండవులు బలపడినారు.
వివాహములు రాజకీయ ఉద్దేశ్యములను సాధించునవిగా ఉన్నవి.
సుభద్ర వివాహము కూడ అట్టిదియే.
2. ద్రౌపది వివాహము స్వయంవర పద్దతిన జరిగినది. పందెము గెలిచినవానికి పిల్లనిత్తునన్నాడు ద్రుపదుడు. ఈ పెళ్ళిలో అటువంటిది లేదు. తల్లిదండ్రుల ఇష్టమే కాని వధూవరులు ఒకరిని ఒకరు చూచుకున్నట్లు లేదు. ఈ పెళ్ళికి భారతమున ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. భారత యుద్దము తరువాత భారత వంశమును ఉద్దరించిన వాడు ఉత్తరాభిమన్యుల పుత్రుడే పరీక్షిత్తు.
3. పెండ్లికి వచ్చిన రాజులు పాండవ కార్యమునకుగాను సభ చేసినారు. ఈ సభ సాంతమున పాండవులు పలుకలేదు. వారు సభలో ఉన్నారు. ఇతరులు మాట్లాడినారు. పాండవులు ఈ బాధ్యతను ఎక్కువగా శ్రీకృష్ణునకు అప్పగించినట్లు తోచుచున్నది. శ్రీకృష్ణుడు సభకు సారథ్యము వహించినాడు. ఒక పద్దతిలో లేని సభకు ఒక పద్దతి ఏర్పరచినాడు.
శ్రీకృష్ణుడు పాండవుల వాదమునకు ఎంతో బలము చేకూర్చినాడు. వాస్తవముగా రాజ్యము సాంతము పాండవులది అన్నాడు. వారే కురు సామ్రాజ్యమును స్థిరపరచినారు. బలపరచినారు. మరల దానిని సాధించు శక్తి వారికి ఉన్నది. అయినను అర్ధ రాజ్యముతో సంతృప్తి చెందగలరు. ఈవాదముఅందరిని ఆకట్టుకున్నది. శ్రీకృష్ణుడు ప్రవేశపెట్టిన రాయబార వాదమునకు బలరాముడు కూడ లొంగినాడు.
4. బలరాముడు ఒక విచిత్ర విషయమును లేవనెత్తినాడు. దుర్యోధనుడు జూదమాడలేదు, కావున అతని దోషము లేదు అన్నాడు. ఇది బలరాముడు దుర్యోధనుని పక్షముగా చేసిన ఆలోచన. కాని ఇది సరికాదు. జూద సభలో దుర్యోధనుడు ఉన్నాడు. తన పక్షమున శకుని ఆడునని అన్నాడు. శకుని ఓడినవి అన్నియు తాను ఇత్తునన్నాడు. దుర్యోధనునకు మనసా, వాచా, కర్మణా జూదముతో సంబంధము ఉన్నది. ఈ విషయము సాత్యకి స్పష్టపరచినాడు.





