Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"ధర్మరాజు దుర్యోధనునితో జూదమాడినాడు. మోసపోయినాడు. ఓడినాడు. దుర్యోధనునకు జూదవిద్యలో నేర్పరితనము లేదు. అందువలన బంధు జనులు అతనిని వారించినారు. అతడు మానుకున్నాడు. శకునిని నియమించినాడు. శకుని జూదవిద్యలో నిష్ణాతుడు. ధర్మరాజు శకునితో జూదము ఆడినాడు. పందెములు ఓడినాడు. రాజ్యమును పోగొట్టుకున్నాడు. అందుకు దుర్యోధనుని నిందించరాదు. అందువలన వినయ పూర్వకముగ ప్రార్ధించు వానినే దుర్యోధనుని వద్దకు పంపవలెను" అని బలరాముడు ముగించినాడు. బలరాముని మాటలకు సభలో సంచలనము కలిగినది. కలకలము బయలుదేరినది.
అది చూచినాడు సాత్యకి. లేచినాడు. సభను నిశ్శబ్దపరచినాడు. సాగించినాడు.
"బలరామా! బహువింతగా మాట్లాడినావు. ఇట్లు నీవు తప్ప మరొకరు మాట్లాడలేరు. ఏమీ ధర్మజుడు తన వేడుకకు జూదము ఆడినాడా? ఆడుదునని ముందుకు వచ్చినాడా? దుర్యోధనుడు సభలోనికి ధర్మజుని పిలిపించలేదా? జూదము ఆడమని బలవంతము చేయలేదా? కపట జూదము ఆడించలేదా? పాండవులను ఓడించలేదా? ఇదియే ధర్మమా? దీనినే ధర్మమందురా? బాగు బాగు. మంచి ధర్మము చెప్పినావు.
ధర్మజునియందు దోషమున్నదని చెప్పగలవారు ఉన్నారా? ఆమాట అన్నవారు ఈసభ నుంచి సగౌరవముగా బయట పడగలరా? నీవు బలరాముడవు. అందువలన బయటపడినావు".
"పాండవులు మోసగించబడినారు. అయినను పరాక్రమించలేదు. ధర్మమునాకు లొంగినారు. అరణ్యవాసము, అజ్ఞాతవాసము పూర్తి చేసినారు. తమ పితృ ధనమును సాధించదలచినారు. అందుకు వారి ప్రతాప విక్రమాలను ప్రదర్శింతురు. వారు ఇతరులను అర్ధించరు. శత్రువులు సాధువులను మెచ్చరు. అర్ధించినను దుర్యోధనుడు పాండవులను మెచ్చడు"
"యుద్దమున జయలక్ష్మిని సాధించుట రాజ ధర్మము. దుర్యోధనుడు దురాత్ముడు. మాటలకు లొంగకున్న నా బాణ బలమున అతనిని లొంగతీతును. పాండవులకు రాజ్య భాగము ఇప్పింతును. ఇదిగో నా శరము దీనికి తిరుగులేదు".
"యుద్దమున భీమార్జునుల పరాక్రమ జ్వాల ముందు నిలువగలవాడు లేడు. భీమార్జునులు, నేను, నకుల సహదేవులు, అభిమన్యుడు మున్నగు కుమారులు, ద్రుపదుడు మున్నగు పాంచాలురు, యాదవులు, విరాటుడు తమ సైన్యములను కూర్చుకొని రణరంగమునకు ఉరికిన దుర్యోధనాది నూరుగురు ఒక్కసారే చత్తురు".
"యుద్దమున రాజ్యమును వశపరచుకొనుట శ్రేష్ఠమని నా నమ్మకము. నా అభిప్రాయము. నా మతము. ఈలోపల దూతను పంపిన పంపవచ్చును. కాని దూత దైన్య భావము ప్రదర్శించరాదు. ధైర్యముగా మాట్లాడవలెను. పాండవుల రాజ్య భాగమును 'దేహి' అని అడగరాదు. అది పాండవుల హక్కు అని మాట్లాడవలెను. అందుకు దుర్యోధనుడు సమ్మతించైనా సరి. రాజ్య భాగము ఇచ్చెనా మంచిది. అట్లుకాకున్న తన వెఱ్ఱితనపు ఫలమును రణరంగమున అనుభవించగలడు" సాత్యకి తన మాటలలో అగ్గి కురిపించినాడు. సభ సాంతము ఆవేశమున పొంగిపొర్లినది.
సాత్యకి ముగించినాడు. ద్రుపదుడు లేచినాడు.
"రాజులారా! సాత్యకి ధర్మయుక్తముగా మాట్లాడినాడు. బలరాముడు చెప్పినది సమంజసము కాదు. దుర్యోధనుడు దుర్మార్గుడు. వీరుడు. అతడు మాటలకు లొంగడు. రాజ్యము పంచడు. దుర్జనుని మనసు మంచి మాటలను మెత్తపడదు. యుద్దముననే దుర్యోధనుడు లొంగును. మంచి మాటలకు దుర్జనుడు అపహసించును. వానికి దురభిమానము పెరుగును. మదము హెచ్చును. ఎదుటి వానిని బలహీనునిగా భావించును".
"భీష్మ, ద్రోణాదులు వృద్ధులు. ధర్మము తెలిసినవారు. అయినను దుర్యోధనుని వద్ద పొట్టకూటికి పడి ఉన్నారు. వారు దుర్యోధనునికి ఎదురు చెప్పరు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. అతనికి పుత్రవాత్సల్యము ఎక్కువ. కొడుకును దూషించు శక్తి లేకున్నాడు. కర్ణాదులు దుర్యోధనుని ముఖస్తుతి చేసి పబ్బము గడుపుకొనుచున్నారు. కావున దుర్యోధనుడు దుష్టబుద్ది అయి ఉన్నాడు. అందువలన యుద్దము తథ్యము".
"ఈ సమయమున మనము యుద్దమునకు సన్నాహములు చేయవలసి ఉన్నది. ఎంతటి బలవంతులయినను అన్యుల సాయములేక శత్రువును గెలవరాదు. కావున యుద్దసాయమునకు పిలువ వలసిన రాజులను పిలువవలెను. దుర్యోధనుడు కూడ సాయము ఆశించి రాజులను పిలుచును. యోగ్యులగు ప్రభువులు మొదట పిలిచిన వారికే సాయముచేతురు. కావున మనము జనులను పంపి శల్య, కేకయ, మాగధ, సహదేవ, ధృష్ణకేతు మొదలగు రాజులకు, వారి బంధు మిత్రులకు తెలియపరచి సహాయము కోరుట మన ప్రథమ కర్తవ్యము" ద్రుపదరాజు అట్లన్నాడు. మరియు
ఇతడు మదీయాగ్రపురో
హితుడితనికి నెల్లపనులు నెఱింగించి తగన్
ధృతరాష్ట్రుకడకు బనుపుడు
చతురవచన గరపి సంప్రీతి మెయిన్





